వారిది బుల్లితెర కలిపిన బంగారు జీవితం. ప్రేక్షకుల మనసెరిగిన డాక్టర్‌బాబుగా అలరించిన నటుడు ఒకరయితే, ఆమె తన అభినయంతో ఆకట్టుకున్న అందాల చంద్రముఖి. బుల్లితెరపై తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొంది వారి కుటుంబంలో ఒకరిగా ఒదిగిపోయి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ దంపతులు పరిటాల నిరుపమ్ - మంజుల. ప్రస్తుతం తెలుగువారి బుల్లితెర శోభన్‌బాబుగా అలరిస్తున్న నిరుపమ్ ఒకనాటి నటుడు, డైలాగ్ రైటర్ ఓంకార్ తనయుడే. తాజాగా తన భార్య మంజులతో కలిసి 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చారు. ఆలీ అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు నిరుపమ్ దంపతులు ఎలాంటి సమాధానాలు చెప్పారో.. ఆ సంగతులు ఏంటో తెలుసుకుందాం..
వెల్‌కమ్ టు ఆలీతో సరదాగా..
నిరుపమ్: థ్యాంక్ యు సర్. మాది విజయవాడ. పెరిగింది చదువుకుంది కొంతకాలం చైన్నై. స్థిరనివాసం ఏర్పరుచుకుంది హైదరాబాద్.
ఏంటి విజయవాడ చెన్నై, హైదరాబాద్ కథ?
నిరుపమ్: మానాన్న ఓంకార్. సినిమా రచయిత, నటుడు. చెన్నైలో ఉండేవారు. అమ్మ లెక్చరర్. కొంతకాలం గుడివాడలోనూ చదువుకుని మళ్లీ తిరిగి హైదరాబాద్ వచ్చా. ఇలా రకరకాలుగా తిరిగి ఇక్కడి వచ్చా.
మీది ఏ ఊరు?
మంజుల: బెంగళూరు. అక్కడ నుంచి హైదరాబాద్‌కి వచ్చా. నా మొదటి సీరియల్ 'చంద్రముఖి'. ఈటీవీలో వచ్చింది. నిరుపమ్ నాకు ఇద్దరికి ఇదే తొలి సీరియల్. ఇది ఆరున్నర సంవత్సరాలు వచ్చింది. మధ్యలో నిరుపమ్ (నవ్వుతూ) కల్పించుకుంటూ ఎలా వచ్చింది కదా ఇక్కడ నేను ఆధార్ కార్డు ఇప్పించా.
ఆధార్ కార్డు ఇప్పించావు బాగానే ఉంది. ఇంకేమీ ఇప్పించారు?
నిరుపమ్: ఇక వరుసగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ ఉండటానికి సరిపడా ఏమేమీ ఇవ్వాలో అన్నీ ఇచ్చేశా. మధ్యలో మంజుల కల్పించుకుంటూ..లైఫ్‌టైమ్ కార్డు కూడా ఇప్పించారు.
మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది. ఎంతమంది పిల్లలు?
నిరుపమ్: మంజుల: 2009లో పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు.
మీ పెళ్లినాటికి నాన్న (ఓంకార్) లేరు?
నిరుపమ్: 2007లో చనిపోయారు. అప్పటికి నా జీవితం గురించి ఏమీ అనుకోలేదు. మేం అప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. నేను సినిమాల్లోకి వెళ్తానని, నాకోసం వాళ్లు హైదరాబాద్ వచ్చేశారు. నిజానికి నాన్నకు అవసరం లేదు. సీరియల్స్ తో చాలా బిజీగా ఉన్నారు. నాకోసం హైదరాబాద్ వద్దామని అనుకున్నారు. ఇక్కడ ఇల్లు చూశాం. కానీ నాన్న గుండెపోటుతో చనిపోయారు.
రచయితగా మీనాన్న ఎన్ని సినిమాలకి, సీరియల్స్ రాశారు? బాగా పేరు తీసుకొచ్చిన సీరియల్ ఏది?
నిరుపమ్: దాదాపు ఇరవై ఐదు వరకు సినిమాకు రచయితగా పనిచేశారు. సీరియల్స్ అంటే యాభై వరకు రాసి ఉంటారు. 'ఇది కథ కాదు', 'పవిత్ర బంధం', 'కలిసుందాం రా'. ఏ సీరియల్ తీసుకున్న వాటిలో దామోదరం అనే పేరు పెట్టుకుంటారు. ఇది మా తాతయ్య పేరు.
మీ తాత ఏం చేసేవారు?
నిరుపమ్: మెడికల్ షాపు. నాకు జ్ఞాపకం వచ్చే సరికి ఆయన రిటైర్ అయ్యారు.
మరి మీ తాత మెడికల్ ఫీల్డ్.. నాన్న చిత్రసీమలోకి రావాలని ఎందుకు అనిపించింది?
నిరుపమ్: నాన్నకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. పెళ్లికి ముందే న్యూస్ రీడర్‌గా ఆల్ ఇండియా రేడియోలో పని చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్‌కు ఆర్టికల్స్ రాసేవారు. అక్కడ పనిచేసే ఒక ఎడిటర్ నాన్నను ప్రొత్సహించడం వల్ల చెన్నై వెళ్లారు. అంతేకాదు ఆయన నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌తో కలిసి వెళ్లారు. మధ్యలో ఆలీ అందుకుంటూ నేను కూడా కాట్రగడ్డ ఆఫీస్ దగ్గర మీ నాన్న ఎక్కవ చూసేవాడిని. 'పోలీస్ భార్య' చిత్రంలో నటుడిగా నాన్నకు మంచి పేరొచ్చింది.
ఇంతకీ మీ ఆవిడ సంగతేమిటి?
నిరుపమ్: నా కెరియర్ ప్రారంభించింది ఈటీవీలో వచ్చిన 'చంద్రముఖి' సీరియల్‌తో. చంద్రముఖి (మంజుల వైపు చూస్తూ) దొరికింది. నాకు మంచి పేరొచ్చింది.
చంద్రముఖి సీరియల్‌తోనే మీ పరిచయం జరిగిందన్నమాట?
నిరుపమ్: మంజులకు తెలుగులో 'చంద్రముఖి' సీరియల్ మొదటి. నా కెరీర్‌లో మాత్రం ఈ సీరియల్‌తోనే ప్రారంభమైంది.
మీ అమ్మకి నచ్చిందా 'చంద్రముఖి' మంజుల?
నిరుపమ్: నేను తీసుకునే నిర్ణయాల మీద అమ్మకి చాలా నమ్మకం. ఒక్కసారి ఇంటికి తీసుకురా మాట్లాడదాం అని చెప్పి మాట్లాడింది. మధ్యలో మంజుల కల్సించుకుంటూ ఇంటికి పిలిపించి మాట్లాడారు. జాతకం కలవాలి. అని కచ్చితంగా చెప్పారు. అది కలిసింది. మా జీవితం బాగుంది.
మీ కుటుంబ సభ్యులు ఎంతమంది?
మంజుల: మొత్తం మేం నలుగురు సంతానం. నేను రెండోదాన్ని. అక్క, నా తర్వాత పుట్టిన చెల్లి యాక్టింగ్ వైపు రాలేదు. నేను నాలుగో చెల్లెలు చిత్రరంగంలోకి వచ్చాం. కీర్తి ఇక్కడే తెలుగులో సీరియల్స్ లోనే నటిస్తోంది. ఆమెకి పెళ్లైయ్యింది. ఆమె భర్త కూడా ఇదే రంగంలో ఉన్నారు.
అప్పుడప్పుడు అనిపిస్తుందా.. నాన్న జీవించి ఉంటే నా సక్సెస్‌ను చూసి ఆనందించేవారని..
నిరుపమ్: చాలా సార్లు అనిపిస్తోంది. అసలు నేను సినిమా రంగంలోకి వెళ్లాలి అనుకున్నా.
ఈ రంగంలోకి రావడానికి మీ నాన్న ప్రొత్సహించారా.. లేక వద్దని చెప్పారా?
