బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ జ్ఞాపకార్థం 'సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫౌండేషన్ (ఎస్ఎస్ఆర్ఎఫ్)'ను స్థాపించనున్నట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. అతడు సంపాదించి కూడబెట్టిన ఆస్తితోనే దీనిని నిర్వహించనున్నారు. సుశాంత్ అమితంగా ఆసక్తి కనబరిచే సినీ, సాంకేతిక, క్రీడారంగాల్లో ప్రతిభ ఉన్న యువతను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు.
ఇది కాకుండా సుశాంత్ చిన్ననాటి ఇంటిని ఓ స్మారక చిహ్నంగా మార్చనున్నట్లు తెలిపారు. ఇందులో అతడు వినియోగించిన పుస్తకాలు, 'ఫ్లైట్ సిమ్యులేటర్', 'మీడ్ 14 ఎల్ ఎక్స్-600 టెలిస్కోప్', ఇతరత్ర వస్తువులను భద్రపరచనున్నారు. అభిమానుల సందర్శనార్థం వీటిని అందుబాటులో ఉంచనున్నారు.
సుశాంత్ నిత్యం తను కన్న కలలను నెరవేర్చుకోవడం కోసం ఓ సింహంలా పోరాడేవాడంటూ భావోద్వేగంతో అతడిని గుర్తుచేసుకున్నారు అతని కుటుంబసభ్యులు.
"సుశాంత్ మా కుటుంబానికి ఓ స్ఫూర్తి. అతడిని చూసి గర్వపడేవాళ్లం. ఎప్పుడూ స్వతంత్రంగా జీవించేవాడు. కష్టజీవి. ఎక్కువ కలలు కనేవాడు. వాటిని నెరవేర్చుకోవడం కోసం నిత్యం ఓ సింహంవలె ధైర్యంగా పోరాడేవాడు. ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా వాటిని అధిగమించి కృషి చేసేవాడు. ఎంతో తెలివి, వాక్చాతుర్యం వంటి లక్షణాలు అతనిలో ఉన్నాయి. కానీ ఈరోజు అతడి నవ్వులు, ఉత్సహాభరితమైన కళ్లు, ఏకంగా అతడినే కోల్పోయాం. అతని మరణం మా జీవితాల్లో తీరని లోటు. అందుకే ప్రతిభ ఉన్న యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో అతడి జ్ఞాపకార్థంగా ఎస్ఎస్ఆర్ఎఫ్ సంస్థను స్థాపించనున్నాం."
-సుశాంత్ సింగ్ కుటుంబసభ్యులు.
ముందుగా బుల్లితెర అరంగేట్రం చేసి తర్వాత వెండితెరకు పరిచయమయ్యాడు సుశాంత్. 'కై పొ చే' 'ధోని :ది అన్టోల్డ్ స్టోరీ', 'చిచ్చొరె' వంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలోనే అతడు నటించిన 'దిల్ బెచారా' సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది.
ఇది చూడండి : 'ఆ రహస్యం నీతో పాటే వెళ్లిపోయింది సుశాంత్'