బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్‌కపూర్ చిత్రసీమలో బంధుప్రీతి ఉందని మరోసారి ఉద్ఘాటించారు. తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మన్ గురించి మాట్లాడాడు. అతడి ప్రతిభను గుర్తించి ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ వరించినప్పటికీ బాలీవుడ్ మాత్రం పక్కనపెడుతుందని ఆరోపించాడు.
"రెహ్మన్ నీ సమస్య ఏమిటో తెలుసా? నువ్వు ఆస్కార్ పొందటమే. బాలీవుడ్లో ఈ అవార్డు దక్కడమంటే మృత్యువును ముద్దు పెట్టుకున్నట్లే. బాలీవుడ్లో ఉండాల్సిన దానికన్నా నీలో ఎక్కువ ప్రతిభ ఉందని ఈ అవార్డు ద్వారా రుజువైంది."
-శేఖర్ కపూర్, దర్శకుడు.
ఇటీవల సుశాంత్ ఆత్మహత్యతో చిత్రసీమలో బంధుప్రీతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో ఈ అంశంపై రెహ్మన్‌ను ఇంటర్వ్యూ చేయగా.. నెపొటిజమ్ చలామణి అవుతోందని ఆరోపించాడు. తనను చిత్రసీమలో ఉన్న ఓ ముఠా కొన్ని చిత్రాల నుంచి అవకాశాలు రానీయకుండా తప్పించిందని తెలిపాడు.
2007లో 'ఎలిజిబెత్ : ది గోల్డెన్ ఏజ్' చిత్రానికి శేఖర్, రెహ్మన్ కలిసి పనిచేశారు. సూపర్ హిట్ చిత్రం 'స్లమ్‌డాగ్ మిలియనీర్'కు రెండు ఆస్కార్లను అందుకున్నాడీ సంగీత దర్శకుడు.