ఓ వ్యక్తి కేవలం రెండు తెలుగు అక్షరాలను తీసుకుని సాహిత్యానికి కొత్త రూపాన్నందించి పాటగా మలిచాడు. అందుకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించి ఈ లోకానికి పరిచయం చేశాడు. అతనే ప్రణవ్ చాగంటి. ఇతను ఓ రాప్ సింగర్. తెలుగు భాషపై మక్కువ ఉన్న ఈ యువ గాయకుడు... మాతృభాషకు జరుగుతోన్న అవమానాన్ని తట్టుకోలేక భాషను బతికించాలని కంకణం కట్టుకున్నాడు. ఇందుకోసం ఉద్యోగానికి రాజీనామా చేసి... అచ్ఛమైన తెలుగులో ర్యాపర్‌గా ప్రయాణం మొదలుపెట్టాడు.
వైవిధ్యమైన పాటలతో ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటోన్న ర్యాపర్ ప్రణవ్... ఇటీవల ఓ సరికొత్త ప్రయోగం చేశాడు. ప్రపంచంలోనే తొలిసారిగా 'న, మ' అనే రెండు అక్షరాలతో 'మోడ్రన్ దివ్యాక్షరి' పేరుతో పాటను విడుదల చేశాడు. వినేందుకు గమ్మత్తుగా ఉన్నా ఎంతో లోతైన అర్థాన్ని ఇచ్చేలా పాటను కూర్చాడు.
యాసిడ్ ఘటనతో పుట్టిన 'ఆవేదన' ర్యాప్
2004లో దిల్లీలో జరిగిన యాసిడ్ దాడి ఘటనతో కలత చెందాడు ప్రణవ్. అప్పుడే 'ఆవేదన' పేరుతో ప్రత్యేక ర్యాప్ రూపొందించాడు. ఆ తర్వాత తెలుగువీర, పానీపూరి, తల్లి భారమా, హైదరాబాద్ చాయ్, ఏది నీ కులం వంటి ప్రత్యేక గీతాలకు ప్రాణం పోశాడు. త్వరలో సెకన్‌కు 9.25 అక్షరాలతో అత్యంత వేగంగా పాడిన ఓ పాటను విడుదల చేస్తున్నట్లు ప్రణవ్ తెలిపాడు.
ఇదీ చదవండి: సమీక్ష : 'మీకు మాత్రమే చెప్తా' ఎలా ఉందంటే.