prepaid and postpaid which Connection is faster : ఈ ఇంటర్నెట్ యుగంలో.. ప్రతీ ఇంట్లో కనీసం ఒకటైనా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇందులో.. మెజారిటీ సిమ్ కార్డ్స్ ప్రీపెయిడ్ అయ్యుంటాయి. మిగిలిన వాళ్లు పోస్ట్ పెయిడ్ వాడుతుంటారు. అయితే.. ఇందులో ప్రీపెయిడ్ సిమ్ కన్నా.. పోస్ట్ పెయిడ్ సిమ్‌లో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందనే చర్చ ఉంది. మరి.. ఇందులో నిజమెంత? అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రీపెయిడ్ కనెక్షన్ అంటే ?: ప్రీపెయిడ్.. అనే పేరులోనే విషయం ఉంది. ముందస్తుగా చెల్లింపులు చేయడం. అంటే.. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు రాబోయే రోజుల్లో మీకు అందించే సేవలకోసం.. ముందుగానే డబ్బు చెల్లించే సర్వీసును ప్రీపెయిడ్ అంటారు. ఇప్పుడు మెజారిటీ ప్రజలు వాడుతున్న సర్వీసు ఇదే. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు.. రకరకాల ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. నచ్చిన ప్యాక్ ఎంచుకొని.. డబ్బు చెల్లించి, వ్యాలిడిటీ ఉన్నంత వరకు సేవలు పొందొచ్చు.
పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ అంటే ?: ముందుగా సేవలు పొంది.. ఆ తర్వాత డబ్బు చెల్లించే విధానాన్నే పోస్ట్ పెయిడ్ అంటారు. డేటా, కాల్స్, మెసేజెస్ ఎంతైనా వినియోగించుకోవచ్చు. వాడుకున్న సేవలకు నెలాఖరులో బిల్లు చెల్లించాలి.
ఇంటర్నెట్ వేగంలో తేడాలున్నాయా? : ప్రీపెయిడ్ కన్నా.. పోస్ట్ పెయిడ్ సర్వీసులో ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుందనే చర్చ ఉంది. దీనికి ఉదాహరణలు కూడా చూపిస్తారు పలువురు వినియోగదారులు! మరి.. ఇందులో ఏది వాస్తవం అన్నది ఇప్పుడు చూద్దాం.
- థ్రోట్లింగ్: ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్లను ఓసారి చూస్తే.. అన్లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 1.5 GB లేదా 2 GB హై-స్పీడ్ డేటా అంటూ.. రకరకాల ప్లాన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఓ కస్టమర్ 2GB డేటా ప్లాన్ తీసుకున్నాడని అనుకుందాం. ఇందులో.. నెట్ పూర్తిగా వాడేస్తే ఏమవుతుంది? నెట్ స్పీడ్ డౌన్ అయిపోతుంది. బఫరింగ్ అవుతూ ఉంటుంది. దీనినే "థ్రోట్లింగ్" అంటారు. అంటే.. కోటా పూర్తయిన తర్వాత ఆటోమేటిగ్గా ఇంటర్ నెట్ వేగం పడిపోతుంది. ఇది పోస్ట్‌పెయిడ్ సర్వీసులో కూడా ఉంటుంది. కానీ.. ఈ సిమ్ కార్డులకు కంపెనీ ఇచ్చే హై-స్పీడ్ డేటా ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు పోస్ట్ పెయిడ్ ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
90 రోజుల వ్యాలిడిటీతో BSNL సూపర్ ప్లాన్.. వాయిస్ కాల్స్‌కు మాత్రమే ఛాన్స్!
- డిప్రియారిటైజేషన్: డిప్రియారిటైజేషన్ అంటే.. ప్రాధాన్యత తగ్గించడం. నెట్‌వర్క్ బిజీగా ఉన్నప్పుడు మీ సెల్యులార్ ప్రొవైడర్ మీ ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తారు. ఉదాహరణకు.. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోందని అనుకుందాం. అప్పుడు ఆన్‌లైన్‌కు కోట్లాది మంది ఒకేసారి కనెక్ట్ అయ్యారనుకోండి.. ఆ సమయంలో అనివార్యంగా ఇంటర్నెట్ వేగం తగ్గిస్తారు. మీరు హై కాస్ట్ ప్లాన్‌లో ఉంటే ఈ ప్రభావం పెద్దగా ఉండదు. తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్స్ వాడుతున్నట్టైతే ఈ రకమైన సమస్యను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది.
మొత్తంగా చూసుకున్నప్పుడు.. ప్రీపెయిడ్ కనెక్షన్ కంటే, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ వేగంగా ఉంటుందనుకోవడం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే.. దానికి థ్రోట్లింగ్, డిప్రియారిటైజేషన్ కారణాలు కావచ్చని అంటున్నారు. ఎక్కువ ధర కలిగిన ప్లాన్స్ తీసుకుంటే.. ఈ రెండు సమస్యలు కూడా ఉండవని చెబుతున్నారు.