బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సోదరి అల్విరా సహా ఆయన సొంత సంస్థ 'బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్' అధికారులపై చండీగఢ్‌లో చీటింగ్ కేసు నమోదైంది. మనీమాజ్రా ప్రాంతానికి చెందిన అరుణ్ గుప్తా అనే ఓ వ్యాపారి పిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
అసలేమైంది?
బీయింగ్ హ్యూమన్ వస్త్రాల షోరూమ్‌ను రూ.3 కోట్ల ఖర్చుతో మనీమాజ్రాలో అరుణ్ గుప్తా ప్రారంభించారు. అయితే.. దిల్లీ నుంచి తనకు సదరు సంస్థ నుంచి అందాల్సిన వస్త్రాలు రాలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా బీయింగ్ హ్యూమన్ సంస్థ వెబ్సైట్ కూడా పని చేయడం లేదని తెలిపారు.
![case on slaman khan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/hr-cha-03-fir-on-salman-72033297_08072021133100_0807f_1625731260_292.jpg)
సల్మాన్ వస్తారని చెప్పారు..
మనీమాజ్రాలో షాపు తెరవాలని బీయింగ్ హ్యూమన్ సంస్థ ఉద్యోగులే తనను కోరారని అరుణ్ గుప్తా తెలిపారు. దాంతో షోరూమ్‌ను తెరిచానని చెప్పారు. షోరూమ్ బిల్డింగ్ నిర్మాణం కోసం రూ.1 కోటి ఖర్చు చేయగా.. దానికి హంగులద్దడానికి మరో రూ.2 కోట్లు ఖర్చు చేశానని ఆయన పేర్కొన్నారు. తనను బిగ్‌బాస్ సెట్లోకి కూడా పిలిచి, సల్మాన్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. షోరూమ్ ప్రారంభించేందుకు తాను వస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే.. ఆయన మాత్రం రాలేదని అన్నారు అరుణ్.
"బీయింగ్ హ్యమన్ ఫ్రాంఛైజీ తెరవాలని ఆ సంస్థ ఉద్యోగులే నన్ను కోరారు. అందుకు మేం అంగీకరించాం. దీనికి రూ.2 కోట్లు పెట్టుబడి అవుతుందని చెప్పారు. ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్ వస్తారని వారు నాపై ఒత్తిడి తెచ్చి, షోరూమ్ తెరిచేలా చేశారు."
- అరుణ్ గుప్తా, వ్యాపారి.
అరుణ్ గుప్తా చేసిన ఫిర్యాదు ఆధారంగా సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు చండీగఢ్ పోలీసులు ధ్రువీకరించారు. జులై 13లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని సల్మాన్ ఖాన్‌ను ఆదేశించినట్లు చండీగఢ్ ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు.
ఇదీ చూడండి: 'విడిపోయిన వారిని లైంగిక జీవనం సాగించమంటారా?'