Akhanda movie: నటసింహం బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి కాంబినేషన్ సినిమా వస్తోందంటే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. వీరి కాంబోలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్బస్టర్లు ఉండటమే అందుకు కారణం. రెండు హిట్లు కొట్టిన ఈ ద్వయం.. అఖండ సినిమాతో హ్యాట్రిక్ కొట్టింది. వెండితెరపైన బాలయ్యను చూసుకుని అభిమానులు మురిసిపోయారు. చాలా కాలం తర్వాత మంచి మస్ జాతర లాంటి సినిమా రావడం వల్ల ఈ చిత్రానికి అఖండ విజయం అందించారు. మరి ఈ విజయంపై చిత్ర బృందం ఏమంటోందంటే...
అఖండ ఇంత భారీ విజయం సాధిస్తుంది మీరు ఊహించారా?
బాలకృష్ణ: మా కాంబినేషన్లో సినిమా వస్తోంది కాబట్టీ ప్రేక్షకులు భారీ అంచనాలతో థియేటర్లకు వస్తారు. కాబట్టీ ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందనే నమ్మకం నాకు ఉండేది. ఓ సినిమా విడుదలైతే దానిని ప్రేక్షకులు పండగలా జరపుకుంటున్నారు. ఒకటి ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో నిర్మాతలు ధైర్యంగా రిలీజ్ చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది.
మీ కాంబినేషన్లో సింహా, లెజెండ్ వంటి హిట్స్ ఉన్నాయ్. లెజెండ్ అయితే దాదాపు 1400 రోజులు నడిచింది. అలాంటిది మూడోసారి సినిమా చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదా?
దర్శకుడు బోయపాటి: సింహా లెజెండ్ తర్వాత సినిమా చేస్తున్నందుకు ఒత్తిడిగానే ఉంది. కానీ నాకో నమ్మకం ఉంది.. ఆ నమ్మకమే బాలయ్యగారు. నేను చెప్పిన దాన్ని నమ్మి చేస్తుంటారు. ఆయన చేస్తారు కాబట్టే నేను కూడా స్వేచ్ఛగా సినిమా తీయగలుగుతున్నాను. ప్రొడ్యుసర్లు, సంగీత దర్శకుడు తమన్ కూడా నాకు సహకరించారు. వీరందరి సహకారంతో నేను చేసిన సినిమాను ప్రేక్షకులు ఆదరించినందుకు వారికి ధన్యవావాలు.
"లెజెండ్‌తో నాకు గిఫ్ట్ ఇచ్చారు బోయపాటి-బాలయ్య. రిటర్న్ గిఫ్ట్‌గా ఈ మూవీ చేశా. వాళ్ల కాంబినేషన్ అనగానే ఆలోచించకుండా నటించా. హిట్ అవుతుంది తెలుసు కానీ ఇంత స్థాయిలో అవుతుందని అనుకోలేదు."
-జగపతిబాబు, సీనియర్ నటుడు.
"ఈ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. బోయపాటి కాల్ చేసి చెప్పగానే కళ్లు మూసి ఒప్పుకున్నా. కలెక్టర్‌గా నటించడం, తెలంగాణ వ్యాస మాట్లాడటం, భార్య, తల్లిగా కనిపించడం ఇలా నాలోని చాలా షేడ్స్‌లో చూపించారు. బాలయ్య ఎనర్జీకీ పవర్‌హౌస్. సెట్లో చాలా సరదాగా ఉంటారు."
-ప్రగ్యాజైశ్వాల్, హీరోయిన్.
విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ.63 కోట్లకిపైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది 'అఖండ'. పలు ప్రాంతాల్లో బాలకృష్ణ గత సినిమాలు సాధించిన రికార్డుల్ని తుడిచేసింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన పక్కా మాస్ సినిమా కావడం, విజయవంతమైన బాలకృష్ణ - బోయపాటి కలయికలో సినిమా కావడం 'అఖండ'కు కలిసొచ్చింది.
ఇదీ చూడండి : Akhanda Movie: 'అఖండ' జోరు.. బాక్సాఫీసుకు ఊపు