బ్లాక్ అండ్ వైట్ జమానా నుంచి కలర్‌ఫుల్ సెల్యులాయిడ్‌పై మెరిసిన వెండి జలతారక.. బహుభాషల కథానాయిక. పదమూడో ఏటనే ఈమె భరతనాట్యంలో అరంగేట్రం చేసింది. హైస‌్కూల్‌కు వచ్చేసరికే స్టేజీలపై భరతనాట్య ప్రదర్శనలిచ్చి బాలకళాకారిణి అయ్యింది. ఆ నృత్యప్రదర్శనలు చూసిన వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఎమ్.వీ.రామన్.. 1949లో AVM బ్యానర్‌లో నిర్మితమైన 'వాంఘై' సినిమాలో నటింపజేశారు. ఆమె బాగోగులు స్వయంగా అమ్మమ్మ యడుగురి దేవి పర్యవేక్షించింది. ఆ అమ్మమ్మే వైజయంతిమాల సినిమా కెరీర్‌ను చక్కగా పట్టాలెక్కించి, బాక్సాఫీస్‌ల బ్లాక్ బ్లస్టర్ రీ సౌండ్‌లో మారుమోగేలా చూసుకుంది. వాంఘై సినిమా తమిళంలో హిట్ అవటమే కాదు మొదటిసిన్మాకే వైజయంతిమాలకు ఉత్తమ నటి అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.
తెలుగులో ఆమెనే పెట్టి "జీవితం"గా రీమేక్ చేశారు. అలా వైజయంతిమాల తెలుగు తెరంగేట్రం జరిగింది. "జీవితం" ఆమె నటజీవితాన్ని మలుపు తిప్పింది. ఈ చిత్రానికి ఎలాంటి డబ్బింగ్ లేకుండా వైజయంతిమాల సొంతంగానే డైలాగులు చెప్పటం విశేషం.
తెలుగులో కూడా ఈ సినిమా హిట్ అవటం వల్ల AVM సంస్థ వైజయంతిమాలనే నాయికగా పెట్టి 'బహార్' పేరుతో తొలిసారి హిందీలో నిర్మించారు. అలా తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో ఒకేసారి తెరంగేట్రం చేసిన ఘనత వైజయంతిమాలకు దక్కింది. హిందీలో డబ్బింగ్ చెప్పడానికి వైజయంతిమాల హిందీ ప్రచారసభలో శిక్షణ తీసుకుంది. వైజయంతిమాల చేసిన నూతన నృత్యాలు హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఆ సంవత్సరం అత్యధిక రాబడి సాధించిన హిందీ చిత్రాల్లో 'బహార్' చిత్రం ఆరో స్థానం ఆక్రమించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హిందీ, తెలుగు, తమిళ, మళయాళ, బెంగాలీ సినిమాల్లో నటించిన హీరోయిన్ వైజయంతిమాలను ఎరగని సినీ ప్రియులు ఉండరు. తమిళ పొన్నుగా జన్మించి బాలీవుడ్ భామామణిగా వెలుగొందిన సినీ మిణుక్కు తార వైజయంతిమాల. మాండ్యమ్ ధాతి రామన్, వసుంధరాదేవిల నల్ల అమ్మణిగా ఈ తెల్లఅమ్మాయి 1933 ఆగష్టు 13న పుట్టింది. తల్లి వసుంధరాదేవి తమిళ సినిమాలలో పేరుతెచ్చుకున్న నటి. వైజయంతిమాల చాలా చిన్నవయస్సులోనే "థా తై /ధిత్తయ్/ధిథ్థళాంగుతోం" జతుల పదవిన్యాసాల భరతనాట్యాన్ని నేర్చుకుంది. వళవూర్ రామయ్య పిళ్ళై వద్ద భారతనాట్యం, మణక్కల్ శివరాజ అయ్యర్ వద్ద కర్నాటక సంగీతంలో శిక్షణ తీసుకుంది. వైజయంతిమాలకు ఏడేళ్లు ఉన్నప్పుడు పవిత్ర వాటికన్ సిటీలో పోప్ పయస్ ఎదుట సంప్రదాయ భారత నాట్య ప్రదర్శన ఇవ్వడం ఒక మరచిపోలేని జ్ఞాపకం.
