- ఏదో సమావేశానికి వెళ్తున్నారు. ‘మీరు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు’ అని యాప్ సందేశం పంపింది.
- గడువు లోపు పూర్తి చేయటానికి ఏకధాటిగా పని చేస్తున్నారు. అంతలో ‘మీ మనసంతా ఒత్తిడిలో మునిగిపోయింది. కాసేపు విరామం తీసుకోండి’ అంటూ ఓ నోటిఫికేషన్!
- ఆయా సందేశాలను చూడగానే ఒకింత విశ్రాంతి తీసుకున్నారు. యాప్ సూచించినట్టుగా ఐదు నిమిషాలు ధ్యానం చేశారు. తిరిగి మామూలు స్థితికి వచ్చారు.
- ఊహించుకోవటానికే విచిత్రంగా ఉంది కదా. శరీరానికి ధరించే పరికరాలు ఇలాంటి సేవలే అందిస్తున్నాయి. నిరంతరం ఒంట్లో జరిగే మార్పులను గమనిస్తూ.. అవసరమైనప్పుడు ఒత్తిడిని తగ్గించటానికి మెసేజ్‌లతో హెచ్చరిస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి దారి చూపిస్తున్నాయి. అందుకే వీటికి రోజురోజుకీ ఆదరణా పెరుగుతోంది.
ఒత్తిడి.. ఒత్తిడి.. ఒత్తిడి! వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఉద్యోగం, పని, ఆర్థిక పరమైన అంశాల మూలంగా మనదేశంలో 89% మంది మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారని ఆ మధ్య సిగ్నల్ టీటీకే హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ నిర్వహించిన అధ్యయనం పేర్కొంటోంది. ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారి ప్రపంచ సగటు (86%) కన్నా ఇది ఎక్కువ. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఒత్తిడిని ఎదుర్కోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారనీ సర్వే తేల్చి చెప్పింది. వీరిలో మిలీనియల్స్ సంఖ్యే ఎక్కువ. ఇదేమీ కొత్త విషయం కాదు. కార్పొరేట్ ప్రపంచం చాలాకాలంగా ఎదుర్కొంటున్నదే. ఒత్తిడి నుంచి బయటపడటానికి నవతరం శరీరానికి ధరించే వాచ్‌లు, బ్యాండులు, రింగుల వంటి స్మార్ట్ పరికరాల సాయం తీసుకోవటమే కొత్త విషయం.
ఒత్తిడిని ఎలా పసిగడతాయి?
శరీరానికి ధరించే పరికరాలు మన లోపల పుట్టుకొస్తున్న ఒత్తిడిని ఎలా పసిగడతాయి? చాలామందికి కలిగే సంధేహమిది. దాదాపు అన్ని స్మార్ట్‌వాచ్‌లు, బ్యాండులు, రింగులు గుండె వేగం మధ్య తారతమ్యాల (హెచ్‌ఆర్‌వీ) ఆధారంగా పనిచేస్తాయి. అంటే ఒకసారి గుండె కొట్టుకున్నాక మరోసారి కొట్టుకోవటానికి మధ్య ఎంత సేపు పడుతోందని లెక్కించటం. ఇవి మిల్లీసెకండ్ల వ్యవధిలోనూ తేడాలను పసిగడతాయి. హెచ్‌ఆర్‌వీ తక్కువగా ఉండటం ఒత్తిడి, నిస్సత్తువకు సూచిక. అయితే కొన్నిసార్లు స్మార్ట్‌వాచ్‌లు ఒత్తిడి, ఉత్సుకతల మధ్య తేడాను గుర్తించలేవు. ఎందుకంటే రెండూ నాడీ వ్యవస్థ ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు- మనం కదలకపోయినా గుండె వేగంగా కొట్టుకుంటుండొచ్చు. దీన్ని స్మార్ట్‌వాచ్ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగానే భావిస్తుంది. ఎలెక్ట్రోడెర్మల్ యాక్టివిటీ (ఈడీఏ) సెన్సర్లతో కూడిన పరికరాలూ అందుబాటులోకి వచ్చాయి. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు రక్తనాళాలు విప్పారతాయి. అప్పుడు చర్మం ఉష్ణోగ్రత స్వల్పంగా.. 0.1 నుంచి 0.2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది. దీని ఆధారంగా నిరంతరం ఒత్తిడి తీరుతెన్నులను గుర్తిస్తాయి. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యాప్‌తో అనుసంధానమై సమాచారాన్ని నమోదు చేస్తాయి.
