పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన షోయబ్ అక్తర్.. తన కెరీర్లో ఎంతో మంది క్రికెటర్లను తన పదునైన బంతులతో భయపెట్టాడు. తన కెరీర్లో ఎన్నో అరుదైన మైలురాళ్లు అందుకున్న ఇతడు.. పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్‌ను మాత్రం నెట్స్‌లో ఔట్ చేయలేకపోయినట్లు చెప్పాడు.
" ఇంజమామ్ నా బంతి శైలితో పాటు అది ఎలా వస్తుందో ముందుగానే అంచనా వేయగలిగేవాడు. బంతిని గమనించే టాలెంట్‌లో మిగతా బ్యాట్స్మన్లతో పోలిస్తే కొంచెం ముందుంటాడు. అందుకే నెట్స్‌లో పదేళ్లలో ఒకసారి కూడా ఔట్ చేయలేకపోయా"
-- షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
ఆసీస్ పేసర్ బ్రెట్‌లీ రికార్డులనే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగేవాడినని వెల్లడించాడు అక్తర్. ప్రపంచంలో వేగవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకోవాలని తపనపడేవాడినని చెప్పాడు. ఎట్టకేలకు 2003 ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి ఆ ఘతన అందుకున్నాడు.
ద్రవిడ్ ఢిఫెన్స్ దారుణం..
న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ క్రోవ్, భారత ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన ప్లేయర్లని కితాబిచ్చాడు అక్తర్. ద్రవిడ్ బ్యాటింగ్ శైలి చూడముచ్చటగా ఉంటుందని చెప్పాడు.
" ద్రవిడ్ షాట్లు ఆడటానికి ట్రై చేయకపోతే.. నేను అతడి ఢిఫెన్స్‌ను ఛేదించలేను" అని తెలిపాడు అక్తర్. దక్షిణాఫ్రికా ప్లేయర్ జాక్వస్ కలిస్ అద్భుతమైన ఆల్‌రౌండర్, స్లిప్ ఫీల్డర్ అని పేర్కొన్నాడు.
ఇప్పటికీ క్రికెట్లో కొనసాగితే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బయట స్నేహితులుగా, మైదానంలో శత్రువులుగా ఉండేవాళ్లమని తెలిపాడు. విరాట్ దృష్టి పెట్టి ఆడితే ఇంకా బాగా ఆడతాడు కాబట్టి అతడి ఫోకస్ కోల్పోయేలా చేసి.. ఔట్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు అక్తర్.
గాయాల కారణంగా కెరీర్లో ఎక్కువ కాలం కొనసాగించలేకపోయిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అక్తర్.. టెస్టుల్లో 178 వికెట్లు, వన్డేల్లో 247 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఇదీ చూడండి: వరల్డ్‌కప్‌లో దాదా, వాల్ కాంబినేషన్ సూపర్‌హిట్