మూడు వెర్షన్లలో నిర్మించిన వాంఘై సినిమా విజయవంతం కావడం వల్ల 1954లో ఎ.వి.ఎం వారు వైజయంతిమాలనే హీరోయిన్గా పెట్టి 'పెణ్ణ్' చిత్రాన్ని నిర్మించారు. ఆమెకు జోడీగా జెమిని గణేశన్ నటించగా ఇతర పాత్రలను ఎస్.బాలచందర్, అంజలి దేవి, నాగయ్య, వి.కె. రామస్వామి, సారంగపాణి పోషించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో 'సంఘం’ పేరుతో, హిందీలో ‘లడ్కి’ పేరుతో ఒకేసారి నిర్మించారు. తెలుగులో హీరోగా ఎన్.టి. రామారావు, హిందీలో కిశోర్ కుమార్ హీరోలుగా నటించారు. సుశీల, టి.ఎస్.భగవతి ఆలపించిన "సుందరాంగ మరువగ లేనోయి రా రావేలా నా అందచందముల దాచితి నీకై రావేల" సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూడు చిత్రాలకు ఆర్. సుదర్శనమే సంగీతం సమకూర్చారు. మూడు భాషల్లో ఈ సినిమా హిట్ అవటమే కాదు హిందీలో బాక్సాఫీస్ వద్ద అత్యధికరాబడి ఆర్జించిన రెండో చిత్రంగా రికార్డులకెక్కింది. టైటిల్స్ పూర్తవగానే గుర్రం పైన స్వారీ చేస్తున్న వైజయంతీమాల పై చిత్రీకరించిన గీతం 'భారత వీర కుమారి నేనే నారీ రతనము నేనే భరత జాతి అభుదయానికి నాయకురాలను నేనే' పాట హీరోయిన్ వైజయంతిమాల గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు అభినయిస్తే ప్రేక్షకులు కూర్చున్న బల్లలపై ఊగిపోయారు. 1954 లో నందలాల్ జశ్వంతలాల్ దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ సినిమా ‘నాగిన్’ లో వైజయంతిమాల ప్రదీప్ కుమార్ సరసన హీరోయిన్ గా నటిస్తూ నాట్యంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ సినిమాలో హేమంతకుమార్ స్వరపరచిన ‘మన్ డోలే మేరా తన్ డోలే’ నేటికీ, నేటి యంగ్ తరానికి చెందిన సంగీతాభిమానులకు వీనులవిందు చేస్తూనే వుంది.
ఎక్కడైనా పామును చూపాలంటే ఈ పాటే బ్యాగ్రౌండ్ స్కోర్‌గా పలుకుతుంది. వసూళ్ళలో బంపర్ హిట్ కొట్టింది. మొదటి స్థానం ఆక్రమించి నిర్మాతకు కాసులు రాల్చిన చిత్రం ‘నాగిన్’. ఈ సినిమాలో నటించే నాటికి వైజయంతిమాలకు కేవలం పద్దెనిమిదేళ్ళు. వైజయంతిమాల సూపర్‌స్టార్‌గా ఎదగడానికి సహకరించిన సినిమా కూడా ఇదే. తరవాత కిశోర్ కుమార్ సరసన నటించిన ‘మిస్ మాల’ కూడా బాక్సాఫీస్ హిట్టే. "జగమే మాయ..." అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా వినోదా వారి 'దేవదాస్' సినిమా. శరత్‌శ్చంద్ర ఛటర్జీ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకు దర్శక, నిర్మాత బిమల్ రాయ్. ఇందులో సుచిత్రాసేన్ పార్వతిగా నటించగా, వైజయంతిమాల చంద్రముఖి పాత్రను పోషించింది. నర్గీస్ అంగీకరించకపోవడం వల్ల చంద్రముఖి పాత్ర వైజయంతిమాలకు దక్కింది. దిలీప్ కుమార్ దేవదాసుగా నటించిన ఈ చిత్రానికి వైజయంతిమాలకు ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ బహుమతి ప్రకటించారు. కేవలం గ్లామర్ తారగానే కాకుండా నటనా పటిమగల నటిగా దేవదాస్ మూవీ వైజయంతిమాలకు పేరు మారుమోగేలా చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1956లో వైజయంతిమాల ప్రదీప్ కుమార్ సరసన ‘తాజ్’, ‘పత్రాణి’, ’అంజాన్’ సినిమాలలో నటించింది. సునీల్ దత్ సరసన ‘కిస్మత్ కా ఖేల్’ చిత్రంలో నటించింది. తమిళంలో టి.ఆర్. రఘునాథ్ దర్శకత్వం వహించిన ‘కణవనే కన్కండ దైవమ్’ చిత్రాన్ని హిందీలో ‘దేవత’ చిత్రంగా నిర్మించారు.
