కోలీవుడ్‌లో స్టార్ హీరోలే లక్ష్యంగా వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా చియాన్ విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బసంత్‌నగర్‌లో ఉన్న విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విక్రమ్ ఇంటికి చేరుకొని మొత్తం గాలించారు. అయితే.. ఎక్కడా ఎలాంటి బాంబు లభ్యం కాలేదు. దీంతో అది పోలీసులను ఆటపట్టించేందుకు ఆకతాయులు చేసిన చర్య అని నిర్ధారించారు. ఆ ఫోన్ చేసిన వారెవరో కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
గతంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్య ఇళ్లలోనూ బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి.
ప్రస్తుతం విక్రమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా సినిమాలో విక్రమ్ నటిస్తున్నారు. ఇందులో ఆయన ఏకంగా ఏడు పాత్రల్లో కనిపించబోతున్నారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్‌లోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతోపాటు మరో మూడు తమిళ సినిమాలకు చియాన్ సంతకం చేశారు.