'ఆలీతో సరదాగా' కార్యక్రమం గత ఐదేళ్లుగా ఈటీవీలో విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా 250వ ఎపిసోడ్‌కు చేరుకుందీ కార్యక్రమం. దీనికి ప్రత్యేక అతిథిగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు వచ్చారు. గతవారం మొదటిభాగం ప్రసారమైంది. దానికి కొనసాగింపుగా రెండో భాగంలో మోహన్‌బాబు పంచుకున్న మరికొన్ని విషయాలు మీకోసం.
ఎంపీ స్థానం అన్నగారు(సీనియర్ ఎన్టీఆర్) ఇచ్చారా? లేక మీరు అడిగి తీసుకున్నారా?
మోహన్‌బాబు: ఏదైనా చెప్పడానికి నామోషీ అక్కర్లేదు. అన్నగారితో అనుబంధాన్ని పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తాను. ఒకసారి చంద్రబాబును కలిసినప్పుడు 'రాజ్యసభ స్థానం ఖాళీగా ఉంది. చాన్నాళ్ల నుంచి పార్టీకి ప్రచారం చేస్తున్నారు. కానీ, ఎందుకు మీరు ఏమీ అడగట్లేదు. మీరెళ్లి పెద్దాయనను ఓసారి అడగండి' అన్నారు. అన్నగారి దగ్గరికి వెళ్లి కాస్త సంకోచిస్తూ అడిగాను. ఆయన నవ్వి 'మీకిష్టమా?' అని అడిగారు. అవునన్నయ్య అన్నాను. వారం రోజుల తర్వాత 'పెదరాయుడు' షూటింగ్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. 'మీకు ఎంపీ సీటు ఓకే అయింది హైదరాబాద్‌కు రమ్మ'న్నారు. వెంటనే మద్రాసు నుంచి బయలుదేరి వచ్చి అన్నయ్యను కలిశాను.
అద్దె కూడా కట్టుకోలేని స్థితి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు తీసే స్థాయికి ఎలా చేరుకున్నారు?
వయసులో ఉన్నప్పుడు ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుందని అనిపిస్తుంది. కానీ, వయసు అయిపోయేకొద్ది అసలు విషయం అర్థం అవుతుంది. భగవంతుడు ఏది ఇవ్వాలో దాన్నే మనకు ఇస్తాడు. విజయాలు, అపజయాలు ఏవైనా ఇచ్చేది ఆయనే. నాకు ఫైవ్‌స్టార్ హోటల్ పెట్టాలని ఆశ ఉండేది. ఆ ప్రయత్నంలో కొంత డబ్బు పోగొట్టుకున్నాను. మిత్రుడు రజనీకాంత్ ఒక మాట అన్నారు. జనం ఇక మనల్ని చూడలేపోతున్నారని తెలిసినప్పుడు రిటైర్ అవ్వాలన్నాడు. అది నిజమే అనిపించింది. అప్పుడే ఈ పాఠశాల పెట్టాలన్న ఆలోచన మెదిలింది. విజయం ఉంటే వంద కార్లొస్తాయి. పరాజయాలొస్తే నీతో సక్సెస్ కొట్టినవాడే దగ్గరకు రాడు. అద్దె కట్టలేని, తిండి దొరకని పరిస్థితి అనుభవించాను కాబట్టే, కులమతాలకు అతీతంగా 25 శాతం మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నాను. ఇండస్ట్రీలోనూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చనిపోతే ఆయన కూతురిని మా స్కూల్‌లో చదివించాను. ఇప్పుడామే తమిళంలో టాప్ హీరోయిన్. పేరు గుర్తురావట్లేదు. ఇలా చాలామంది గొప్పవారయ్యారు. అది నా గొప్పతనం కాదు. భగవంతుడి ఆశీస్సులతో జరిగింది.
ఏ ధైర్యంతో సీనియర్ ఎన్టీఆర్ మీతో 'మేజర్ చంద్రకాంత్' చేశారు?