పద్మిని అనే నృత్యకళాకారిణితో కలసి 1957లో వంజికొట్టాయ్ వాలిబన్ సినిమాలో రాణి మందాకిని పాత్రలో వైజయంతిమాల నటించింది. జుగలబందీ నాట్యప్రదర్శనలో చాలా క్లిష్టమైన భంగిమలను అలవోకగా నర్తించింది. ఈ చిత్రం 100 వరోజు కూడా హౌస్‌ఫుల్ బోర్డ్‌తో నడవడం ఈ సినిమా విజయానికి ఓ నిషానా. 1957లోనే రిలీజైన నయాదౌర్ వైజయంతిమాల కెరీర్‌కే కొత్తపుంత. ఆ రోజుల్లో బీఆర్.చోప్రా ఫిలిమ్స్ అంటే ఒక బ్రాండ్. ఆనాటి తిరుగులేని కథానాయకుడు నవరససామ్రాట్టు దిలీప్‌కుమార్ సరసన కథానాయికిగా దక్షిణాది పూబంతి వైజయంతి. అద్భుత హిట్ కొట్టిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రానికి ఇప్పటికీ ఉన్న క్రేజ్‌ను దృష్టిలో వుంచుకొని 2007లో కలర్లోకి మార్చారు. మనిషికి, యంత్రానికి మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్ర నేపథ్యం. గుర్రపు బగ్గీ నడిపే ఒక పల్లెటూరి చిన్నోడు, ధనవంతుడైన ఒక బస్ యజమానితో పరుగు పందెం కాయడం ఆరోజుల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. 2001లో వచ్చిన ఆమిర్ ఖాన్ చిత్రం 'లగాన్'కు ఈ సినిమాయే ప్రేరణ. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి ఆరోజుల్లోనే ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూళ్ల ఆర్జన చేసింది. ఓ.పి.నయ్యర్ సంగీతం ఈ సినిమాకు ఓ వరం. "సాథీ హాథ్ బడానా", "మాంగ్ కే సాథ్" పాటలు నేటికీ తాజాగా అనిపిస్తాయి. తమిళంలో వైజయంతిమాలకు వున్న 'క్రేజ్' దృష్టిలో వుంచుకొని ‘నయా దౌర్’ చిత్రాన్ని తమిళంలో ‘పాట్టాలియిన్ శబథం’ పేరుతో డబ్ చేసి విజయం సాధించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అదే సంవత్సరం బల్‌రాజ్ సాహ్ని తో వైజయంతిమాల నటించిన సినిమా అమియా చక్రవర్తి నిర్మించిన ‘కట్ పుత్లీ’. అందులో పుష్పగా వైజయంతిమాల నటించింది. వైజయంతిమాలకు ఒక బ్రేక్ త్రూ ఇచ్చిన చిత్రరాజం కట్ పుత్‌లీ. ఈ సినిమాలో భరతనాట్యకారిణి అయినప్పటికీ చాలా సునాయాసంగా కథాకళి నృత్యాన్ని ఈ సినిమాలోని పాటకోసం అప్పటికప్పుడు నేర్చుకుని నర్తించింది. ఈ కథాకళిలోని ప్రత్యేకత అయిన కళ్లు, కనుబొమలను లయబద్ధంగా కదిలించే భ్రూ బేధాలు, భుజాలను వేగంగా కదిలించే గ్రీవ బేధాలు, ఆంగికాభినయం, హస్త ముద్రికలు ఎంతో నేర్పుగా ప్రదర్శించింది. బి.ఆర్. చోప్రా బ్రాండ్ 1958లో సునీల్ దత్, వైజయంతిమాల కాంబినేషన్ లో 'సాధన' చిత్రాన్ని నిర్మించారు. వైజయంతిమాల పడుపు వృత్తితో జీవించే వనితగా నటించగా, ఆమెను ప్రేమించే ప్రొఫెసర్‌గా సునీల్ దత్ నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ బిగ్ హిట్ అయి ఆరోజుల్లో 8 కోట్లకు పైగా లాభాలార్జించింది. వైజయంతిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ బహుమతి దక్కింది.
