రెండ్రోజుల్లోనే ముగిసిన అహ్మదాబాద్ టెస్టు పిచ్‌పై విమర్శలు గుప్పిస్తున్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు.. స్టువర్ట్ బ్రాడ్ 15 పరుగులకే 8 వికెట్లు తీసిన పిచ్ గురించి కూడా మాట్లాడాలని భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. అహ్మదాబాద్ పిచ్‌పై మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్, అలిస్టర్ కుక్ విమర్శల నేపథ్యంలో అతనిలా వ్యాఖ్యానించాడు.
"టెస్టు మ్యాచ్ అంటేనే ఎలాంటి పిచ్‌పైనైనా ఆడడం. అది పేస్ వికెట్ కావొచ్చు. స్పిన్ పిచ్ కావొచ్చు. ఇంగ్లాండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో భారత బౌలర్లు గొప్పగా బంతులేశారు. వారు వేసిన లైన్ అండ్ లెంగ్త్‌ను గమనిస్తే ప్రతి బంతీ వికెట్‌కు తగిలేలా కనిపించింది. ఇలాంటి పిచ్ గురించి ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మాట్లాడుతున్నారు. కానీ వాళ్లు స్టువర్ట్ బ్రాడ్ (8/15) ప్రదర్శనపై కూడా మాట్లాడితే బాగుంటుంది. అతను వికెట్లు తీసిన పిచ్ ఎలాంటిది? పచ్చికతో కళకళలాడే పిచ్‌పై టెస్టు 2-3 రోజుల్లో పూర్తయితే ఫర్వాలేదా? అదే బంతి బాగా స్పిన్, బౌన్స్ అయితే ఇది ఐదు రోజుల పిచ్ కాదని విమర్శిస్తున్నారు" అని ఓజా అన్నాడు.
ఇదీ చదవండి: ఫెదరర్ రికార్డ్‌ను సమం చేసిన జకోవిచ్