ఒకప్పుడు ఎన్టీఆర్ ఇంటిముందు ఆయన్ను చూసేందుకు ఎదురుచూసిన వాడిని. నటుడయ్యాక అన్నగారి సొంత బ్యానర్‌లో విలన్‌గా చేసి, ఆయనతోనే శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిర్మాతగా ఆయనతో సినిమా తీశాను. ఇదంతా భగవంతుడు నిర్ణయించింది. 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో నటించమని అడిగితే 'ఎందుకు నాతో సినిమా చేస్తున్నారు. ఎవరు చూస్తార'న్నారు. మీలాంటి వ్యక్తి మళ్లీ రారు, చేయండన్నయ్య అంటే నా వ్యక్తిత్వం నచ్చి చేశారు.
అదే సినిమా వంద రోజుల వేడుకలో ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకున్నారు. దానికి మీరే కారణమంటారు? మీ సమాధానం.
చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ, ఇప్పుడది అప్రస్తుతం. దారిలో పోయే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అభిప్రాయాలు ఏమైనా నేను గౌరవిస్తాను. అది ఆయన వ్యక్తిగత విషయం.
ఒక్క ఫసక్ అనే పదంతో చాలా పాపులర్ అయ్యారు? ఇంతకీ ఫసక్ అంటే ఏంటి?
నేను, మా అమ్మాయితో కలిసి ఇండియా టుడేకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. అందులో వాడిన ఫసక్ పదం, తర్వాత రోజల్లో బాగా ట్రెండ్ అయింది. దానికి నేనేమీ బాధపడలేదు. ఆనందించాను. గర్వపడ్డాను. ఈ పదాన్ని సినిమాల్లో కూడా వాడారని అనుకుంటున్నాను.
రజనీకాంత్ 'పెదరాయుడు'లో చిన్నవేషం వేయడానికి కారణం?
వాడికే అనిపించి చేశాడు. 'పెదరాయుడు' సినిమా హక్కులు రావడానికి కారణం వాడు. ఒకసారి ఇంట్లో ఉండగా వచ్చాడు. ఆ పాత్రను నేను చేస్తానురా అన్నాడు. నాకు తండ్రిగా చేయడమేంటి రా అంటే, నేను చేస్తున్నాను అంతే అని వెళ్లిపోయాడు. అలాంటి స్నేహితుడు ఉన్నందుకు గర్విస్తాను. మేం నటించిన రోజులన్నీ గోల్డెన్ డేస్. ఆ రోజులు వేరు. అప్పుడు విలువలుండేవి. ఇప్పుడు 95 శాతం అవి ఎక్కడా కనిపించట్లేదు. నిర్మాత దేవుడు. సినిమాకు పనిచేసే వాళ్లంతా కూలీలంటాను.
అవును. నేనూ ప్రతి ప్రోగ్రామ్‌లో అదే చెప్తాను.
ఇదే విషయాన్ని రామోజీరావు గారితో అన్నాను. ఆయనంటే విపరీతమైన ప్రేమ, గౌరవం. కానీ పెద్దాయన ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. నవ్వి ఊరుకున్నారు.
'రాయలసీమ రామన్న చౌదరి'లో దేవుడి మీద వచ్చే సన్నివేశం చాలా ఇష్టం. దానికి మాటలు రాసిందెవరు?
పరుచూరి బ్రదర్స్ రాశారు. రజనీకాంత్ ఓసారి దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పాడు. వాటి మీదే రాసిన డైలాగ్స్ అవి.
స్నేహం మీద మీ అభిప్రాయం
చిత్రపరిశ్రమలో ఉన్నవాళ్లందరినీ స్నేహితులు అనలేం. కష్టాల్లో, నష్టాల్లో పాలుపంచుకునేవాడే స్నేహితుడు. ఈ మధ్య జరిగిన ఓ ఘటన మనసుకు చాలా కష్టమనిపించింది. మా అబ్బాయి విష్ణు 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. వాళ్లబ్బాయి కానీ, ఇతర కుటుంబసభ్యులు కానీ ఎవరూ నిలబడలేదు. ఆయన ఫోన్ చేసి 'విష్ణు పోటీలో నిలబడుతున్నారా? నేనొకరికి మాటిచ్చాను' అని అడిగారు. 'మీ కుటుంబసభ్యులు ఎవరైనా నిలబడితే, విష్ణుని పోటీ నుంచి తప్పిస్తాను. కానీ ఎవరికో మాటిచ్చామని మీరు చెప్పడం కరెక్ట్ కాదు కదా?' అన్నాను. నిన్నటిదాకా నా ఆత్మీయుడు అని, ఇప్పుడలా అడగడం ఎంతో బాధ కలిగించింది. పోటీకి దిగక తప్పలేదు. ఆయనలా అన్నప్పటికీ అన్నీ మరిచిపోయి స్నేహాన్నే కోరుకుంటాను. అదీ మోహన్‌బాబు అంటే.