దేశంలోని అగ్రహీరోలతో నటించి క్రమంగా వెండితెరపై వెలుగులీనుతున్నారు వైజయంతిమాల. అదే ఊపులో దేవానంద్‌తో వీనస్ పిక్చర్స్ మద్రాస్ వారి నిర్మాణంలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘అమర్ దీప్’లో, 1959లో దిలీప్ కుమార్ కాంబినేషన్ లో బి.నాగిరెడ్డి ‘పైగామ్’ చిత్రంలో నటించారు. తమిళంలో శివాజీ గణేశన్ నటించిన ‘ఇరుంబు తిరై’ సినిమాకు ఈ చిత్రం రీమేక్. తెలుగు సినిమా ‘పెళ్ళికానుక’ చిత్రాన్ని సి.వి. శ్రీధర్ తో కలసి వైజయంతిమాల హీరోయిన్ గా ‘వాసంతి’ పేరుతో హిందీలో పునర్నిర్మించారు. మనోజ్ కుమార్ తో రాజేంద్ర భాటియా నిర్మించిన ‘డాక్టర్ విద్య’ చిత్రంలో కూడా వైజయంతిమాల నటించింది. ఈ సినిమాలన్నీ బాగా ఆడాయి. వైజయంతి నటప్రస్థానం ముంబై - చెన్నై విమానాశ్రయాల మధ్య జెట్ స్పీడ్ లో సాగింది.
మధుమతి సినిమా రిలీజ్ 1958లో ఓ సంచలనం. మన మనోసీమలలో ఇప్పటికీ చెరగిపోని ముద్రవేసిన హిట్ సాంగ్‌ల చిత్రరాజం. వైజయంతిమాల, దిలీప్ కుమార్ లతో ‘మధుమతి’ చిత్రాన్నినిర్మించారు. అప్పటికే దిలీప్‌కుమార్ - వైజయంతి మాల జంట హిట్ జంటగా పేరు మారుమ్రోగుతోంది. బాక్స్‌ఆఫీస్ బంపర్‌హిట్ అయిన ఈ సినిమా అటు దిలీప్ కుమార్‌కు, ఇటు వైజయంతిమాల కు మంచి పేరు తెచ్చిపెట్టింది. పునర్జన్మ ఇతివృత్తంతో నిర్మించిన తొలితరం సినిమా ‘మధుమతి’. ఈ చిత్రంలో ఎక్కువభాగం అవుట్ డోర్లో నైనిటాల్ వంటి హిల్ స్టేషన్ల్లో చిత్రీకరించారు. ఇందులో సలీల్ చౌదరి స్వరపరచిన పాటల రికార్డులు రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. ముఖేష్ ఆలపించిన “సుహానా సఫర్ అవుర్ యే మౌసమ్ హసీ’ , ముఖేష్, లతాజీల “దిల్ తడప్ తడప్ కే కెహ్ రహా హై ” లతాజీ సూపర్‌హిట్ “ఆజా రే పరదేశి, మై తో కబ్ సే ఖడీ ఇస్ పార్”పాట. "రావోయి అపరిచితుడా...ఎంతసేపట్నించి ఈ ఒడ్డున ఎదురుచూపులతో నిలుచున్నానో" అంటూ మంచి మ్యూజికల్ హిట్ట్‌గా ఇప్పటికీ సంగీత ప్రేమికుల వీనులవిందుగా చిరస్థాయి పొందింది. ఈ చిత్రంలోని పాటలు ఎంత ఆదరణ పొందినదీ చెప్పనవసరం లేదు. జెకోస్లావేకియాలో జరిగిన కార్లోవి వరీ చలనచిత్ర ఉత్సవంలో ప్రదర్శనకు నోచుకున్న సినిమా ఇది. రష్యన్ భాషలోకి అనువదించి రష్యాలో ‘మధుమతి’ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం వైజయంతిమాలకు ఉత్తమనటి ఫిలింఫేర్ బహుమతి తెచ్చిపెట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1964లో రాజకపూర్ నిర్మించిన ‘సంగం’ సూపర్ హిట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ చిత్రంలో వైజయంతిమాల భువికి దిగివచ్చిన అందాలతారకలా నటించింది. రాజకపూర్ నిర్మించిన తొలి రంగుల టెక్నికలర్ చిత్రం ‘సంగం’. రాజకపూర్ నిర్మించిన సినిమాలలోకెల్లా అద్భుత కలెక్షనలతో బాటు, ఖ్యాతిని కూడా సంపాదించిన సినిమా ఇది. ఇందులో ఓ చిత్రమైన పాట ఉంది. బోల్ రాధా బోల్ ... చెప్పు తల్లో చెప్పు ... సంగమ్ హోగా కీ యా నహీ ... మనం కలుసుకునేది ఉందా లేదా అని అడిగిన వైనం ఈ పాట. ఈ పాట వెనుక ఓ మంచి మాట ఉంది. వైజయంతిమాలను హీరోయిన్గా నిర్ణయించి మద్రాస్‌లో ఉన్న వైజయంతిమాలకు రాజకపూర్ “బోల్ రాధా బోల్ సంగం హోగా యా నహీ” అంటూ నువ్వు నేను కలిసి సినిమా చేస్తామా అని కవితాత్మక టెలిగ్రాం ఇచ్చారు. దానికి వైజయంతిమాల "హోగా... హోగా... హోగా" కలవటమవుతుందిలే... అవుతుందిలే ... కలసి నటించడమవుతుందిలే అంటూ టెలిగ్రాం ద్వారా జవాబిచ్చింది వైజయంతిమాల. అదే సినిమాలో పాటై కూర్చుంది. రాజకపూర్ ఎడిటర్‌గా కూడా వ్యవహరించిన తొలిచిత్రం ’సంగం’. సంగం సినిమాకు రెండు ఇంటర్ వెల్స్ వుండడం చలనచిత్ర చరిత్రలో తొలిసారి. సంగమ్ చిత్రానికి నాలుగు ఫిలింఫేర్ బహుమతులు లభించాయి. ఈ సినిమా ప్రింట్లను లండన్‌లో ముద్రించారు. ఈ సినిమా విడుదలయ్యాక వైజయంతిమాల డాక్టర్ బాలి ని వివాహమాడింది. మనందరి అభిమాన నటి వైజయంతిమాల ... వైజయంతిమాలాబాలిగా శ్రీమతి అయ్యింది.
1969నాటి ప్రిన్స్ సినిమాతో తన సినీ ప్రస్థానానికి లైట్స్ ఆఫ్ చెప్పిన వైజయంతిమాల.. తనకు ఇష్టమైన భరతనాట్యానికి నట్టువాంగం మోగుతూనే ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. వెండితెరపై వెలగటం ఆగినా రంగస్థలిపై కాలిఅందెయలు ఘల్లుఘల్లుమంటూనే ఉన్నాయి. సెల్యులాయిడ్ సిల్వర్ స్క్రీన్‌పై 63 సినిమాలలో నటించి ఆగినా ... ప్రేక్షక కనులముందు సజీవ నృత్యప్రదర్శనలు కొనసాగిస్తూనే ఉన్నారు. 1950, 1960 సినిమా ప్రపంచాన్ని ఏలిన ఈ రసజ్ఞి తన వివాహానంతరం సినిమారంగం నుంచి నాట్యరంగానికి బదిలీ అయ్యారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్వయంగా తాను నర్తించే ప్రదర్శనలే కాక తన నృత్య దర్శకత్వంలో అనేక నృత్యరూపకాలను రూపొందించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాలేలు అనేకం ఉన్నాయి. 1969లో అమెరికా న్యూయార్క్ మహానగరంలో మానవహక్కుల దినోత్సవ 20వ వార్షికోత్సవ వేదికపై ఇచ్చిన భరతనాట్య ప్రదర్శనలు ఎంతో ఘనకీర్తిని కలిగించాయి. ఆస్ట్రేలియా లోని సిడ్నీనగరంలో ఇంటర్నేషనల్ ఒపేరా హౌస్‌లో, ఎడెలైడా ఫెస్టివల్‌లో, స్టాక్‌హోమ్, రొట్టెర్‌డామ్, పారిస్ వంటి అంతర్జాతీయ వేదికలపై వైజయంతిమాల పాదాలు నర్తించాయి. వైజయంతిమాలకు మొత్తం 18 ఫిలింఫేర్, బెంగాల్ ఫిలిం జర్నలిస్టుల సంఘం అవార్డులు రాగా 19సార్లు ఆమె పేరు నామినేట్ అయింది. ఇవి కాకుండా బాలీవుడ్ మూవీ అవార్డ్, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి లివింగ్ లెజెండ్ అవార్డ్, తమిళనాడు ప్రభుత్వ అరసవి నాట్య కలైంగర్ అవార్డ్, సంగీత నాటక అకాడమీ అవార్డ్, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అవార్డ్, జ్ఞాన కళాభారతి అవార్డ్, భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డ్, తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డ్, అన్నామలై విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ వంటి ఎన్నో బహుమతులు వైజయంతిమాల సిగలో మాలలయ్యాయి. వైజయంతిమాల మనందరికీ తెలిసిన కేవలం సినిమా యాక్టరెస్ మాత్రమే కాదు. ఆమె అద్భుతమైన గోల్ఫ్ క్రీడాకారిణి కూడా. నేషనల్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ క్రీడల్లో పాల్గొన్న గోల్ఫ్ వనిత ఆమె. 80 ఏళ్ల వయస్సులోనూ గోల్ఫ్ రాకెట్ పట్టుకుని ఉత్సాహంగా ఆడతారు.
అంతేనా.. అంతే అంటే కాదు ఇంకా ఇంకా వైజయంతిమాల... బహుముఖ ప్రజ్నాశీలి అనాలి వైజయంతిమాలను ఎవరైనా సరే. రాజకీయాలంటే కూడా ఎంతో మక్కువతో ఆమె క్రియాశీల రాజకీయాల్లోనూ రాణించారు. భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి సన్నిహితురాలిగా వైజయంతిమాల 1984 లో మద్రాసు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు స్థానం గెలిచారు. రాజకీయవేత్తగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించి ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. తన భర్త డాక్టర్ బాలి పేరున ఫార్మా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు వైద్యసేవలు అందించింది. వైజయంతి మాల ఒక్కగానొక్క కుమారుడు సుచింద్రబాలి కూడా బాలీవుడ్ నటుడిగా కృషిచేస్తున్నారు.
"వైజయంతి మాలా జీ వై యూ ఆర్ లీవింగ్ సినిమా" అని అంటే "లీ...వింగ్ ఫర్ లివింగ్ మై సెల్ఫ్" అంటారామె. "ఓ మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాను. ఏ వివాదం అంటకుండా ఆ ఉన్నతస్థానాన్ని పదిలం చేసుకుంటూ నేను నా వ్యక్తిగత జీవితానికి, నా కుటుంబ జీవితానికి అంకితమవ్వాలని వెండితెరను విడిచిపెడుతున్నా" నంటారు. నాకెంతో ఇష్టమైన నాట్యరంగాన్నే భరతనాట్య ప్రదర్శనలనే కొనసాగిస్తానని సగర్వంగా చెప్పుకుంటారు. ఓ సారి బహుభాషా ఛార్మింగ్ హీరో నవరసా నట సార్వభౌమిక్ కమల్‌హాసన్ తన విశ్వరూపం సినిమా నటించమని స్వయంగా ఇంటికి వెళ్లి అడిగారట. తాను విరమించుకున్నానని ప్రకటించేశానని ఇక నటించలేనని చెప్పారంటే వైజయంతిమాల ఎంత స్థిరచిత్తురాలో అర్ధం చేసుకోవచ్చు. ఆమె నటించకపోయినా .... ప్రేక్షకుల హృదయ హాళ్లలో... జ్ఞాపకాల తెరపై వైజయంతిమాల నటిస్తూనే ఉన్నారు. ఎప్పటికీ అందర్నీ అలరిస్తూనే ఉంటారు.