Alluarjun Pushpa Movie: "చేసే ప్రతీ సినిమా అంతకుముందు చేసిన కథలతో ఏమాత్రం సంబంధం లేనిదై ఉంటుంది. అందుకే ప్రతీ చిత్రమూ మాకో కొత్త రకమైన సవాల్‌ను విసరుతోంది. 'పుష్ప'ను ఎక్కువగా అడవుల్లోనే తెరకెక్కించినా... అందులోనూ కొత్తగా అడవుల్ని సృష్టించాం. ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంద"న్నారు ప్రొడక్షన్ డిజైనర్ ద్వయం రామకృష్ణ - మోనిక. భార్యాభర్తలైన ఈ జోడీ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసింది. 'రంగస్థలం' తర్వాత మరోసారి సుకుమార్‌తో కలిసి 'పుష్ప' చేశారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు రామకృష్ణ - మోనిక.
"అల్లు అర్జున్‌తో మాకు ఇదే తొలి సినిమా. 'రంగస్థలం' తర్వాత దర్శకుడు సుకుమార్ మరోసారి పిలిచి 'పుష్ప' కథ చెప్పారు. అడవుల నేపథ్యంలో సాగే దీనికి మేం చేయాల్సిన పనేమీ ఉండదు కదా? అన్నాం. చాలా ఉంటుందని చెప్పి సుకుమార్ అడవుల కోసం రెక్కీ చేయడానికి తీసుకెళ్లారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా పలు ప్రాంతాలు తిరిగాక రాజమండ్రి దగ్గర మారేడుమిల్లి అడవులే మా కథకి అనువుగా ఉంటాయనుకున్నాం. ఇప్పటిదాకా ఎవ్వరూ తెరపై చూపించని అడవులు అక్కడ ఉన్నాయి. అయితే మా కథకు తగ్గట్టుగా ఎర్రచందనం చెట్లు అక్కడ ఉండవు. ఈ కథేమో పూర్తిగా ఎర్రచందనం నేపథ్యంలో సాగుతుంది. అందుకే మేం చిత్రీకరణ చేసిన అడవుల్లోనే, ఎర్రచందనం కృత్రిమ చెట్లనీ, కొండల్ని సృష్టించాం. చిత్రీకరణ రెండేళ్లు సాగితే... అంతకుముందు పూర్వ నిర్మాణ పనుల కోసమని ఒక ఏడాదిపాటు పనిచేశాం. అలా మొత్తం మూడేళ్లు అడవుల్లోనే గడిపాం".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"తొలి రోజు చిత్రీకరణే 1500 మంది నేపథ్యంలో సాగింది. ఎర్రచందనం దుంగలు ఒకొక్కసారి వేల సంఖ్యలో అవసరమయ్యేవి. ఫోమ్, ఫైబర్ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశాం. వాటి కోసం వందల మందితో చిన్నపాటి ఫ్యాక్టరీనే ఏర్పాటు చేశాం. కొన్నిసార్లు అవి పాడైపోయేవి. అప్పుడు మళ్లీ కొత్తగా తయారు చేసేవాళ్లం. అడవుల్లో వరుసగా లారీలు వచ్చే సన్నివేశం కనిపిస్తుంది. అలాంటి నేపథ్యం కోసం మేం ప్రత్యేకంగా రహదారులే వేశాం. ఇలాంటి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తప్ప మరొకరు చేయలేరేమో అనిపిస్తుంది. మేం తయారు చేసిన కృత్రిమ దుంగల్ని చిత్రీకరణ కోసం కేరళకు తీసుకెళ్లాం. వచ్చేటప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం కాదన్నా, మేం సినిమావాళ్లమని చెప్పినా వాళ్లు వినలేదు. అవి సినిమా కోసం తయారు చేసినవని నిరూపించాకగానీ వదిలిపెట్టలేదు. సినిమా చూస్తున్నంతసేపూ ఎక్కడా సెట్స్ వేసి చిత్రీకరణ చేసినట్టు అనిపించదు. అంతగా సినిమాలో కలిసిపోయింది మా పని. ఒక రోజు సెట్లో సుకుమార్‌తో సన్నివేశాల గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ ఓ చిన్న కొండ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ కూర్చునే ప్రయత్నం చేయగా, అది మేం సృష్టించిన కొండ అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఏది నిజమైనదో కాదో నాకు చెప్పండని అడిగేవారు. అల్లు అర్జున్ లుక్, వెనకాల వేల మందికి సంబంధించిన వేషధారణ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుని పనిచేశాం. అడవులు కాబట్టి సాయంత్రం 3 అయ్యేసరికే చీకటి పడేది. మేమేమో సాయంత్రం 5 గంటలవరకైనా చేయాలనుకునేవాళ్లం. అందుకోసం ప్రత్యేకంగా లైటింగ్ చేయాల్సి వచ్చేది. అలా చాలా సవాళ్లే ఎదురయ్యాయి. 'రంగస్థలం', 'అంతరిక్షం', ఇప్పుడు 'పుష్ప'. దీని తర్వాత శంకర్-రామ్‌చరణ్ కలయికలో చిత్రం. ఇలా వరుసగా భిన్నమైన సినిమాలు చేస్తున్నాం. సాబు సిరిల్ దగ్గర శిష్యరికం చేశాం. వృత్తిని ఎంతగా ప్రేమిస్తే, సవాళ్లని అంతగా స్వీకరిస్తాం".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: బాలీవుడ్ కాదు.. నా టార్గెట్ అదే: అల్లు అర్జున్