ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ సుధాచంద్రన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సూపర్‌హిట్ చిత్రం 'మయూరి'. సుధాచంద్రనే కథానాయికగా నటుడు సుభాకర్ కీలకపాత్రను పోషించిన ఈ సినిమా 1985లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత సుధాచంద్రన్ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత కూడా ఆమెను 'మయూరి'గానే ప్రేక్షకులు గుర్తుపడుతున్నారంటే ఆ సినిమా తెలుగువారికి ఎంతలా నచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ధారావాహికలు, షోలతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుధాచంద్రన్ తాజాగా.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఆమె తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు.
"నేను ఐఏఎస్ లేదా ఐఎఫ్‌ఎస్ చేస్తే చూడాలని మా అమ్మ భావించింది. కానీ, అనుకోకుండా నటిగా వెండితెరకు పరిచయమయ్యా. ఇప్పుడు మనం ఎన్నో బయోపిక్‌ల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ, 1985లోనే మొట్టమొదటి బయోపిక్ చేసిన నిర్మాత రామోజీరావుగారు. అదే 'మయూరి'. ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మా కుటుంబమంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్‌డే, ఫస్ట్ షాట్.. కన్నీళ్లు వచ్చేశాయి"
"మమూరి' సినిమా తర్వాత దక్షిణాదితోపాటు బాలీవుడ్, భోజ్‌పురి చిత్రాల్లో నటించా. కానీ, దాదాపు 30 సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నన్ను గుర్తుపట్టి.. 'మీరు మయూరిగారు కదా' అని అడుగుతున్నారు. సుధాచంద్రన్ కంటే మయూరిగానే నేను ప్రేక్షకులకు చేరువయ్యాను"
"నేనూ, సుభాకర్‌గారు(మయూరి హీరో) ఓసారి గుంటూరులో ఫంక్షన్‌కు వెళ్లాం. మేము స్టేజ్‌పై ఉన్న సమయంలో పబ్లిక్‌లో నుంచి ఓ వ్యక్తి సుభాకర్‌పైకి చెప్పు విసిరాడు. 'మీరే కదా.. మయూరిని బాధపెట్టిన ఆ హీరో' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నేను సుభాకర్. సినిమాలో మాత్రమే ఆ పాత్ర పోషించాను. నిజ జీవితంలో ఆ వ్యక్తిని నేను కాదు' అని సుభాకర్ చెప్పాడు. కానీ, ప్రేక్షకులు మాత్రం నమ్మలేదు. ఎందుకంటే వాళ్లు అంతలా సినిమాని ఇష్టపడ్డారు"
"13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంలో తక్కువగా గాయపడింది నేను. పోలీసు అధికారులు వచ్చి.. 'అమ్మ చనిపోయారు. మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకోండి' అని చెప్పారు. ఆ సమయంలో ఆమె ఊపిరి పీల్చుకోవడం నేను గమనించాను" అని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకుని సుధాచంద్రన్ భావోద్వేగానికి లోనయ్యారు.
యాక్సిడెంట్ తర్వాత సుధాచంద్రన్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలేంటి? తన తల్లి మరణం గురించి ఆమె చెప్పిన చేదు నిజాలేంటి? తన జీవిత భాగస్వామి ఆమె ఎలా కలుసుకున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే డిసెంబర్ 28న ప్రసారం కానున్న 'ఆలీతో సరదాగా' చూడాల్సిందే. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన తాజా ప్రోమో మీకోసం..!
- " class="align-text-top noRightClick twitterSection" data="">