'ఖిలాడి' చిత్రంతో ప్రేక్షకులు ఓ సరికొత్త రవితేజను చూస్తారు అని దర్శకుడు రమేశ్ వర్మ అన్నారు. 'రాక్షసుడు' లాంటి విజయం తర్వాత ఆయన నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతోంది. ఆదివారం రమేశ్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా శనివారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
*ఇదొక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. జీవితంలో అందరికీ డబ్బు చాలా ముఖ్యం. అయితే జీవితంలో డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వాలా..? భావోద్వేగాలకు ఇవ్వాలా..? రెండూ ముఖ్యమా? అని ఆలోచింపజేసేలా రెండు పాత్రలుంటాయి. ఆ పాత్రల కథే ఈ 'ఖిలాడి' సినిమా. ఈ కథ అనుకున్నప్పుడే దీనికి రవితేజ అయితేనే న్యాయం చేయగలరనిపించింది. 'రాక్షసుడు' చిత్రీకరణ సమయంలోనే ఆయనకు ఈ కథ చెప్పా. విన్న వెంటనే చేసేద్దామన్నారు. ఇందులో రవితేజ చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయన ద్విపాత్రాభినయం చేశారా..? త్రిపాత్రాభినయమా? అన్నది తెరపైనే చూడాలి. దాదాపు రూ.65కోట్లు ఖర్చుతో భారీగా రూపొందించాం. టెక్నికల్‌గా ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుంది.
* 'ఖిలాడి' మరే చిత్రానికి రీమేక్ కాదు. మేం ఈ సినిమా అనుకున్నాక.. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే తమిళంలో ఓ చిత్రం మొదలైందని తెలిసింది. ఎందుకైనా మంచిదని ఆ చిత్ర హక్కులు కొని ఉంచాం. కొవిడ్ పరిస్థితుల వల్లే ఈ చిత్రం ఆలస్యమైంది. ఫలితంగా బడ్జెట్ కాస్త పెరిగింది. ప్రస్తుతం మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన పనులు పూర్తి చేసి, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. నేను ప్రస్తుతం దర్శకుడు మారుతితో కలిసి ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నా. ఓ ముఖ్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. సరైన సమయంలో 'రాక్షసుడు 2'ని సెట్స్‌పైకి తీసుకెళ్తాం. దీన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలా రూపొందించనున్నాం. ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతితో మాట్లాడాం. ఆయన నిర్ణయం తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: