చిత్రం: వైల్డ్‌డాగ్
నటీనటులు: నాగార్జున, దియా మీర్జా, సయామీఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, అవిజిత్ దత్ తదితరులు
సంగీతం: ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: షానెల్ డియో
ఎడిటింగ్: శర్వణ్ కత్తికనేని
సంభాషణలు: కిరణ్ కుమార్
నిర్మాత: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి
రచన, దర్శకత్వం: అహిషోర్ సాల్మన్
సంస్థ: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల: 02-04-2021
కొత్త రకమైన కథల్ని ప్రోత్సహించే కథానాయకుడు నాగార్జున. నిజ జీవిత సంఘటనల ఆధారంగా.. ఎన్.ఐ.ఎ నేపథ్యంలో సినిమా రూపొందుతోందని తెలియగానే అందరూ ఆ చిత్రంపై ప్రత్యేకమైన ఆసక్తిని వ్యక్తం చేశారు. గతంలో నాగ్ చేసిన 'గగనం' తరహా సినిమాల్ని గుర్తు చేసుకున్నారు. మరి 'వైల్డ్ డాగ్' ఆ అంచనాలకి తగ్గట్టుగానే ఉందా? నాగార్జున ఆయన బృందం చేసిన ఆపరేషన్ ఏంటి? వంటి అంశాలను ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కథేంటంటే: ఏసీపీ విజయ్ వర్మ (నాగార్జున)కి వైల్డ్ డాగ్ అని పేరు. ఉగ్రవాదుల్ని పట్టుకోవడం కంటే కూడా అంతం చేయడానికే ఇష్టపడుతుంటాడు. వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ విషాదం తర్వాత ఎన్.ఐ.ఎ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)లో చేరతాడు. జాన్ బేకరీలో జరిగిన పేలుళ్ల వెనక సూత్రధారిని కనిపెట్టడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతాడు. ఇండియన్ ముజాహిదీన్‌కి చెందిన ఖలీద్ హస్తం ఉందని కనిపెడతాడు. అతను ఇండియా నుంచి నేపాల్‌కి వెళ్లాడని తెలుసుకున్న విజయ్ వర్మ తన బృందంతో కలిసి అక్కడికి వెళతాడు. దేశం కాని దేశంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? పేలుళ్ల సూత్రధారి ఖలీద్‌ని ఎలా ఇండియాకి తీసుకొచ్చాడు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: 2006 నుంచి ఐదారేళ్ల పాటు భారతదేశంలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనల్ని.. దాని వెనక సూత్రధారుల్ని కనిపెట్టి దేశానికి తీసుకొచ్చిన పరిణామాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ పేలుళ్లు.. వీటి వెనుక కుట్రలు.. దర్యాప్తు సంస్థలు చేసిన ఆపరేషన్లు.. సూత్రధారి యాసిన్ భత్కల్‌ని ఇండియాకి తీసుకురావడం.. ఇవన్నీ ప్రేక్షకులకు తెలిసిన విషయాలే. ప్రతి ఏడాదీ పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఈ పేలుళ్ల దురాగతాల్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఆ ఘటనల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ మిగల్లేదేమో అనిపిస్తుంది. కానీ, దర్శకుడు ఈ కథని ఎంచుకుని, ఇప్పుడు సినిమాగా చేస్తున్నాడంటే ఇంకేవైనా కొత్త విషయాలు చెప్పారేమో, ఈ ఆపరేషన్ వెనుక ఎవరికీ తెలియని సంగతులేమైనా ఇందులో చూపించారేమో అనుకున్నారంతా. కానీ, దర్శకుడు పాత విషయాల్నే మరోసారి గుర్తు చేశాడు తప్ప కొత్తగా చెప్పింది తక్కువ. విజయ్ వర్మ క్యారెక్టరైజేషన్‌లో కూడా కొత్తదనమేమీ లేదు. ఎన్.ఐ.ఎ. పనిచేసే విధానం గురించి, అందులో అధికారుల త్యాగాల్ని మాత్రం అక్కడక్కడా టచ్ చేశారంతే.
ఆరంభం నుంచి చివరి వరకూ ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతుంది. ‘తుపాకి’ సినిమాలో స్లీపర్ సెల్స్‌ని అంతం చేసినట్టుగా.. ఇందులో ఖలీద్‌ని పట్టుకోవడం కోసం ఒకసారి ఇండియాలోనూ, మరోసారి నేపాల్‌లో ప్రయత్నాలు జరుగుతాయి. సినిమాలో ఆ సన్నివేశాలే కాస్త ఆసక్తిగా అనిపిస్తాయి కానీ, ఆ రెండుసార్లూ వైల్డ్ డాగ్ బృందం విఫలం అవుతుంది. దాంతో ఆ ఎపిసోడ్స్ కూడా ప్రేక్షకుల్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి. విజయ్ వర్మ కూడా ఈ పేలుళ్ల బాధితుడే. ఇలాంటి సందర్భాల్లో కథలో సెంటిమెంట్‌కి మరింత ఆస్కారం లభిస్తుంది. కానీ ఈ సినిమాలో ఆ దిశగా కూడా సరైన కసరత్తులు చేయలేదు. దియా మీర్జా అతిథి పాత్ర తరహాలో అలా కనిపించి ఇలా మాయమవుతుంది. సయామీ ఖేర్ పాత్ర ద్వితీయార్ధంలో సందడి చేస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే: ఎన్.ఐ.ఎ అధికారిగా చూడ్డానికి ఆకట్టుకునేలా కనిపిస్తారు నాగార్జున. పాత్రకి తగ్గట్టుగా కనిపిస్తూ.. యాక్షన్ ఘట్టాల కోసం బాగా చెమటోడ్చారు. ఆయన పాత్రని ఉద్దేశించి వైల్డ్‌డాగ్ అని పేరు పెట్టారు కానీ, ఆ స్థాయిలో బలమైన సన్నివేశాల్ని తీర్చిదిద్దలేకపోయారు. దియామీర్జా పాత్రకి ప్రాధాన్యం లేదు. సయామీఖేర్ రా ఏజెంట్‌గా కనిపిస్తుంది. వైల్డ్‌డాగ్ టీమ్‌లో కనిపించిన నలుగురు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగాల్లో షానీల్ డియో కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. స్వతహాగా రచయిత అయిన దర్శకుడు అహిషోర్ సాల్మన్ కథకుడిగా ప్రభావం చూపించలేకపోయారు. మేకింగ్ పరంగా అక్కడక్కడా మెప్పించారంతే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
థ్రిల్లింగ్‌గా సాగే యాక్షన్ ఘట్టాలు
నాగార్జున ఆయన బృందం
ద్వితీయార్ధం
బలహీనతలు
కథ, కథనం
ప్రథమార్ధం
చివరిగా: 'వైల్డ్‌డాగ్' ఆపరేషన్ సక్సెస్ కానీ..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!