ఒకానొక దశలో సునీల్.. హాస్యనటుడిగా టాలీవుడ్లో శిఖర స్థాయిని అందుకున్నాడు. కానీ, హీరోగా మారి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాక, రెండు విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మళ్లీ తన పాత దారిలోకే వచ్చేశాడు. సునీల్ కెరీర్‌ను తిరిగి గాడిన పెట్టాలని.. ప్రాణ మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల తాను తీసిన 'అరవింద సమేత'తో సునీల్‌ను తిరిగి హాస్యనటుడిగా తెరకు పరిచయం చేశాడు. తాజాగా వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలోనూ సునీల్‌కు ఓ చక్కటి పాత్రనిచ్చాడు. అయితే ఈ పాత్రల పేర్ల విషయంలో మాత్రం మాటల మాంత్రికుడు ఎందుకో ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
ఆ సెంటిమెంట్ మరేంటో కాదు.. సునీల్ పాత్రలు అమ్మాయిల పేర్లతో ఉండటం. 'అరవింద సమేత'లో సునీల్.. నీలాంబరి అనే పాత్రలో కనిపించగా.. 'అల వైకుంఠపురములో' చిత్రంలో సీత అనే పాత్రలో దర్శనమిచ్చాడు. సునీల్‌ను ఇలా వరుసగా అమ్మాయి పేర్లు గల పాత్రలతో చూపించడానికి వెనక ఏమైనా ఆసక్తికరమైన అంశం దాగుందా? అన్నది త్రివిక్రమ్‌కే తెలియాలి.