Telugu OTT Hit Movies 2021: కొన్నాళ్ల క్రితం వరకు సినీ వినోదాలంటే అందరి కళ్లు థియేటర్ల వైపే చూసేవి. కరోనా పుణ్యమాని వెండితెర వినోదాలకు ఓటీటీ వేదికలు ప్రత్యామ్నాయాలుగా మారాయి. కొవిడ్ పరిస్థితుల వల్ల గతేడాది చాలా చిత్రాలు ఈ వేదికల ద్వారానే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో అగ్రతారల సినిమాలు చాలా తక్కువే. ఈ ఏడాది రెండో దశ కరోనా పెద్ద చిత్రాలపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. థియేటర్లు తెరచుకున్నా ప్రేక్షకులు వస్తారో? రారో? అన్న భయాలు.. మరోవైపు ఏపీలో టికెట్ రేట్ల సమస్యలతో పలువురు స్టార్ హీరోలు ఓటీటీ బాట పట్టారు. బాక్సాఫీస్ ముందు వినిపించాల్సిన హిట్టు మాటను.. డిజిటల్ వేదికల ద్వారా వినిపించారు. మరి ఈ ఏడాది నేరుగా ఓటీటీల్లో సత్తా చాటిన ఆ స్టార్ నాయకులెవరో చూసేద్దాం పదండి..
వెంకీ డబుల్ ధమాకా..
ఈ ఏడాది ఓటీటీ వేదికగా జోరు చూపించారు కథానాయకుడు వెంకటేష్. కొవిడ్ పరిస్థితుల వల్ల గతేడాది ఒక్క చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయిన ఆయన.. ఈ ఏడాది ‘నారప్ప’, ‘దృశ్యం’ చిత్రాలతో ఓటీటీ వేదికగా డబుల్ ట్రీట్ ఇచ్చారు. ‘అసురన్’కు రీమేక్‌గా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘నారప్ప’.. థియేటర్లు తెరచుకున్నా.. ప్రేక్షకుల్లో ఉన్న భయాలు, ఏపీలో టికెట్ రేట్ల సమస్యల వల్ల నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. చక్కటి సందేశంతో నిండిన ఈ మాస్ యాక్షన్ డ్రామాకు సినీప్రియుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ‘దృశ్యం 2’తోనూ మరోసారి ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చారు వెంకీ. ఈ సినిమాతోనే మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు తెరకూ పరిచయమయ్యారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నాని 'జగదీష్'గా.. నితిన్ మ్యాస్ట్రోగా
'వి' సినిమాతో గతేడాదే ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని పలకరించారు కథానాయకుడు నాని. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రమే 'టక్ జగదీష్'. శివ నిర్వాణ తెరకెక్కించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. థియేటర్లు లక్ష్యంగానే రూపొందించిన ఈ సినిమాని.. కొవిడ్ పరిస్థితుల వల్ల ఆఖరి నిమిషంలో ఓటీటీ బాట పట్టించాల్సి వచ్చింది. దీన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. ఈ ఏడాది వరుసగా ‘చెక్’, ‘రంగ్ దే’ సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేశారు కథానాయకుడు నితిన్. అలాగే ‘మాస్ట్రో’తో ఓటీటీ వేదికపైనా కాలుమోపారు. హిందీలో విజయవంతమైన ‘అంధాధూన్’కు రీమేక్‌గా రూపొందించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. నభా నటేష్ కథానాయిక. తమన్నా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించింది. థియేటర్లు లక్ష్యంగానే తెరకెక్కించిన ఈ సినిమాని.. కొవిడ్ పరిస్థితుల వల్ల ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల చేశారు. విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది. అంధుడిగా నితిన్ నటనకు.. ప్రతినాయికగా తమన్నా అభినయానికి సినీప్రియుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అనువాదాలు అలరించాయి
ఈ ఏడాది ఓటీటీ వేదికల్లో అనువాద చిత్రాల జోరు బాగానే కనిపించింది. వాటిలో అందరి దృష్టినీ ఆకర్షించినవి తమిళ సినిమాలు 'సార్పట్ట', 'జైభీమ్'. ఈ రెండూ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదలయ్యాయి. ఆర్య కథానాయకుడిగా పా.రంజిత్ తెరకెక్కించిన క్రీడా నేపథ్య చిత్రం 'సార్పట్ట'. ఎమర్జెన్సీ రోజుల్లో చెన్నై నేపథ్యంగా సాగే కథతో రూపొందించారు. బాక్సింగ్ ఆట చుట్టూ అల్లుకున్న కథకు సామాజిక సమస్యల్ని మేళవిస్తూ రంజిత్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఓటీటీ వేదికగానే విడుదలైన సూర్య నటించిన ‘జైభీమ్’ సినిమా దేశవ్యాప్తంగా ఓ సంచలనాన్నే సృష్టించింది. పోలీసుల వల్ల అన్యాయానికి గురైన ఓ ఆదివాసీ కుటుంబం కోసం.. చంద్రు అనే ఓ న్యాయవాది చేసిన స్ఫూర్తిదాయక పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. 1995లో తమిళనాడులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించారు. మనసుల్ని కదిలించే ఇందులోని కథ కథనాలు.. ఆ కథనానికి ప్రాణం పోస్తూ న్యాయవాది చంద్రు పాత్రలో సూర్య ఒదిగిన తీరు... బాధిత ఆదివాసీలుగా రాజన్న, సినతల్లి పాత్రల్లో మణికందన్, లిజోమోల్ జోసేలు జీవించిన విధానం సినీప్రియులపై చెరగని ముద్ర వేశాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Venkatesh birthday: అభిమానులు అందరూ మెచ్చే హీరో వెంకీమామ