ఐపీఎల్ విస్తరణకు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్. నాణ్యత విషయంలో రాజీపడకుండా దేశంలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని సూచించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని, మనోజ్ బదాలే రచించిన 'ఏ న్యూ ఇన్నింగ్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నాడు ద్రవిడ్.
"ప్రతిభావంతులకు చోటు కల్పించే దిశగా.. విస్తరణకు ఐపీఎల్ సిద్ధంగా ఉందని నేననుకుంటున్నాను. అవకాశం రానందున ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు బయటే ఉండిపోయారు. ఎక్కువ జట్లు ఉంటే అందరికీ అవకాశం దొరుకుతుంది. నాణ్యమైన ఆట సాగుతుంది."
-- రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్.
ద్రవిడ్ అభిప్రాయాన్ని మనోజ్ బదాలే స్వాగతించారు. మాజీ ఇంగ్లీష్ క్రికెటర్ సైమన్ హ్యూజ్స్తో కలిసి బదాలే 'ఏ న్యూ ఇన్నింగ్స్' పుస్తకాన్ని రాశారు.
అందుకే ముంబయి గెలిచింది..
ప్రపంచ స్థాయి టీ20 యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నందునే ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్.. ఐదుసార్లు విజయం సాధించిందన్నాడు ద్రవిడ్. ఐపీఎల్ ద్వారానే హరియాణాకు చెందిన రాహుల్ తెవాతియా, చాహల్, అమిత్ మిశ్రా, జయంత్ యాదవ్‌ల ఆటతీరు ప్రపంచానికి పరిచయమైందని చెప్పాడు. ఆటగాళ్లు తమ అనుభవంతోనే మెరుగైన ప్రదర్శన చేయగలుగతారని అన్నాడు.
రానున్న ఐపీఎల్ 2021 కోసం 9 జట్లను ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. 2023 నాటికి 10 జట్లు ఉండాలని భావిస్తోంది.
ఇదీ చదవండి:నిస్వార్థ క్రికెట్ సేవకా.. నీరాజనం!