కరోనా దెబ్బకు భారత్‌లో మరో ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్-అక్టోబర్‌లో ఇంగ్లీష్ జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. మూడు వన్డేలు, టీ20లతో కూడిన సిరీస్‌ను ఇరుజట్లు ఆడాల్సి ఉంది. కానీ వైరస్ కారణంగా వచ్చే ఏడాదికి ఇది వాయిదా పడుతుందని సమాచారం.
ఐపీఎల్‌పై ఇంకా సందిగ్ధమే..
మహమ్మారి వల్ల అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణను వాయిదా వేయాలని ఐసీసీ చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ మెగాటోర్నీ వాయిదా పడితే సెప్టెంబరు చివరి వారంలో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ.
అదే సమయంలో షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉంది. కాబట్టి ఐపీఎల్ నిర్వహిస్తే ఈ సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడుతుంది. ఇదే విషయంపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం.
ఇప్పటికే ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ, శ్రీలంక ముందుకొచ్చాయి. కానీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం ఈ టోర్నీని స్వదేశంలో నిర్వహించడమే తమ తొలి ప్రాధాన్యతమని ఇటీవలె స్పష్టం చేశాడు.
ఇది చూడండి : కరోనాను జయించిన బంగ్లా మాజీ సారథి మొర్తజా