పిల్లలు కాస్త పెద్దయ్యేకొద్దీ వాళ్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘ఎ,బి,సి,డి’... ‘వన్, టూ, త్రీ’... ‘ఏ ఫర్ ఆపిల్’... అంటూ ఎన్నో నేర్పించేందుకు ప్రయత్నిస్తాం. వాళ్ల చిన్ని బుర్రలకు అవన్నీ అర్థమయ్యేలా ఆ అక్షరాలూ, అంకెలున్న పుస్తకాలు పెద్ద పెద్ద సైజుల్లో, మందంగా అట్టల రూపంలో ఉన్నవి కొంటాం. కానీ కొన్ని రోజులకే వాటిని నామరూపాల్లేకుండా చేస్తారు పిల్లలు. ఈ పిల్లో కమ్ పుస్తకాలతో అలాంటి ఇబ్బందేమీ ఉండదు. పైగా కావాల్సినప్పుడల్లా చదువుకోవచ్చు, నిద్రొస్తే దానిపైనే తలపెట్టుకుని పడుకోవచ్చు. పిల్లో కమ్ పుస్తకమంటే... దిండుగలేబులో పుస్తకం పెట్టి ఇస్తారేమో... వాటిపైన తలపెడితే అవి చిరిగిపోవా... పైగా దిండ్లూ గట్టిగా ఉంటాయి కదా... అనే సందేహాలేవీ అక్కర్లేదు. చూడ్డానికి ఇది దిండులానే కనిపిస్తుంది కానీ దానికి ఉండే పట్టీలాంటిదాన్ని తెరిస్తే పుస్తకంలానే ఇందులోనూ పేజీలూ ఉంటాయి. ఒక్కోదాన్ని తిరగేస్తూ పోతే బోలెడు విషయాలను పిల్లలకు సులువుగా నేర్పించేయొచ్చు. పనైపోయాక మళ్లీ వీటి పట్టీలను పెట్టేస్తే దిండులా వాడుకోవచ్చు.
అక్షరాలే కాదు... కథలూ!
ఈ దిండ్లు సాదాగా లేదా రకరకాల కార్టూను బొమ్మల్లో వస్తాయి. వాటిల్లో పిల్లలకు కావాల్సిన అక్షరాలూ, అంకెలూ, రంగులూ, నెలల పేర్లూ, వాహనాలూ... ఇలా ఒకటేమిటి అన్నీ బొమ్మల రూపంలో పలు రంగుల్లో ఉంటాయి. కాస్త పెద్ద పిల్లలకయితే రైమ్స్‌తోపాటూ కథలూ ఉంటాయి. ఏడాది, ఏడాదిన్నర చిన్నారులకు ఒక్క దిండును కొంటే చాలు... బోలెడు విషయాలు నేర్పించొచ్చు. కావాల్సినప్పుడల్లా వీటిని సాధారణ దిండ్లలానే ఉతికేయొచ్చు కూడా. ఆలస్యం ఎందుకు.... ఇంట్లో పిల్లలుంటే ఇలాంటి ఒక దిండును కొనిపెట్టండి. చిన్నారులకు కానుకగా ఇచ్చేందుకూ బాగుంటాయివి.
ఇదీ చదవండి: గుల్లక్... ఇది బాలల ప్రత్యేక బ్యాంకు!