ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అన్ని టీ20 టోర్నమెంట్ల కంటే రసవత్తరంగా ఉంటుందని పేర్కొన్నాడు న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకన్నాడు మిచెల్.
2018 ఐపీఎల్ వేలంలో సాంట్నర్‌ను సీఎస్కే కొనుగోలు చేసింది. అయితే, ఆ సమయానికి అతను గాయపడటం వల్ల.. టోర్నమెంట్లో ఆడలేకపోయాడు. 2019 ఎడిషన్‌లో జట్టు కోసం కొన్ని మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. ఇందులో సీఎస్కే తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి.. 4 వికెట్లు పడగొట్టాడు.
"అవును. ఐపీఎల్ అన్ని టీ20 టోర్నమెంట్లకు పరాకాష్ట అని అనుకుంటున్నా. నేను 2018లో ఈ లీగ్‌కు ఎంపికైనప్పుడు చాలా సంతోషించా. చెన్నై జట్టులో మాట్లాడటానికి, ఆడేందుకు హర్భజన్ లాంటి కొంత మంది అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. అంతే కాదు, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్ లూ ఉన్నారు. అయితే నేను మొదటి ఏడాది గాయపడినప్పుడు చాలా నిరాశ చెందాను. కానీ 2019లో ఆ అద్భుతానందాన్ని అనుభవించే అవకాశం లభించింది. ఇది నమ్మశక్యం కాని టోర్నమెంట్. ధోనీతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సురేశ్ రైనా వంటి ఆటగాళ్లు కూడా అద్భుతం."
-మిచెల్ సాంట్నర్, న్యూజిలాండ్ క్రికెటర్
సాంట్నర్ ఇప్పటివరకు న్యూజిలాండ్ తరఫున 22 టెస్టులు, 72 వన్డేలు, 44 టీ 20లు ఆడాడు. మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి 162 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ మార్చిలోనే నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడింది. అయితే అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లీగ్‌ను ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.