అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియతో జరుగుతున్న చివరి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు ఆడి ఒక్క వికెట్ నష్టపోకుండా మూడు పరుగులు చేసింది. క్రీజులో ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, కున్మెన్ ఉన్నారు.
అంతకుమందు టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోరు 289/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆట ముగిసేసమయానికి 10 వికెట్లు కోల్పోయి 571 పరుగులు చేసి ఆలౌటైంది. బ్యాటింగ్‌లో కోహ్లీ (186) డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ (79) హాఫ్ సెంచరీతో రాణించగా.. శ్రీకర్ భరత్ (44), జడేజా (28) పరుగులు చేశారు. దీంతో 91 పరుగుల ఆధిక్యాన్ని భారత్ సంపాదించింది. ఆసీస్ బౌలర్లలో నాథన్, మర్ఫీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, మాథ్యూ తలో వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల వద్ద ఆలౌటైంది. ఖవాజా (180), గ్రీన్ (114) సెంచరీలు బాది అదరగొట్టారు. ట్రావిస్ హెడ్ (32), స్టీవ్ స్మిత్ (38), నాథన్ లైన్ (34), మర్ఫీ (41) పరుగులతో రాణించారు. భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు స్కోరు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
విరాట్ కోహ్లీ ఘనతలు..
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. ఈ టెస్ట్‌లో అరుదైన ఘనతలు సాధించాడు. దాదాపు 1200 రోజుల నుంచి మోస్తున్న బరువును దింపేసుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు కోసం దాదాపు మూడున్నరేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. విరాట్‌కిది 28వ టెస్టు శతకం కాగా.. అన్ని ఫార్మాట్లు కలిసి మొత్తంగా 75వ సెంచరీ. మ్యాచ్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ వచ్చిన విరాట్ కోహ్లీ 241బంతుల్లో శతకం పూర్తి చేశాడు.
2019 నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీకి మరో శతకం సాధించడానికి దాదాపు 1200 రోజుల సమయం పట్టింది. దీని కోసం 41 టెస్టు ఇన్నింగ్స్‌లను తీసుకోవడం గమనార్హం. తన కెరీర్‌లో అత్యంత ఎక్కువ బంతులను తీసుకొని మరీ సెంచరీ సాధించడం ఇది రెండోసారి. ఇప్పుడు ఆసీస్‌పై 241 బంతుల్లో శతకం చేయగా.. గతంలో ఇంగ్లాండ్‌పై 289 బంతులను తీసుకున్నాడు.
- విరాట్ కోహ్లీ స్వదేశంలో దాదాపు పదేళ్ల తర్వాత ఆసీస్‌పై సెంచరీ నమోదు చేయడం గమనార్హం. గతంలో 2013లో చెపాక్ వేదికగా చేశాడు.
- దాదాపు 23 టెస్టుల్లోని 41 ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్‌ను తాకాడు. బంగ్లాదేశ్‌పై 2019 నవంబర్ 22న తన 85వ టెస్టులో శతకం కొట్టాడు.
- విరాట్ కోహ్లీ 2018 డిసెంబర్ తర్వాత ఆసీస్‌పై ఇదే శతకం చేయడం. 2018/19 సీజన్‌లో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని దక్కించుకోవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
- విరాట్ కోహ్లీకిది 28వ టెస్టు సెంచరీ కాగా.. అన్ని ఫార్మాట్లలో కలిపి 75వ శతకం. దీంతో సచిన్ తెందూల్కర్ ‘వంద’ సెంచరీల రికార్డును అందుకోవాలంటే ఇంకా 25 శతకాలు చేయాలి. సచిన్ 664 మ్యాచుల్లో ఆడగా.. విరాట్ ఇప్పటి వరకు 493 మ్యాచులను మాత్రమే ఆడాడు.
శతక్కొట్టిన గిల్..
మూడో రోజు ఆటలో టీమ్ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ శతక్కొట్టాడు. 235 బంతుల్లో 128 పరుగుల చేశాడు. దీంతో టెస్టు కెరీర్‌లో తన రెండో సెంచరీని నమోదు చేశాడు. కాగా, స్వదేశంలో గిల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం గిల్ 15వ టెస్టు ఆడుతున్నాడు. అయితే, మూడో టెస్టులో కఠిన పిచ్‌పై అనుకున్నంతగా రాణించలేకపోయాడు.