బెంగళూరు భామ రష్మిక మందణ్న మొదటగా కన్నడలో 'కిరిక్ పార్టీ' సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ఛలో', 'గీతగోవిందం'తో తెలుగు వారికి దగ్గరైంది. ఇప్పుడు యువహీరో విజయ్ దేవరకొండతో ఆమె రెండోసారి కలిసి నటించిన 'డియర్ కామ్రేడ్' విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో లిల్లీ అనే రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్లేయర్గా కనిపించనుంది రష్మిక. ఈ పాత్ర కోసం సుమారు 4 నెలల పాటు శిక్షణ తీసుకుంది. చిత్రంలో 10 నిమిషాలకు పైగా ఆమె క్రికెట్ ఆడే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇలా కలిగిన ఆసక్తితో క్రికెట్లో పూర్తి స్థాయి శిక్షణ తీసుకోవాలని భావిస్తోంది రష్మిక.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది చిత్రబృందం. ఈ నెల 26న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోందీ సినిమా.
ఇది చదవండి:బాలీవుడ్ కథానాయకుల మధ్య 'వార్'