నిరుపమ్: నాన్నకి ఇష్టం లేదు. అందుకే నా చుట్టుపక్కల సినీ వాతావరణం ఉండేనిచ్చేవారు కాదు. అయితే అప్పుడు మా ఇంట్లోకి అసిస్టెంట్ దర్శకులు వచ్చేవారు. అప్పుడు నేను వారితో కలిసి ఉండేవాడిని. అప్పుడు నాన్న వెళ్లి పనిచూసుకో అంటూ చెప్పేవారు. నా ఇంజనీరింగ్ చదువు అయిపోచ్చింది. పై చదువుల కోసం నేను అమెరికా వెళ్తారని అనుకున్నారు. ఓ రోజు నాన్న నన్ను చెన్నైలోని ఆంధ్రాక్లబ్ తీసుకెళ్లి ఇంజనీరింగ్ అయిపోతుంది. తర్వాతే ఏమిటి అడిగారు. నాన్న చాలా సరదాగా ఉంటారు నాతో. కొంచెం నేను కూడా కళామాతల్లికి సేవ చేసుకోవాలని ఉంది అన్నా. అంతే అక్కడి నుంచి వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. ఆరోజు ఆయనకు నిద్రపట్టలేదు. అప్పుడు అమ్మ అడిగింది. ఏంటి ఇంత పొద్దున్నే లేచావు నాన్నను. వాడు నిన్న నాకో షాకింగ్ న్యూస్ చెప్పాడని అమ్మకు చెప్పారు. అమ్మ వాళ్ల తోబుట్టువులు ఏడుమంది. వాళ్లంతా ప్రిన్నిపల్స్, టీచర్లు. వారిలా ఏదో శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటాని అనుకుంది. నేను సినిమా అనే సరికి అమ్మకి కోపం వచ్చి. ఏంటి ఇంత చదువు చదివించింది ఇందుకోసమేనా అని ఏడ్చేసింది. ఇక నాన్న మాత్రం ఒక్కటే చెప్పారు. ముందు చదువు పూర్తి చేసుకో ఆ తర్వాత ఓ నిర్ధిష్ట సమయం పెట్టుకొని ప్రయత్నించమని సలహా. ఓ సారి నన్ను మా సీరియల్లో హీరో వేషం ఉంది. చేస్తావా అని అడిగారు. నేను సినిమాల్లో తప్ప సీరియల్స్ చేయనని చెప్పాను. తమిళం సినిమాల్లో కొద్దిగా ప్రయత్నించా కానీ మనం ఇక్కడ సరిపోం అనిపించింది.
మీరు తెలుగు సీరియల్స్ ఎలా వచ్చారు?
మంజుల: మొదట్లో కన్నడలో చేశాను. కానీ అస్సలు నేను నటించాలని అనుకోలేదు. అలాంటి ఆశలు కూడా పెట్టుకోలేదు. ఓసారి ఆడిషన్న్ జరుగుతుంటే మానాన్న స్నహితులే మీ అమ్మాయి బాగుంటుంది కదా. ఆడిషన్న్కు పంపించు అని చెప్పారు. అప్పుడు నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా. సరే అని ఆడిషన్స్‌కి వెళ్లా సెలక్ట్ అయ్యాను. అలా వచ్చా. కన్నడలో ఆర్కా మీడియాలో చేసేటప్పుడే తెలుగులోనూ వాళ్లే చేస్తున్నారు. అప్పుడే నన్ను తెలుగులో నటించమని అడిగారు. నేను మాత్రం చెయ్యను అని చెప్పా. ఎందుకంటే నాకు భాష తెలియదు. వేరే రాష్టం. ఇక్కడ తెలిసిన తెలుగు స్నేహితులు కూడా ఎవరూ లేరు. నాకు కష్టం అవుతుందని చెప్పా. కానీ వాళ్లు చెయ్యండమ్మా చాలా బాగుంటుందని చెప్పారు. అంతేకాదు నాకోసం కన్నడ తెలిసిన కోడైరక్టర్ పెట్టారు. అప్పుడు ఒప్పుకున్నా. వచ్చి ఇక్కడ చేశాను. అరె ఊరికే భయపడ్డాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇక్క అక్కడి నుంచి తెలుగులో 'చంద్రముఖి'తో నా కెరీర్ ప్రారంభమైంది.
నిరుపమ్‌ని మొదటిసారి చూడగానే నీమదిలో ఏమనిపించింది?
మంజుల: నిరుపమ్ వైపు చూస్తు (నవ్వుతూ)..అప్పడాయన చాలా సన్నగా ఉండేవారు. మధ్యలో నిరుపమ్ కల్పించుకుంటూ "అప్పుడు నేను గుండుతో ఉన్నాను (అప్పటికే నాన్న చనిపోయారు). నన్ను చూసి ఇంతకంటే మంచి హీరో దొరకలేదా.. చెన్నైని నుంచి తీసుకురావాలా అని" అంది. నాకు ఇదే అభిప్రాయం మనసులో ఉంది. తర్వాత ఆయన నటన చూసి మంచి అభిప్రాయం కలిగింది. కొత్తగా ఎవరైనా యాక్టింగ్‌లో వస్తే తెలిసిపోతుంది. కానీ ఆయన నటన అలా అనిపించలేదు. బాగా చేశారు.
మీ ఇద్దరు ముద్దుగా ఏమని పిలుచుకుంటారు?
నిరుపమ్ - మంజుల: నేను మంజు అని పిలుస్తా. పెళ్లికి ముందైతే గుండు..లడ్డులాంటి పేర్లతో. నేనైతే ముద్దొచ్చినప్పుడు బక్కోడా అని పిలుచేస్తా.
మీ ఆయన్ని రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు బక్కచిక్కిన శోభన్‌బాబు అని అంటారట?
నిరుపమ్: లేదండి. మధ్యలో మంజుల కల్సించుకుంటూ అవును తెలుసు.
కథ వినాలన్నా.. సీరియల్ చేయాలన్నా అటొకరు ఇటొకరు ఉంటేనే చేస్తావని వార్త?
నిరుపమ్: అలాంటి ఏమీ లేదు. మీరు సీరియల్ చేయాలంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందేనా అని పదే పదే అడుగుతూ ఉంటే అలా ఉంటేనా చేస్తాను అని ఏదో చిరాకుగా ఉన్నప్పుడు చెప్పాను.
అదే చిరాకుతో ఓ పెద్ద దర్శకుడితో 'మీ ఆడిషన్స్' పూర్తి అయితే నేను టీవీ సీరీయల్స్ కి వెళ్లాలి అన్నారట ఎవరు పెద్ద దర్శకుడు?
నిరుపమ్: నాకు వేరే దారిలేక ఆ మాట చెప్పాల్సి వచ్చింది. సీరియల్ అనగానే ఓ చిన్నచూపు. ఆడిషన్స్‌కి పిలిచినపుడు ఆడిషన్ చేయాలి కదా. కానీ ఏం చెప్పకుండా సీరియల్‌గా చేస్తున్నానే మాట విని పంపిస్తే, ఎవరికైనా బాధ కలుగుతుంది కదా. బాగా తెలిసిన వాళ్లుంటేనే ఆడిషన్స్‌కి వెళ్తా. దూసుకుపోయే మనస్తత్వం కాదు నాది.
అష్టాచమ్మా సినిమాలో అవకాశం చేజారిపోయిందట?
నిరుపమ్: అవును. నాకో సీన్ కూడా ఇచ్చారు. దానికోసం ప్రిపేర్ అయ్యా. కానీ సాయంత్రం నా సీరియల్ చూసి. మీరు టీవీలో నటిస్తున్నారా. అయితే ఓకే అన్నారు. నేను ఆడిషన్స్ ఎప్పుడు రావాలంటే ఇంకెందుకూ అని చెప్పారు. నాలా ఎంతోమంది అవకాశాలు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఇతనికి కూడా ఓ మంచి రోల్ ఇద్దామని ఆలోచించే ఆ ఒక్కరు ఎవరో ఒకరు ఉంటారు కదా.
మీ ఇంటిపేరు గల అతను గొప్ప వ్యక్తి ఉన్నారా అని మీకు తెలుసా?
నిరుపమ్: పరిటాల రవి. ఆయన పేరు వాడాను ఇంద్ర సినిమా టిక్కెట్ కోసం.