కొన్ని పరికరాలు ఇవీ
ఫిట్‌బిట్ సెన్స్
ఇది ఈడీఏ సెన్సర్లతో పాటు హెచ్‌ఆర్‌వీతోనూ ఒత్తిడి స్థాయులను లెక్కిస్తుంది. ఫిట్‌బిట్ యాప్‌లో రోజూ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ స్కోరును తెలుసుకోవచ్చు. తీవ్రతను బట్టి 1 నుంచి 100 నంబర్లను కేటాయిస్తుంది. ఎంత పెద్ద నంబరైతే అంత తక్కువ ఒత్తిడి ఉన్నట్టు లెక్క. ఫిట్‌బిట్ ప్రీమియం చందాదారులైతే స్లీప్ ప్యాటర్న్ వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లనూ వాడుకోవచ్చు. ఇందులో ‘రిఫ్లెక్షన్స్’ ఫీచర్ మరో ఆకర్షణ. ఎలా ఫీల్ అవుతున్నామని తెలిపే సదుపాయం ఇది. ‘వెరీ కామ్’ దగ్గర్నుంచి ‘వెరీ స్ట్రెస్డ్’ వరకు భావోద్వేగాల తీరును తెలుపుతుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 4
సామ్‌సంగ్ ప్రస్తుతం కొత్త, వేగంగా పనిచేసే చిప్‌తో కూడిన వాచ్‌లను తీసుకొస్తోంది. వీటిల్లో వినూత్న బయోయాక్టివ్ సెన్సర్‌నూ జోడించింది. ఇది శరీర ఎత్తు బరువుల నిష్పత్తితో పాటు అమెరికా నేషనల్ స్లీప్ ఫౌండేషన్ మార్గదర్శకాల మేరకు గురక తీరును.. అలాగే ఒత్తిడి స్థాయులనూ పసిగడుతుంది.
గార్మిన్ ఇన్‌స్టింక్ట్ సోలార్ 2
ఇది బయట ఎక్కువగా గడిపే వారి కోసం రూపొందించింది. వేడి, కుదుపులను తట్టుకునేలా సైనిక ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తయారుచేశారు. దీనిలోని స్ట్రెస్ లెవల్ ఫీచర్ గుండె వేగం మధ్య తేడాల ఆధారంగా పనిచేస్తుంది. ఇది 0 నుంచి 100 నంబర్లతో ఒత్తిడి స్థాయులను తెలియజేస్తుంది. 0-25 అయితే విశ్రాంతి దశలో ఉన్నట్టు. అదే 76-100 మధ్యలో ఉంటే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందనే. ఒత్తిడి చాలా ఎక్కువగా పెరిగినప్పుడు ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలను చేయాలనీ సూచిస్తుంది.
యాపిల్ వాచ్ సిరీస్ 7
యాపిల్‌కు చెందిన మైండ్‌ఫుల్‌నెస్ యాప్‌ను చాలామంది అపార్థం చేసుకుంటుంటారు. ఇది తరచూ గాఢంగా శ్వాస తీసుకోవాలని ఎందుకు సూచిస్తుందని ఆశ్చర్య పోతుంటారు. దీనికి సమాధానం మైండ్‌ఫుల్‌నెస్ యాప్‌లోనే ఉంది. రోజూ కాసేపు ప్రశాంతంగా కూర్చొని శ్వాస తీసుకుంటున్న తీరును నిశితంగా, ఏకాగ్రతతో గమనించాలని చెప్పటమే దీని ఉద్దేశం. అవసరాన్ని బట్టి ప్రత్యేక ధ్యాన పద్ధతులనూ సూచిస్తుంది. ప్రశాంతగా శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు గుండె వేగాన్ని కూడా తెలియజేస్తుంది. దీన్ని బట్టి ధ్యానంతో లభించే ప్రయోజనమేంటో ఎవరికివారే అర్థం చేసుకోవచ్చు.
ధ్యాన స్మార్ట్ రింగ్
దీన్ని హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ అవంతరి తయారుచేసింది. హెచ్‌ఆర్‌వీని విశ్లేషిస్తూ ధ్యాన సెషన్స్‌ను నిర్ణయిస్తుంది. అధునాతన ఆల్గోరిథమ్‌ల సాయంతో శ్వాస, ఏకాగ్రత, విశ్రాంతి వంటి వాటిని గుర్తించి మనం ఎంత బాగా ధ్యానం చేస్తున్నామో కూడా తెలియజేస్తుంది. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు లక్షణాలను నియంత్రించుకోవటానికి తోడ్పడుతుంది. ధ్యాన 2 రింగ్ అయితే రోజులో ఎప్పుడెప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో కూడా తెలియజేస్తుంది. ఆ వెంటనే యాప్ ద్వారా నోటిఫికేషన్లు పంపిస్తుంది. మన స్వయంచాలిత నాడీ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది. ఒత్తిడితో ఉన్నప్పుడు సింపాథెటిక్ నాడీ వ్యవస్థ.. విశ్రాంతిగా ఉన్నప్పుడు పారాసింపాథెటిక్ నాడీ వ్యవస్థ ప్రేరేపితమవుతాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందిలో సింపాథెటిక్ నాడీవ్యవస్థ నిరంతరం ప్రేరేపితమై ఉంటోంది అందుకే పడుకున్నప్పుడూ ఒత్తిడిలో ఉన్నట్టు భావిస్తుంటాం. పారాసింపథెటిక్ నాడీవ్యవస్థలో వేగస్ నాడి చాలా కీలకం. ధ్యాన రింగులోని టెక్నాలజీ ఈ నాడి పనితీరును పసిగడుతుంది. ఇది చురుకుగా ఉంటే బాగా విశ్రాంతిగా ఉన్నట్టు. మందగిస్తే ఒత్తిడితో బాధపడుతున్నట్టు.