"చిత్రసీమలో విజయాలే చాలా విషయాల్ని నిర్ణయిస్తుంటాయి. విజయాలు దక్కితేనే అవకాశాలు వరుస కడుతుంటాయి. కానీ అలా వచ్చిన ప్రతి చిత్రాన్ని అంగీకరిస్తే కెరీర్ ఇబ్బందుల్లో పడొచ్చు. అలాంటప్పుడే ఆచితూచి వ్యవహరించాలి" అంటోంది కియారా అడ్వాణీ. బాలీవుడ్‌లో అటు స్టార్ హీరోలతోనూ ఇటు యువ కథానాయకులతోనూ ఆడిపాడుతున్న ఈ నాయిక కెరీర్ జోరుగానే సాగుతోంది. 'చిత్రసీమలో నాయికల మధ్య పోటీ ఎక్కువగానే ఉంటుంది.. ఇలాంటి సమయంలోనూ అవకాశాల విషయంలో ఎలా వ్యవహరిస్తారు?' అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.
"నాకు ఎలాంటి కథలు సరిపోతాయో, నేను ఎలాంటి పాత్రలు చేయాలో నాకు బాగా తెలుసు. ప్రస్తుతం నాకు అవకాశాలు బాగా వస్తున్నాయి. అవకాశాలు తగ్గాయని ఏది పడితే అది ఒప్పుకోను. ఓర్పుగా ఎదురుచూస్తా. ఎక్కువ అవకాశాలు వచ్చిపడినా వాటిలోంచి మనకు సరిపోయే వాటిని జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా కష్టమైన పని. అలాంటి పనిని చాకచక్యంగా చేయగలిగే వాళ్లలో నేనూ ఉంటా. ఆ సమతూకం నాకు తెలుసు" అని చెప్పింది కియారా.
కియారా ఆమె ప్రస్తుతం 'షేర్షా', 'భూల్ భులయ్యా 2', 'జుగ్ జుగ్ జీయో' చిత్రాల్లో నటిస్తోంది.