సీనియర్ హీరో నందమూరి తారక రామారావు 'మేజర్ చంద్రకాంత్' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, పరుచూరి సోదరులు అందించిన కథ, మాటలు.. చిత్ర విజయానికి ఓ కారణమయ్యాయి.
అప్పటికే ఎన్నో సినిమాలకు పనిచేసిన పరుచూరి బ్రదర్స్.. ఇలాంటి గొప్ప చిత్రానికి కథ రాసేందుకు చాలా సమయం తీసుకుని ఉంటారనుకోవచ్చు. కానీ 'మేజర్ చంద్రకాంత్' విషయంలో అలా జరగలేదు. హీరో ఎన్టీఆర్.. పరుచూరి గోపాలకృష్ణను కొట్టడం వల్లే ఈ కథ.. వెండితెరపై ఆవిష్కృతమైంది.
ఇది అసలు విషయం!
పరుచూరి సోదరులతో కథ రాయించుకోవాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో అనుకునేవారట. కానీ వారు సమాధానమిచ్చేవారు కాదు. ఈ క్రమంలో గోపాలకృష్ణ.. ఓ వేడుకకు హాజరవగా, అదే సమయంలో ఎన్టీఆర్ అక్కడకు వెళ్లారట. అక్కడ ఏం జరిగిందో గోపాలకృష్ణ, ఆ తర్వాత ఓ సందర్భంలో చెప్పారు.
"ఎన్టీఆర్ మళ్లీ కథ అడుగుతారనే భయంతో మేం కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించాం. కానీ ఆయన అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చి కొట్టారు. ఏం బ్రదర్స్ కథ ఏమైంది? అని అన్నారు. సిద్ధం కాలేదని చెప్తే ఈ సారి ఏం చేస్తారో అని, అయిపోయిందని సమాధానం ఇచ్చాం"
-పరుచూరి గోపాల కృష్ణ, కథా రచయిత
పరుచూరి బ్రదర్స్.. ఆ తర్వాత రాత్రంతా నిద్రపోకుండా, తీవ్ర చర్చలు జరిపి 'మేజర్ చంద్రకాంత్' కథ సిద్ధం చేశారట. ఇలా ఆ సినిమా రూపొందింది. ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.
ఇదీ చూడండి:ముంబయిలో అదిరిన హాలీవుడ్ గాయనుల సందడి