ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తొలి సెషన్‌లో ఆధిపత్యం చెలాయించగా రెండో సెషన్‌లో విఫలమైంది. కీలక సమయంలో రిషభ్ పంత్(97; 118 బంతుల్లో 12x4, 3x6), పుజారా(77; 205 బంతుల్లో 12x4) ఔటవ్వడం వల్ల ఫలితంపై ఆసక్తి పెరిగింది. భోజన విరామం తర్వాత దూకుడు పెంచిన పంత్.. లియోన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కమిన్స్ చేతికి చిక్కాడు. దీంతో అతడు తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అప్పటికి భారత్ స్కోర్ 250/4గా నమోదైంది.
తర్వాత విహారి(4; 52 బంతుల్లో) క్రీజులోకి రావడం వల్ల స్కోర్ బోర్డు నెమ్మదించింది. అతడు పూర్తిగా డిఫెన్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే కమిన్స్ వేసిన 83వ ఓవర్‌లో పుజారా హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. కాసేపటికే హెజిల్‌వుడ్ బౌలింగ్‌లో అతడు ఔటవ్వడం వల్ల భారత్ 272 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆపై క్రీజులోకి వచ్చిన అశ్విన్(7; 25 బంతుల్లో 1x4)తో కలిసి విహారి బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో రెండో సెషన్‌లో టీమ్‌ఇండియా 96 ఓవర్లకు 280/5తో నిలిచింది. చివరి సెషన్‌లో భారత్ విజయానికి 127 పరుగులు కావాలి.