"అన్ని రంగాల్లోనూ స్త్రీ-పురుష అసమానతలున్నాయి. ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు మారుతున్నాయి" అన్నారు నటి సాయిపల్లవి. ఫిదాతో తెలుగు సినీప్రియుల్ని పలకరించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. మొదటి నుంచీ బలమైన నాయికా ప్రాధాన్య పాత్రలకు చిరునామాగా నిలుస్తున్నారు. తాజాగా 'చిత్రసీమలో లింగ సమానత్వం'పై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. "ప్రతి రంగంలో అసమానతలున్నాయి. చిత్రసీమలో మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అనుష్క, నయనతార వంటి నటీమణుల వల్ల నాయికలు సినిమాల్ని తమ భుజాలపై మోయగలరని నిర్మాతలు నమ్ముతున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు నేనూ మరింత బలమైన పాత్రలు పొందుతున్నా" అని చెప్పుకొచ్చారు సాయిపల్లవి. ఈ సందర్భంగా లింగ సమానత్వం విషయంలో హీరో రానాను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన 'సమానత్వాన్ని విశ్వసించే వ్యక్తి' అని కొనియాడారు.
"సాధారణంగా సినిమాల్లో స్త్రీ పాత్రకు ఎంత ప్రాముఖ్యమున్నా.. పోస్టర్లలో పురుషుడి పేరే హైలెట్ అవుతుంది. 'విరాఠపర్వం' టైటిల్ కార్డుల్లో రానా పేరు కన్నా ముందు నా పేరు ఉంటుంది. ఇది నేను కోరుకున్నది, ఆలోచించినది కాదు. కానీ, రానా దాని గురించి ఆలోచించారు. ఈ చిత్రంలో నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నానని రానా నమ్మారు. ఆయన సమానత్వాన్ని విశ్వసించే వ్యక్తి. అందుకే టైటిల్ కార్డులో తన పేరు కన్నా ముందు నా పేరు ఉండాలని సూచించారు. అలాంటి నటుడితో కలిసి పని చేయడం గొప్పఅనుభవం" అన్నారు సాయిపల్లవి.
ఇదీ చూడండి : లిప్‌కిస్ నుంచి అలా తప్పించుకున్నాను: సాయిపల్లవి