"నా ఆత్మకథనే సినిమాగా తీశారు. నా మొత్తం జీవితం ఇదే అని కాదు.. కొన్నిచోట్ల సినిమాకు అనువుగా సన్నివేశాల్ని మార్చారు. అయినా సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ వినోదం కోణంలోనే చూడండి" అన్నారు ప్రముఖ నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'షకీలా'. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠి, ఎస్తర్, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలాని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకుడు. జనవరి 1న యూఎఫ్‌ఓ మూవీస్ ద్వారా చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో షకీలా మాట్లాడుతూ "షకీలా పేరు కనిపిస్తే చాలు సెన్సార్ పరంగా సమస్యలొస్తాయి. అలాంటిది ఈ సినిమా సెన్సార్ కోసం చిత్రబృందం ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు." అన్నారు.
ఎస్తర్ మాట్లాడుతూ "షకీలా జీవితం వెనక ఉన్న ఓ బలమైన పాత్రను నేను చేశా" అన్నారు. నటుడు, చిత్ర నిర్మాతల్లో ఒకరైన సందీప్ మలాని మాట్లాడుతూ "శ్రీదేవి వీరాభిమానిని నేను. తెలుగులో చాలా సినిమాలకు పనిచేశా. 'షకీలా'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభవాన్నిస్తుంది. కర్ణాకటలోని తీర్థహల్లి, బెంగళూరుల్లో చిత్రీకరణ చేశాం" అన్నారు. సంగీత దర్శకుడు వీర్, యూఎఫ్‌ఓ ప్రతినిధి లక్ష్మణ్, నటుడు రాజీవ్ పిళ్లై, ఇన్నొవేటివ్ ఫిలిం సంస్థ ప్రతినిధి ఉపాసన తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'డబ్బు కోసమే షకీలా ఆ సినిమాలు చేసింది'