ఆమె కూడా పరిటాల ఇంటి పేరును ఉపయోగించుకుందట?
నిరుపమ్: లైసెన్స్ కోసం. డ్రైవింగ్ టెస్ట్‌కి వెళ్లాను. నా పేరు చూసి మీరు బంధువులా అని అడిగారు. 'లైసెన్స్ రావాలి కదా' అవును అని చెప్పా. వెంటనే సీల్ వేసి ఇచ్చారు.
మీ నాన్న నిన్ను హీరోగా చేయడానికి ఓ కథ చెప్పి ఒప్పించారట. ఇది నిజమేనా?
నిరుపమ్: అవును సినిమా కథ చర్చలు జరిగాయి. నాకు ఏంటంటే భరోసా. నా కెరీర్ నాన్నే చూస్తారులే అని సినిమా సంబంధాలను పెద్దగా పట్టించుకోలేదు. నేను డ్యాన్స్, ఫైట్స్ గురించి నేర్చుకుంటున్నాను. ఆల్బమ్ కూడా ఆయనే పంపించారు. హైదరాబాద్ షిఫ్టు అయ్యాక ప్రాసెస్ జరుగుతుందని అనుకున్నా. ఈలోపు నాన్న చనిపోయారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి అనేది నాకు తెలియదు. మళ్లీ నా జీవితం మొదటి మెట్టు నుంచి మొదలుపెట్టినట్లు అయ్యింది.
ఏదో మీరు సీరియల్ చేసిన తర్వాత మీ మెయిల్స్‌కి అంతుచూస్తాం..చంపేస్తామని హెచ్చరికలు వచ్చాయంట?
నిరుపమ్: చంపేస్తామని కాదు కానీ. బాగా పేరొచ్చిందని పొగరా, ఏం చూపించినా చూస్తారనుకుంటున్నావా? చెప్పుల దండేసి సన్మానం చేస్తాం. బయట కనిపించావంటే లాంటి వార్నింగులు వచ్చాయి. ఇదంతా పాత్రల మీద వారు పెంచుకున్న అతి ప్రేమ. సీరియల్‌ని సీరియల్‌గా చూస్తే ఏం కాదు. ఇప్పుడు నా మీద మీమ్స్ కూడా వస్తున్నాయి అంటే గొప్పే కదా. సినిమాలకు తప్ప సీరియల్స్ మీద రావడం చాలా అరుదు.
మీకు ఆడవాళ్లు ఎక్కువగా అభిమానులు ఉన్నారు కదా? లెటర్స్, కాల్స్ ఏమైనా వస్తుంటాయా?
నిరుపమ్: అవును కాల్స్ వస్తుంటాయి. మొబైల్ నా దగ్గరే ఉంటుంది. పాత్ర పేరు చెప్పి మాట్లాడుతున్నారంటే అభిమానులే అని తెలిసిపోతుంది. అలా ఓసారి బ్రహ్మానందం ఫోన్ చేశారు. కాల్ ఏదో తేడాగా ఉందని, రాంగ్ నంబర్ అని ఫోన్ కట్ చేశాను. తర్వాత ట్రూ కాలర్లో చూస్తే ఆయన పేరే వచ్చింది. తర్వాత ఆయనకు ఫోన్ ఎలా చేయాలనే డైలామాలో ఉండగానే మళ్లీ ఆయనే చేశారు. అప్పడు సారీ చెప్పాను. ఫర్వాలేదు. నేను కూడా అలానే చేస్తుంటాలే అని చెప్పి, బాగా చేశావయ్య అంటూ మెచ్చుకున్నారు. అన్ని సినిమాలు చేసిన బ్రహ్మానందం నుంచి కాంప్లిమెంట్ రావడం చాలా గ్రేట్.
ఏదైనా సినిమాల్లో నటించావా? వాటిల్లో నటించే అవకాశం ఎలా వచ్చింది?
