కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్‌లో.. భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ల జోరుకు బ్రేక్ పడింది. తోటి క్రీడాకారులంతా నిష్క్రమించినా సింధు, సైనా క్వార్టర్‌ఫైనల్ వరకు చేరారు. అయితే పతకాలపై ఎన్నో ఆశలు రేపిన వీరిద్దరూ శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యారు.
టాప్ సీడ్‌పై...
మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో.. టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో 21-16, 21-17 తేడాతో ఓడిపోయింది 6వ ర్యాంకర్ సింధు. 2019 ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత నుంచి సింధు మరో టైటిల్ గెలిచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. అవేమీ ఫలించట్లేదు. ఈ చైనీస్ క్రీడాకారిణితో ఇప్పటివరకు 17 సార్లు తలపడిన తెలుగమ్మాయి.. 12సార్లు పరాజయం చెందింది.
ఒలింపిక్ ఛాంపియన్‌పై...
శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఖంగుతింది సైనా నెహ్వాల్. 16-21, 16-21 తేడాతో తెలుగమ్మాయిని ఓడించిందీ ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా.
పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 19-21, 20-22 తేడాతో లీ జియా (మలేసియా) చేతిలో, ప్రణయ్ 14-21, 16-21తేడాతో టాప్ సీడ్ కెంటొ మొమొట (జపాన్) చేతిలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పరాజయం చవిచూశారు.