బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చిత్తుగా ఓడించింది. 321/7 (తొలి ఇన్నింగ్స్) ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 79 పరుగులు జోడించి 400 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో 223 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అశ్విన్(5), జడేజా(2), అక్షర్(1) స్పిన్ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. చివర్లో షమి రెండు వికెట్లు తీశాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (25*) టాప్ స్కోరర్.
అంతకుముందు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177. భారత్ తొలి ఇన్నింగ్స్: 400. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో (3/42)తో ఆకట్టుకున్న అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో (5/37).. తన స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో (5/47)తో అదరగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు 16 వికెట్లు పడగొట్టారు. కాగా, ఈమ్యాచ్‌లో షమీ ఓ అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 25 సిక్సులతో ఫుల్ టైం బ్యాటర్ కోహ్లీ(24 సిక్సులు)ని అధిగమించాడు.
అదరగొట్టిన అశ్విన్..
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో హ్యండ్స్‌కాంబ్ వికెట్ తీసిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను సాధించాడు. కాగా, అశ్విన్ ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో 19 టెస్ట్ మ్యాచ్లు ఆడి.. 97 వికెట్ల పడగొట్టాడు. దీంతో టీమ్ఇండియా మాజీ బౌలర్ హర్భజన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆశ్విన్ మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు.
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన షమీ..
టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ కూడా ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సులు(25) కొట్టిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ(24), యువరాజ్ సింగ్(21), కేఎల్ రాహుల్(17)ను అధిగమించాడు. మూడో రోజు ఆటలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు మహ్మద్ షమీ. వచ్చిన వెంటనే ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మొత్తం మూడు సిక్సులు బాది ఈ ఘనత సాధించాడు.