నిరుపమ్: రెండు సినిమాల్లో నటించా. అల్లరి నరేశ్ నటించిన 'ఫిటింగ్ మాస్టర్'. 'రభస' చిత్రం ఒకటి. ఈవీవీ సత్యనారాయణను ఓ సారి కలిసి అడిగా. సరే చూద్దాం అన్నారు. అప్పుడనుకున్నా. ఈయన కూడా అందరిలా అని. ఓ సారి ఫోన్ చేసి అడిగా. 'ఓ సారి రండి అని అన్నారు. వెంటనే డేట్స్ ఇచ్చేసి వెళ్లు' అన్నారు. చాలా సంతోషం వేసింది. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశా. చాలా మంచి పాత్ర.
ఇప్పుడు మంచి పోజీషన్‌లో ఉన్నావు. ఇదంతా నీ కష్ణార్జితం?
నిరుపమ్: అవును. నా స్థాయిలో నేను బాగానే ఉన్నాను.
మీ భర్తలో ఉన్న మంచి లక్షణం, చెడ్డ లక్షణం ఏమిటి?
మంజుల: నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇది మంచి లక్షణం. మిగతా అన్ని విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని నా అభిప్రాయం. దేన్ని సీరియస్‌గా తీసుకోరు.
జరిగేదే జరుగుతుందిలో చూద్దాం అనేది మీ ఉద్దేశమా?
నిరుపమ్: నేను దేని గురించి ఎక్కువగా ఆలోచించను. ఓ వారంలో మంజు పుట్టినరోజు వస్తుందనుకోండి. ఆరోజు ఎక్కడి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోవాలన్నది ఆమె కోరిక. నాకేమో షూటింగ్‌లు బిజీ. అదేరోజు షూటింగ్ చాలా అర్జంట్ వాళ్లకి. అప్పుడు నేను వాళ్లకు షూటింగ్ వస్తానని చెప్పేశా. అది మంజుకి చాలా పెద్ద తప్పు కింద చూస్తుంది. నా పుట్టినరోజు నీకు తెలియదా. ఎన్ని సంవత్సరాలు నుంచి చూస్తున్నా. మధ్యలో మంజు కల్పించుకుంటూ.. 'ఒక సంవత్సరం అయితే సరేలే అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కుదరలేదా. ఓకే వృత్తిలో ఉన్నప్పుడు ఇలాంటివి చిన్నచిన్న సమస్యలు వస్తాయని కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నా.
మీ ఇద్దరి సంబంధించిన కొన్ని కంప్లైంట్స్ మా దగ్గరకొచ్చాయి. వాటిని ఇక్కడే తేల్చేయాలి. మీరు షూటింగ్ వెళ్లేటప్పుడు నిరుపమ్ బట్టలన్నీ బయటపడేసి వెళ్లిపోతావట? ఇంట్లో ఏ పనిలోనూ సహాయం చేయరట?
నిరుపమ్: పనికి వెళ్లే హడావుడిలో బ్యాగులో ఉన్న బట్టలు తీసేసి. అక్కడున్నవి మళ్లీ బ్యాగ్‌లో సర్దుకొని వెళ్లిపోతాను. వాళ్లే చేసుకుంటారులే. ఎవరి కోసం చేస్తారులే అని నాకు లేదు. మీరు దయచేసి ఉద్యమాలు లేపకండి. మధ్యలో మంజుల కల్పించుకుంటూ అడగందే ఏదీ చేయరు. అడిగితే చేస్తారు.
మేకప్ స్టార్ట్ చేస్తే రెండు మూడు ఎపిసోడ్స్ అయిపోతాయంట? అన్నీ నెగటివ్‌గా ఆలోచిస్తావట?
మంజుల: ఆన్ స్ర్కీన్‌పైనే వేసుకుంటాను. కానీ ఆఫ్ స్ర్కీన్‌లో వేసుకోనుగా. ఏదైనా విషయం ఉంటే నేను పాజిటివ్, నెగటివ్ రెండు విధాలుగా ఆలోచన చేస్తా. కానీ నిరుపమ్ ఎప్పుడు పాజిటివ్‌గానే ఆలోచిస్తారు. నాకు అది నచ్చదు.
కాలేజీలో మిమ్మల్ని తల్లితండ్రులను తీసుకురమ్మంటే ఇంటి ఓనర్లను తీసుకెళ్లారట?
