బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకోనున్నారు. 15 ఏళ్ల దాంపత్యానికి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ దీనిపై అధికారికంగా ప్రకటించారు. ఇది ఆమిర్‌కు రెండో పెళ్లి. ఇప్పటికే రీనా దత్తాతో 16 ఏళ్లు కలిసుండి ఆమెతో విడిపోయారు.
"ఈ 15 ఏళ్లలో జీవితాంతం గుర్తుండిపోయే మధుర స్మృతుల్ని సంపాదించాం. ఎంతో ఆనందంగా గడుపుతూ నమ్మకం, ప్రేమ, గౌరవంతో ముందుకుసాగాం. ఇప్పుడు మేమిద్దరం విడిపోయి వేర్వేరు జీవితాల్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ఇకపై భార్యాభర్తలుగా ఉండబోం. కొంత కాలం క్రితమే మేము ఈ విషయంపై నిర్ణయానికి వచ్చాం. ఈ విషయాన్ని చెప్పడానికి ఇది సరైన సమయం అనుకున్నాం. మా తనయుడు ఆజాద్‌కు తల్లిదండ్రులుగా అండగా ఉండదల్చుకున్నాం. మా నిర్మాణంలోని పానీ ప్రొడక్షన్స్‌లోని సినిమాల కోసం కలిసి పనిచేస్తాం. మా ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు."
-ఆమిర్ ఖాన్, కిరణ్ రావు
'లగాన్' చిత్రీకరణ సమయంలో ఆమిర్, కిరణ్ రావు మొదటిసారిగా కలుసుకున్నారు. ఈ చిత్రంలో ఆమిర్ హీరో కాగా కిరణ్ సహ నిర్మాతగా వ్యవరించారు. తర్వాత కొంతకాలం సహజీవనం చేసిన వీరిద్దరూ డిసెంబర్ 28, 2005లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2011లో సరోగసి ద్వారా ఆజాద్ అనే బిడ్డను ప్రపంచానికి పరిచయం చేశారు.
ఆమిర్ ఖాన్‌కు ఇది రెండో పెళ్లి. రీనా దత్తా అనే మహిళతో 16 ఏళ్లు కలిసున్న తర్వాత 2002లో వీరు విడిపోయారు. వీరిద్దరికి ఇరా ఖాన్, జునైద్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.