బాలీవుడ్‌లో బంధుప్రీతి, మాదకద్రవ్యాలు లాంటి అంశాలపై తరచూ విమర్శలు చేస్తున్నారు నటి కంగనా రనౌత్. సోషల్‌మీడియాలో పలువురు నటీనటులపై ఆమె చేసిన ఆరోపణలు.. కొన్నిసార్లు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో కంగన ప్రవర్తన పట్ల ఆమె తొలి సినిమా దర్శకుడు అనురాగ్ బసు స్పందించారు.
'దాదాపు 25 మంది యువతులు అప్పట్లో 'గ్యాంగ్‌స్టర్' ఆడిషన్‌లో పాల్గొన్నారు. వారందరిలో కంగన ఒక్కరే నా సినిమాలోని పాత్రకు సెట్ అయ్యిందనిపించింది. ఆమె చాలా విభిన్నమైన వ్యక్తి. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాబట్టి, ఎలాంటి అనుమానాలున్నా, నన్ను అడిగి తెలుసుకునేది. ఏదైనా త్వరగా గ్రహించగల సామర్థ్యం ఆమెలో ఉంది. ఆమె తప్పకుండా పేరు తెచ్చుకుంటుందని 'గ్యాంగ్‌స్టర్' సమయంలోనే నాకు అర్థమైంది'
'సాధారణంగా మేమిద్దరం ఎక్కువగా కలుసుకోం. ఎప్పుడైనా కలిసినా సరే.. చాలా సరదాగా ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు తెలిసిన కంగన.. ఇప్పుడు మనం చూస్తున్న కంగన ఒక్కరు కాదు. నాకు తెలిసి ఇద్దరు కంగనా రనౌత్‌లు ఉన్నారు. వారిలో ఒక్కరు మాత్రమే నాకు తెలుసు. మరొకరి గురించి నాకేమీ తెలియదు. ఆ రెండో కంగనా రనౌత్ నాకస్సలు అర్థం కాదు' అని అనురాగ్ బసు అన్నారు.
అనురాగ్ బసు తీసిన 'గ్యాంగ్‌స్టర్' చిత్రంతో ఆమె హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన కంగన.. 'ఫ్యాషన్', 'క్వీన్', 'తను వెడ్స్ మను', 'క్రిష్', 'సిమ్రన్', 'మణికర్ణిక', 'పంగా' లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా తీస్తున్న 'తలైవి' చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు.