బిగ్‌బాస్ హౌస్‌లో (Bigg Boss 5 Telugu) చివరి కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఇంటిసభ్యులందరికీ 'నియంత మాటే శాసనం' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన సింహాసనంపై బజర్ మోగిన వెంటనే ఎవరైతే కూర్చుంటారో వాళ్లే ఆ రౌండ్‌లో నియంత. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను మిగిలిన ఇంటిసభ్యులు పూర్తి చేయాలి. టాస్క్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్న వాళ్లల్లో ఒకరిని సేవ్ చేసే అవకాశం నియంతకు ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు.
కాగా, మొదటిసారి బజర్ మోగిన వెంటనే (Bigg Boss Captaincy Task) సింహాసనాన్ని సిరి అధిష్టించింది. మిగిలిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ 'క్యాప్ అండ్ హుక్' టాస్క్ ఇవ్వగా.. రవి-సన్నీలు చివరి రెండు స్థానాల్లో నిలిచారు. సన్నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నందున రవికి అవకాశం ఇస్తున్నానంటూ అతడిని సేవ్ చేసింది. ఈ క్రమంలో "ప్రతిసారీ నేనే టార్గెట్ అవుతున్నా" అంటూ సన్నీ వాపోయాడు.
కాజల్ కన్నీరు..
రెండో రౌండ్‌లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ దక్కించుకోగా.. కాలిని పైకి లేపి గోడపై ఎక్కువ ఎత్తులో చెప్పులు అతికించే టాస్క్‌ని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కి ఇచ్చాడు. ఈసారి చివరి రెండు స్థానాల్లో కాజల్-రవి నిలవగా.. శ్రీరామ్ రవిని సేవ్ చేశాడు. తాను ఇంతవరకూ కెప్టెన్ అవ్వలేదని, తనకి కూడా ఓ అవకాశం ఇస్తే అదొక మధురానుభూతిగా ఉండిపోతుందని కాజల్ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా శ్రీరామ్ అడిగిన ప్రశ్నలకు కాజల్ కొన్ని సమాధానాలు చెప్పింది. అయితే ఆమె చెప్పిన సమాధానాలు తనకు సంతృప్తినివ్వలేదని, కెప్టెన్ పోటీకి ఎవరైతే అర్హులని తాను భావించానో వాళ్లనే సేవ్ చేస్తానంటూ రవికి తన ఓటు వేస్తున్నట్లు శ్రీరామ్ సమాధానమిచ్చాడు. దీంతో కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోయినందుకు కాజల్ కన్నీరు పెట్టుకుంది.
మూడోరౌండ్‌లో సింహాసనాన్ని రవి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులందరికీ ఆరెంజ్ టాస్క్ ఇచ్చాడు. చివరి రెండు స్థానాల్లో మానస్-షణ్ముఖ్ నిలవగా రవి.. షణ్ముఖ్‌ను సేవ్ చేశాడు. "మానస్.. నువ్వు ఈవారం కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టే షణ్ముఖ్‌ని సేవ్ చేస్తున్నా" అని రవి వివరణ ఇచ్చాడు.
శ్రీరామ్ డిస్‌క్వాలిఫై.. కాజల్ సంబరాలు..
నాలుగోసారి బజర్ మోగగానే ప్రియాంక సింహాసనంలో కూర్చొంది. 'వాటర్ డ్రమ్ టాస్క్' బిగ్‌బాస్ మిగిలిన ఇంటిసభ్యులకు ఇచ్చాడు. ఈ టాస్క్‌లో చివరిగా శ్రీరామ్-షణ్ముఖ్ మిగిలారు. "ఈ వారం నామినేషన్‌లో షణ్ముఖ్‌ని నేను నామినేట్ చేసినా తను నన్ను నామినేట్ చేయలేదు. అందుకే అతడిని సేవ్ చేస్తున్నా. అయితే, శ్రీరామ్‌తో నాకు ఎలాంటి గొడవలు లేవు. ముందు జరగబోయే టాస్క్‌లో నాకు అవకాశం వస్తే అప్పుడు తప్పకుండా శ్రీరామ్‌ని సేవ్ చేస్తా" అని పింకీ చెప్పుకొచ్చింది. ఈ రౌండ్‌లో శ్రీరామ్ డిస్‌క్వాలిఫై కావడం వల్ల కాజల్ సంబరాలు చేసుకుంది.
ఐదో రౌండ్‌లో సింహాసనం కోసం జరిగిన పోటీలో సిరి-ప్రియాంక పోటీ పడ్డారు. దాదాపు ఒకేసారి వీరిద్దరూ సింహాసనంలో కూర్చొన్నారు. సంచాలకుడిగా ఉన్న మానస్.. ప్రియాంకే మొదటిగా కూర్చొందని చెప్పాడు. దీంతో సిరి హర్ట్ అయింది. అనంతరం ఏడ్చుకుంటూ లివింగ్‌రూమ్‌లోకి వెళ్లిపోయింది. మానస్-సన్నీ అబద్ధాలు ఆడుతున్నారని కన్నీటి పర్యంతమైంది. ఈ చివరి రౌండ్‌లో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చాడు? అందులో ఎవరు విజయం సాధించారు? అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: shruti haasan bigg boss: బిగ్‌బాస్ హోస్ట్‌గా శ్రుతిహాసన్?