ఉద్యోగాలు, లక్ష్యాల పేరుతో యువత వివాహాలను వాయిదా వేయొద్దని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రంలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని చూపిస్తూ ట్రైలర్ను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. దర్శక నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సినీ పరిశ్రమలో ఒంటరిగా పోరాడుతున్న తనపై చాలా మంది దర్శకులు అభిమానం చూపిస్తూ వారి వారి సినిమాల్లో చోటు కల్పించడం ఆనందంగా ఉందని నారాయణమూర్తి అన్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్'లో మదర్ థెరిస్సా, వాజ్పేయీ లాంటి మహానీయులతో కలిపి తన కటౌట్ పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఇందులో మెగాహీరో సాయితేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈనెల 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.