కొంతకాలంగా బాలీవుడ్‌పై దృష్టిసారించిన సొగసరి భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు తెలుగులో మళ్లీ బిజీ కానున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు బంద్ కావడం వల్ల తన వ్యాపారాలు, పెట్టుబడులను చూసుకుంటూ ఆమె హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. కరోనా సమయంలో పేదలకు సాయం చేస్తూ సహృదయాన్ని చాటుకుంది. షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్న క్రమంలో మళ్లీ రకుల్ చేయబోయే సినీ ప్రాజెక్టులు ఏంటా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్-క్రిష్ ప్రాజెక్టు 'విరూపాక్ష'లో రకుల్ నటిస్తోందన్న గాసిప్స్ వచ్చాయి. ఈమె ప్రస్తుతం కమల్ హాసన్ 'ఇండియన్ 2'లోనూ, అర్జున్ కపూర్ సరసన నటించనుందని సమాచారం. అంతేకాకుండా ఓ లెజండరీ బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించనుందనే వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఒలింపిక్ మెడల్ విజేత, తెలుగు మహిళ కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను తీయాలని రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. భారత వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం సాధించిన మల్లేశ్వరి బయోపిక్‌లో రకుల్ నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే ఇంత వరకు రకుల్ దానిపై స్పందించలేదు.
కరణం మల్లీశ్వరి పాత్ర పోషించాలంటే బరువులను ఎత్తగలిగే శారీరక సామర్థ్యం ఉన్నవాళ్లయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. దానికోసమే సమంత, రకుల్‌లో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని అనుకున్నా.. చివరికి రకుల్‌వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఒకానొక సమయంలో తాప్సీని ఈ ప్రాజెక్టులో తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనను చిత్రబృందం చేసినట్లు సమాచారం. అయితే తాప్సీకి వేరే ప్రాజెక్టులు ఉండటం వల్ల వీలుపడలేదని తెలిసింది. దీంతో త్వరలోనే కోన వెంకట్ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసి రకుల్‌ను సంప్రదించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.