మార్చి 19 మీ పుట్టినరోజు. మీ పిల్లలు గొప్ప వేడుకగా చేస్తారు. ఆ వేడుకకు అతిథిగా రావడాన్ని చాలామంది అవార్డులా ఫీలవుతారు. కదా?
చాలా మంది గొప్పవాళ్లొచ్చారు. ఓ సారి ఏపీజే అబ్దుల్ కలాం వచ్చారు. మోదీ ప్రధాని అవకముందు వెళ్లి కలిశాను. ప్రధాని అయ్యాక కూడా వెళ్లి కలిస్తే 40 నిమిషాలు మాట్లాడారు. నన్ను బడా భయ్యా అని పిలుస్తారు. మీకన్నా చిన్నవాడిని అన్నాను. స్కూల్‌కి రమ్మని పిలిచాను. ఆయన కూడా త్వరలో రావొచ్చు. గొప్పవాళ్లను తీసుకొచ్చి వాళ్ల అనుభవాలు పిల్లలకు చెబితే వాళ్లకు స్ఫూర్తినిస్తారని తీసుకొస్తాను.
మీరు పరిటాల రవిగారు కార్‌లో వస్తుంటే.. రెండు రాష్ట్రాలు కదిలిపోయే దుర్ఘటన జరిగింది కదా?
నేను జీవిత చరిత్రను రాస్తున్నాను. నువ్వు నా జీవితాన్నంతా అడుగుతున్నావు. పరిటాల రవి గొప్ప తమ్ముడు. ఎంతో మంది పోయారు. ఆ తర్వాత తమ్ముడు చనిపోయాడు. బాబా ఆశీస్సుల వల్ల నేను బతికే ఉన్నాను.
మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే రజనీకాంత్, అంబరీష్, మోహన్‌లాల్, శతృఘ్న సిన్హా వచ్చేవారు. మీకెలా కుదిరింది?
జీవితంలో మంచి స్నేహితులు దొరకాలన్నా.. భగవంతుడు రాసి పెట్టాలి. అలా ఎక్కడెక్కడి వారమో ఇంత దగ్గరయ్యాం.
మీరు నిర్మిస్తున్న షూటింగ్ గ్యాప్‌లో పేకాట ఆడటం మీరు చూశారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నయ్య?
డబ్బులు తీసుకునే ఆర్టిస్టులు క్రమశిక్షణతో నటించాలి. పేకాట ఆడుతుండటం చూసి కాలితో తన్నాను. మా కాలంలో ఆర్టిస్టులకు ప్రత్యేక వ్యాన్లు లేవు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లాంటి వాళ్లు వాళ్లు కూడా డైరెక్టర్ చెబితే కానీ వెళ్లేవారు కాదు. ఇప్పుడు కొంచెం విరామం దొరికినా వ్యాన్ ఎక్కేస్తున్నారు. వాళ్లకిష్టం వచ్చినప్పుడు షూటింగ్ చేస్తున్నారు. నటులకు క్రమశిక్షణ ఉండాలని పట్టుపట్టడం వల్ల నన్ను కొంతమంది చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పదిమంది ఆర్టిస్టులుంటే పదకొండు ప్రత్యేక వ్యాన్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. ఇది నిర్మాతల తప్పు. వాళ్లు ఐకమత్యంగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. నిర్మాత ఎప్పటికీ గొప్పవాడే. సెట్‌లోకి వచ్చాక ఆర్టిస్టులు క్రమశిక్షణతో పనిచేస్తే చాలా సంతోషం.
250వ ఎపిసోడ్‌కు మీరు రావడం చాలా సంతోషం.
నిన్ను పొగడాల్సిన అవసరం లేదు. అభినందిస్తున్నాను. మరో 250 ఎపిసోడ్‌లు చేయాలని కోరుకుంటున్నాను.
ఇదీ చదవండి: