మహేంద్ర సింగ్ ధోనీ.. అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే మ్యాచ్ ఎంత ఒత్తిడిలో ఉన్నా అతడు ప్రశాంతంగా ఉండటమే కారణం. అసలు ధోనీకి కోపం రాదా అని అనుకునేవారూ ఉన్నారు. అయితే మహీకి కూడా కోపం వస్తుందంట. దోనీ సహనం కోల్పోవడం తాను చాలాసార్లు చూశానని అంటున్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
"ధోనీ ఎప్పుడూ సహనం కోల్పోవడం చూడలేదని ప్రజలు అంటుంటారు. కానీ, పలు సందర్భాల్లో నేను చూశా. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఇతర మెగా ఈవెంట్లలో మేం సరిగ్గా రాణించనప్పుడు తను సహనం కోల్పోయాడు. అది నేను చూశా"
-గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ధోనీ మానవమాత్రుడేనని, అతడిక్కూడా భావోద్వేగాలు ఉంటాయని గంభీర్ తెలిపాడు. "ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడేటప్పుడు ఎవరైనా మిస్‌ఫీల్డ్ చేస్తే లేదా క్యాచులు వదిలేస్తే ధోనీ సహనం కోల్పోతాడు. అయితే, ధోనీ నిజంగానే చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఇతర సారథుల కన్నా ఎంతో సహనంతో మెలుగుతాడు. నా కంటే కూడా ధోనీనే ప్రశాంతంగా ఉంటాడు" అని గంభీర్ అన్నాడు.