నిరుపమ్: హాస్టల్ని నుంచి గెంటేశారు. అది దీపావళి ముందురోజు వార్డన్ రూం ముందు టపాసులు పెట్టి తలుకొట్టాం. ఆయన తలుపుతీసుకొని రాగానే టపాటపా పేలాయి. అది ఎవరు చేశారో మా హెడ్ ఆఫ్ డిపార్టెమెంట్‌కి తెలిసింది. దాంతో వాళ్లు మా అమ్మనాన్నలను తీసుకురమ్మన్నారు. నాకు ఇంట్లో వాళ్లికి చెప్పేంత ధైర్యం లేదు. చాలా ఆలోచించా చివరకు మా స్నేహితుడి ఇంటి ఓనర్లను తీసుకెళ్లి అమ్మానాన్నలుగా పరిచయం చేసి గండం నుంచి బయటపడ్డా.
మీ అమ్మ నుంచి ఎలాంటి సపోర్టు ఉంటుంది?
నిరుపమ్: తొలి నుంచి సినిమాల్లో నటించం ఆమె ఇష్టం లేదు. ఫిటింగ్ మాస్టర్లో నేను చేసిన నెగటివ్ క్యారక్టర్. అందులో నేను ఫైట్స్ ఉంటాయి. కొన్ని చోట్ల తన్నులు తినే సన్నివేశాలు ఉన్నాయి. ఇవన్నీ అమ్మ చూసి ఎందుకురా ఇంత చదువుకుని తన్నించుకోవడం ఏంటి, అవసరమా నీకు అని అనేది.
ఇంత మంచి అబ్బాయి గోడలు దూకడం ఏమిటి?
నిరుపమ్: ఇంటర్‌మీడియట్‌లో గోడ దూకాను. ఆ తర్వాత మంజుల కోసం అర్థరాత్రి గోడ దూకాను. ఆమె పుట్టినరోజు కోసం.
మీ ఇద్దరిలో గొడవ పడితే ఎవరు ముందు రాజీకొస్తారు?
నిరుపమ్ - మంజుల: ఇది అందరి తెలిసిన విషయమే. భర్తే రాజీపడతారు. అణచివేతకు మగబతుకు బలౌతూనే ఉంది. ఆడవాళ్లు చేసేవి లెక్కబెట్టవచ్చు. కానీ మేం చేసేవి లెక్కలేనన్ని.
త్వరలో పరిటాల నిరుపమ్ కథ, మాటలు, రచన తెరపై చూడవచ్చా..
నిరుపమ్: డైలాగ్స్ రాయాలనే పెద్దగా కోరిక లేదు. ఓ నటుడిగా నేను నటనపైనే దృష్టి ఎక్కవ మొదటి నుంచి. మధ్యలో స్ర్కిట్ నచ్చి ఓ సినిమాకు డైలాగ్స్ రాయమన్నారు. రాశా. ఇప్పుడు కూడా సీరియల్స్‌కు అవసరం ఉంటే రాస్తున్నా. వెబ్‌సీరీస్ వైపు వెళ్లాని ఉంది.
ఈ వేదిక ద్వారా మీ ఆవిడకు కాకుండా ఇంకా ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నావు...
నిరుపమ్: మా అమ్మకు. నేను చిన్నప్పటి నుంచి అమ్మతోనే ఎక్కువగా ఉండేవాన్ని. ఎక్కువ తిట్టేది కూడా అమ్మనే. నా జీవితంలో ప్రతి సందర్భం, మలుపులోనూ ఆమె నాకు సపోర్టు. అమ్మ లేకపోతే నేను లేను. ఇక మా ఆవిడ గురించి పెద్దగా చెప్పకోవాల్సింది ఏమీ లేదు. ఆమెకు ఇష్టమైన కొనిపెడుతుంటే చాలు. మధ్యలో మంజుల కల్పించుకుంటూ నేను ఏదో చిన్నది అదీ కొనిపెట్టు..ఇదీ కొనిపెట్టు అని చిన్నచిన్నవి అడుగుతాను. నాకు కావాల్సింది ఏమిటంటే నాతో ఎక్కువ సమయం ఉండమని కోరుకుంటున్నా అంతే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. '99 సాంగ్స్' ఓటీటీ రిలీజ్‌కు రెడీ