Mohan babu son of india news: "జయాపజయాల్ని నేనెప్పుడూ పట్టించుకోను. సినిమా హిట్టయితే గొప్ప.. ప్లాపైతే అసమర్థత అనుకోకూడదు. మన ప్రయత్నంలో ఏమైనా లోపముందా? అని ఆలోచించుకోగలగాలి. ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోగలగాలి" నటుడు మోహన్‌బాబు అన్నారు. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా ఎన్నో వైవిధ్య మైన పాత్రలతో సినీ ప్రియుల్ని మెప్పించిన నటుడాయన. ఇప్పుడాయన 'సన్ ఆఫ్ ఇండియా'గా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన హీరోగా నటించడమే కాక.. స్వయంగా స్క్రీన్‌ప్లే అందించడం మరో విశేషం. డైమండ్ రత్నబాబు తెరకెక్కించారు. మంచు విష్ణు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు మోహన్‌బాబు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివి..
సందేశం.. వినోదాల మేళవింపుతో..
యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ సందేశాత్మక చిత్రమిది. ఇందులో నా పాత్ర చాలా శక్తిమంతంగా.. సరికొత్తగా ఉంటుంది. ‘చెడు వినకు.. చెడు చూడకు.. చెడు మాట్లాడకు’ అనే సిద్ధాంతాలకు తగ్గట్లుగా జీవనం సాగించే హీరో.. ఒక ఎమ్మెల్యే వల్ల చేయని తప్పునకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే తన కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. మరి జైలుకెళ్లిన హీరో ఆ తర్వాత ఏం చేశాడు? అవినీతి వ్యవస్థపై ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది చిత్ర కథాంశం. ఇందులో సందేశంతో పాటు చక్కటి ఎంటర్‌టైన్‌మెంటూ ఉంది’’.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
* మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అస్సలు లేదు. ఈ జన్మకు వద్దనుకున్నా. చంద్రబాబు బంధువు. అప్పుడు అన్నగారితో సినిమా చేశాం. ప్రచారానికి పంపించారు. వెళ్లాం. ఇప్పుడు జగన్ బంధువు. చంద్రబాబుకు చేసినట్టు ఇక్కడా చేయాలి కదా. ప్రచారం చేశాం. అయిపోయింది. ఇప్పుడు సినిమాలు, యూనివర్సిటీ.. అని బోలెడు పనులున్నాయి.
ఓటీటీకి అనుకున్నాం..
రత్నబాబు కథ చెప్పినప్పుడే సినిమా కచ్చితంగా చేయాలనిపించింది. నిజానికి ఇందులో కొంత రిస్క్ ఉన్నా.. సాహసం చేయకపోతే ఎలా? అన్న ఉద్దేశంతో ముందడుగేశాం. వాస్తవానికి మేము దీన్ని ఓటీటీ కోసం అనుకున్నాం. దీని నిడివి గంటన్నరే. అందుకే కాస్త కుర్రకారు కోరుకునే అంశాల్ని జోడించాం. సినిమాని థియేటర్‌లోకి తీసుకురావాలనుకున్నాక.. కొన్ని సన్నివేశాలు తీసేశాం. మళ్లీ ఓటీటీలో విడుదల చేసేటప్పుడు వాటిని జోడించే అవకాశముంది. ఈ చిత్రంలో వినిపించిన 11వ శతాబ్దాం నాటి రఘువీర గద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి ఆ పాటను ప్రత్యేకంగా రూపొందించాం. ఈ గీతాన్ని పాడించడం కోసం తొలుత నలుగురైదుగురు గాయకుల్ని ప్రయత్నించాం. కానీ, ఈ పాటకు వాళ్లు సెట్ కాలేదు. తర్వాత నేను, ఇళయరాజా బాగా ఆలోచించి.. మలయాళ గాయకుడు రాహుల్ నంబియార్‌తో ఆ గద్యాన్ని పాడించాం.
రాజకీయాలంటే.. 'ఛీ' అంటున్నారు..
రాజకీయాలు ఒకప్పుడే బాగున్నాయి. ఇప్పటి రాజకీయాల్లో నీతి నిజాయితీలు, నైతిక విలువలు కనిపించడం లేదు. అందుకే అప్పట్లో రాజకీయాల్లో ఉంటే 'చాలా గొప్ప వాడు' అనేవారు. అదే ఇప్పుడు ఉంటే ‘ఛీ’ అంటున్నారు. అలాగని ఇప్పుడు మంచి నాయకులు లేరని కాదు. కొద్దిమంది ఉన్నారు. వాళ్లూ ఏమీ చేయలేని పరిస్థితులున్నాయి. ఇలాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపించాం. ‘ప్రైవేట్ జైళ్లు’ అనే ఓ ఆసక్తికరాంశాన్ని ఇందులో చర్చించాం.
* దర్శకత్వం చేయాలన్న ఆలోచన ఉంది. రెండు స్క్రిప్ట్‌లు రెడీ చేసి పెట్టుకున్నాను. కాకపోతే రోజుకొకరిని కొడతానేమోనని భయం (నవ్వుతూ). ఎందుకంటే చెప్పిన టైమ్‌కు ఆర్టిస్ట్ సెట్స్‌లో ఉండకపోతే నాకు నచ్చదు. కోపం వచ్చేస్తుంది. చిన్నతనంలో ఆకలి మంటల్లో నుంచి పుట్టిన కోపమది. అది అప్పటి నుంచి నాతోనే ఉండిపోయింది. నేను జీవితంలో బానిసైంది ఆ కోపానికే. దానివల్ల నష్టపోయింది నేనే.
* ప్రస్తుతం నేను నా జీవిత కథ రాసే పనిలో ఉన్నా. అందులో నిజాలు రాస్తున్నాను. ఇప్పటికే కొంత వరకు రాసి.. ఆపాను. దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. దీన్ని తెరపైకి తీసుకురావాలా? తీసుకొస్తే ఎవరితో చేయాలి? అన్నది నేనేమీ ఆలోచించలేదు.
దాన్ని తప్పు పడితే ఎలా?
టికెట్ రేట్లపై నేనిప్పటికే మాట్లాడాను. దానిపై మళ్లీ మాట్లాడదలచుకోలేదు. ప్రతి పార్టీలోనూ నాకు స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. పేర్ని నాని ఒక పెళ్లికి వస్తే.. 'బ్రదర్, మా ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు వస్తారా?' అని అడిగా. అందులో తప్పేముంది. దాన్ని తప్పు పడితే ఎలా? సరదాగా మేం ఎప్పుడు కలిశాం, ఎవరితో కలిశామన్నది మాట్లాడుకున్నాం. అంతే! ‘జగన్ ఏం మాట్లాడారు? మా సినిమా వాళ్లు ఏం మాట్లాడారు? ఆ విషయాలన్నీ నాకు చెప్పండి!’ అని ఎందుకు అడుగుతా. ఇంటికి పిలిచిన అతిథిని గౌరవించాం. దాని గురించి రకరకాలుగా రాశారు.
ఇవీ చదవండి: