టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్కు మీడియాలో వస్తున్న విమర్శలు ఓ కారణమని అన్నారు మహీ చిన్నప్పటి కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ. ఏడాది నుంచి ఆడని క్రికెటర్.. జట్టులోకి ఎలా రీఎంట్రీ ఇస్తాడు అని వాళ్లు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.
"2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భారత జట్టులోకి ఎలా రీఎంట్రీ ఇస్తాడు? అంటూ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు ధోనీ రిటైర్మెంట్కు కారణమేమో. మహీ నిర్ణయం తీసుకోవడంలో ఇది ఓ భాగమై ఉండొచ్చు. ఆ విషయం అతడికి మాత్రమే తెలుసు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు ఆడే ఫిట్నెస్ ధోనీలో ఉందని నా అభిప్రాయం. నేను కాదు చాలామంది ఇదే అనుకుంటున్నారు. అయితే అందరూ వీడ్కోలు పలకాల్సిన సమయం ఉంటుంది. ధోనీ రిటైర్మెంట్పై నేను బాధపడ్డా. అదే సమయంలో నా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకున్నా."
-కేశవ్ రంజన్ బెనర్జీ, ధోనీ చిన్ననాటి కోచ్
పాఠశాలలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్న ధోనీని క్రికెట్ ఆడుతావా? అంటూ వికెట్ కీపర్‌గా మార్చిన ఘనత కోచ్ కేశవ్‌కే దక్కుతుంది. ఈయన వల్లే మనం ఇన్నేళ్ల పాటు మిస్టర్ కూల్‌ను క్రికెట్లో చూడగలిగాం.
అదే విధంగా ధోనీ 7వ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని అన్నారు కోచ్ కేశవ్. టీమ్ఇండియా ఈ నంబర్ జెర్సీని ఎవరికీ ఇస్తుందనుకోవట్లేదని చెప్పారు. మహీ ఓ దిగ్గజం అని, 7వ నంబర్ జెర్సీ అతడి సొంతమని స్పష్టం చేశారు.