పరాజితుల్లోనూ హీరోల్ని చూశారు యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అందులో నుంచే 'జెర్సీ' కథ పుట్టింది. ఆ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు పురస్కారాల పంట కూడా పండింది. 67వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'జెర్సీ' నిలిచింది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలివీ..
మీ సినిమా జాతీయ పురస్కారం లభించిందనే కబురు విన్నప్పుడు మీలో కలిగిన అనుభూతి?
హిందీ 'జెర్సీ'కి సంబంధించిన ఎడిటింగ్ పనుల్లో ఉన్నా. చెన్నై నుంచి నా స్నేహితుడు ఫోన్ చేసి విషయం చెప్పారు. ముందు నమ్మబుద్ధి కాలేదు. ఆ తర్వాత చాలా సంతోషంగా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. 'జెర్సీ' కథపైనే ఇప్పుడు కూడా పనిచేస్తున్నా. ఆ కథకే పురస్కారం రావడం ఎంతో తృప్తినిచ్చింది.
'జెర్సీ' విడుదల తర్వాత కానీ.. లేదంటే కథ రాసుకునేటప్పుడు కానీ పురస్కారాల్ని ఊహించారా?
ఈ కథ రాసుకుంటున్నప్పుడు ఒక్కటే ఆలోచన వచ్చేది. ఈ కథకు మంచి నటులు తోడైతే బాగుండేదని! నేను అనుకున్నట్టుగానే నాని, శ్రద్ధ శ్రీనాథ్.. ఇలా మంచి నటులు తోడయ్యారు. ఇక సెట్‌పైకి వెళ్లాక.. మంచి సినిమా చేయాలనే తపన మాత్రమే ఉండేది. పురస్కారాల గురించి నేనైతే ఎప్పుడూ ఆలోచించలేదు.
జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం రాలేదనే అసంతృప్తి ఏమైనా ఉందా?
తెలుగు నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి కదా. వాటిలో మా చిత్రం విజేతగా నిలవడం ఆనందమే. అంతే కానీ.. జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం రాలేదనే అసంతృప్తి అంటూ ఏమీ లేదు. 'జెర్సీ'కి ఎడిటింగ్ విభాగంలో నవీన్ నూలికి జాతీయ పురస్కారం రావడం సంతోషాన్నిచ్చింది. ఆయన మంచి ఎడిటర్. నవీన్ సినిమాపైనా, సన్నివేశాలపైనా మంచి పట్టుని ప్రదర్శిస్తుంటాడు. తను జాతీయ పురస్కారానికి అర్హుడు. అది మా సినిమాతో అందుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఉత్తమ నటుడిగా నానికి పురస్కారం దక్కాల్సింది. అదొక్కటి వచ్చుంటే 'జెర్సీ' పరిపూర్ణం అయ్యేది.
హిందీ 'జెర్సీ' తర్వాత తెలుగులోనే సినిమా చేస్తారా లేక హిందీలోనేనా?
కథయితే తెలుగులోనే రాస్తున్నా. కథను, సంభాషణల్ని రాయడంలో నాకు తెలుగులోనే సౌకర్యంగా ఉంటుంది.
'జెర్సీ' కథ ఎవరి జీవితం నుంచైనా స్ఫూర్తి పొంది రాసుకున్నారా?
మనం ఎప్పుడూ విజయవంతమైన వ్యక్తుల గురించే మాట్లాడుకుంటాం. వాళ్లనే చూస్తాం, వాళ్ల మత్తులోనే ఉంటాం. కానీ మన మధ్యే ఉన్న చాలా మంది హీరోల్ని మనం గుర్తించం. ఇదే అంశమే ఈ కథకు స్ఫూర్తి. అంతే తప్ప ఎవరి జీవితం నుంచి స్ఫూర్తి పొందిన కథేమీ కాదు.
ఇదీ చూడండి: ఆ సినిమాలో పవన్‌తో పాట పాడిస్తున్నా: తమన్