తమ అందచందాలతో.. కిర్రాక్ డ్యాన్సులతో నిన్నటితరం కుర్రకారు మతులు పోగొట్టిన అందాల నటీమణులు వీరు. మన్మథుడిని సైతం తమ సోగ కళ్లతో కట్టిపడేయగల వయ్యారి భామలు. వారే అనూరాధ, షకీలా! అందంతో పాటు మంచి మనసున్న వీరి జీవితాల్లోని సంతోషాలను, కష్టనష్టాలను పంచుకోవడానికి 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు. మరి ఆ సంగతులేంటో చూద్దామా!
పోస్టర్లు చూసి..
'మీ పోస్టర్స్ చూసి బయట ఇబ్బంది పడిన రోజులున్నాయా?' అని వ్యాఖ్యాత ఆలీ అడిగిన ప్రశ్నకు నటి షకీలా మాట్లాడుతూ.. "అస్సలు ఇబ్బంది పడలేదు. చాలా సంతోషమేసేది. కెరీర్ ప్రారంభంలో చిత్రాలు చేస్తున్నపుడు, పోస్టర్‌పై నా బొమ్మ నేనే గుర్తుపట్టలేనంత చిన్నగా ఉండేది. స్టార్‌డమ్ వచ్చాక కేవలం నా ఫొటో మాత్రమే పోస్టర్‌పై ఉండేది. చాలా ఆనందపడేదాన్ని. అస్సలెప్పుడూ బాధపడలేదు!" అని చెప్పారు.
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం
పెళ్లి చేసుకోవడానికి కారణముందని వెల్లడించారు నటి షకీలా. "నా జీవితంలో ఒకసారి పెళ్లి తప్పిపోయింది. అసలు నాకు పెళ్లి మీద నమ్మకం లేదు. నేను ఎవ్వరితోనూ బంధానికి ఒప్పుకోను. ఎందుకంటే నేను గతంలో ఒక వ్యక్తిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అతను తాగుతున్నాడని ఆరునెలలు దూరంగా పెట్టాను. అంతే! అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. నాకప్పుడు అనిపించింది.. 'ఇద్దరం పదేళ్లు ప్రేమలో ఉన్నాం.. ఒక్క ఆరునెలలు దూరం పెడితే ఇలా చేశాడా? నిజంగా ప్రేమ ఎక్కడుంది? ఇలాంటి వాళ్ల కోసం నేనెందుకు ఏడవాలి?' అనిపించింది. ఎందుకంటే 15 ఏళ్ల వయసు నుంచి నా సంపాదనతోనే బతుకుతున్నా. ఎవ్వరూ నాకు ఏమీ చెయ్యలేదు. మరి అలాంటప్పుడు నేనెందుకు సర్దుకుపోవాలి. ఆ వచ్చేవాళ్లు నా సంపాదన తింటూ, నా ఆస్తిని అనుభవిస్తూ ఉంటే.. వాళ్లకెందుకు నేను సరెండర్ అవ్వాలి. అయినా ఇప్పుడు నా వయసు 43 సంవత్సరాలు. కొన్నాళ్లు పాటు సినిమాల్లో నటిస్తాను. ఆ తర్వాత అనూ అక్క దగ్గరకు వెళ్లిపోతా. అక్కడే ఉండిపోతాను" అని షకీలా చెప్పారు.
అమ్మే బాసటగా..
'మీకు కష్టం వస్తే ఎవరితో పంచుకుంటారు?' అని వ్యాఖ్యాత ఆలీ, అనురాధను ప్రశ్నించగా.. "నాకు కష్టం వచ్చినా, బాధ కలిగినా మా ఆడపడుచు భానుతో షేర్ చేసుకుంటాను. నా భర్త సతీశ్‌కు తను చెల్లెలు. ఆ తర్వాత నా కూతురు అభితో. ఎక్కువగా వీళ్లిద్దరితోనే నా కష్టాలు పంచుకుంటాను. అంతకుముందు అమ్మతో ఎక్కువగా చెప్పుకునేదాన్ని. నా భర్తకు ప్రమాదం జరిగినపుడు కూడా నా కష్టాలకు అమ్మ బాసటగా నిలిచేది. అంతటి అనుబంధం ఉన్న అమ్మ చనిపోయినపుడు బాధతో నాకు ఏడుపు కూడా రాలేదు. మమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకురావడానికి అమ్మ ఎన్ని కష్టాలు పడిందో అప్పుడు అర్థమైంది. ఇప్పుడు అమ్మలాగే నేనూ నా పిల్లలకు బాసటగా నిలుస్తున్నా. 'మా అమ్మే నాకు ధైర్యమని' అభి ఎప్పుడూ అంటూ ఉంటుంది" అని అనురాధ చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. ఆ పెళ్లిలో అవమానం జరిగింది.. ఏడ్చేశా: షకీలా