సుధీర్‌కు, తనకూ మధ్య ఎలాంటి ప్రేమానుబంధాలు లేవని యాంకర్, నటి రష్మి మరోసారి తేల్చి చెప్పింది. బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు మాత్రమే సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్నామని ఆమె స్పష్టం చేసింది. లాక్‌డౌన్ కారణంగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్న రష్మిని తాజాగా ఓ వెబ్‌సైట్ వారు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా రష్మి.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకుంది.
సుధీర్‌తో తనకున్న రిలేషన్షిప్ గురించి స్పందిస్తూ.. "నేనూ సుధీర్ నటీనటులం మాత్రమే. స్క్రిప్టుకు అనుగుణంగా, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు మేమిద్దరం ఉత్తమమైన ప్రదర్శన కనబరుస్తుంటాం. నిజ జీవితంలో మేమిద్దరం గొప్ప స్నేహితులం కూడా కాదు. కాకపోతే మా ఇద్దరి మధ్య ఓ మంచి బంధం ఉంది. అంతే తప్ప అంతకు మించి ఏమీలేదు" అని రష్మి తెలిపింది.
అనంతరం రష్మి 'గుంటూరు టాకీస్' సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ.. "'గుంటూరు టాకీస్' చిత్రంలో సువర్ణ లాంటి బోల్డ్ క్యారెక్టర్‌లో నటించడం అనేది నేను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఆ సినిమాలో నా పాత్రను చూసి చాలామంది షాక్ అయ్యారు. ఆ సినిమా విడుదలైన సమయంలో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో సువర్ణ తరహా పాత్రలు చేయమని చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ పాత్రలేవీ అనుకున్న స్థాయిలో లేవు. నాకూ మంచి కథతో కూడిన సినిమా ఆఫర్స్ రాలేదు. అందుకే నేను బోల్డ్ పాత్రల్లో నటించడం తగ్గించాను" అని రష్మి చెప్పుకొచ్చింది.