దేశాధ్యక్షుడి పదవీ కాలంపై పరిమితిని తొలగించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 78 శాతం రష్యన్లు ఓటు వేశారు. దీంతో వ్లాదిమిర్ పుతిన్ జీవితాంతం రష్యా అధ్యక్షుడిగా కొనసాగడానికి మార్గం సుగమమైంది. ఈ ఓటింగ్ ప్రక్రియ న్యాయంగా నిష్పాక్షికంగా జరగలేదనే విమర్శలు వచ్చినా, పుతిన్ హయాములో అలాంటివి కొత్తేమీ కాదు, ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరగకుండా అవి అడ్డుపడనూ లేదు. పుతిన్ ఇప్పటికి రెండు దశాబ్దాల నుంచి రష్యాను ఎదురులేకుండా ఏలుతున్నారు. 1999లో ప్రధానమంత్రిగా నియమితుడైన పుతిన్ ఆ సంవత్సరం చివరికల్లా తాత్కాలిక దేశాధ్యక్షుడయ్యారు. 2000 మార్చి ఎన్నికల్లో సునాయాసంగా అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. వేర్పాటువాద గ్రూపులపై విరుచుకుపడి, రష్యా ప్రాదేశిక సమగ్రతను కాపాడిన నాయకుడిగా ప్రజల మన్ననలు పొంది 2004లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అధికారంతో ఆటలు
ఏ నాయకుడూ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగరాదన్న రష్యా రాజ్యాంగ నిర్దేశాన్ని అధిగమించడానికి 2008 ఎన్నికల్లో పుతిన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టి, దిమిత్రీ మెద్వెదేవ్‌కు దేశాధ్యక్ష పదవి అప్పగించారు. కానీ, పాలనా పగ్గాలన్నీ పుతిన్ చేతిలోనే ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. ఈ విధంగా రాజ్యాంగ పరిమితిని అధిగమించిన తరవాత 2012 ఎన్నికల్లో ఆయన మళ్ళీ అధ్యక్ష పదవి చేపట్టి, ప్రధానిగా మెద్వెదేవ్‌ను నియమించారు. 2014లో ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టి, క్రైమియాను జనవాక్య సేకరణ సాకుతో రష్యాలో కలిపేసుకున్నారు. ఎదురులేని విజేతగా ప్రజల ముందుకెళ్లి 2018 ఎన్నికల్లో మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిచారు. ఈ ఏడాది జూన్ 25-జులై ఒకటి మధ్యకాలంలో జనవాక్య సేకరణ జరిపి, అధ్యక్షుడి పదవీకాలంపై పరిమితులను తొలగించేసుకున్నారు. అధికారంలో కొనసాగడానికి పుతిన్ బలప్రయోగానికి, ఒత్తిళ్లకు పాల్పడతారనే ఆరోపణలు ఉన్నా, ఆయన పట్ల ప్రజల్లో ఆదరణ ఉందనేది కాదనలేని సత్యం. ఆయన ప్రాచుర్యానికి చాలానే కారణాలు ఉన్నాయి. పుతిన్ ధనిక కుటుంబం నుంచి కాని, రాజకీయ కుటుంబం నుంచి కాని వచ్చినవారు కారు. ఆయన తండ్రి ఒక వంటవాడు, తల్లి ఓ ఫ్యాక్టరీ కార్మికురాలు. విద్యాభ్యాసం తరవాత ఆయన సోవియట్ గూఢచారి సంస్థ కేజీబీలో చేరారు. కమ్యూనిస్టు పాలన కుప్పకూలిన తరవాత రాజకీయాల్లో చేరి లెనిన్‌గ్రాడ్ నగర మేయరు వద్ద పనిచేశారు. అక్కడి నుంచి మాస్కో వచ్చి రష్యా గూఢచారి సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) డైరెక్టర్‌గా పనిచేశారు. ఆపైన దేశాధ్యక్ష పదవి చేపట్టారు. ఇలా సాధారణ కుటుంబంలో పుట్టి దేశాధినేతగా ఎదగడం రష్యన్ ప్రజలను ఆకట్టుకొంది. సోవియట్ పతనానంతరం అష్టకష్టాలు పడిన రష్యన్లు, ఆయనలో ఆశాకిరణాన్ని చూసుకున్నారు.
నయా చక్రవర్తి...
రష్యా 'నయా' చక్రవర్తి సోవియట్ యూనియన్ పతనానంతరం తమ దేశం అగ్రరాజ్య హోదాను పోగొట్టుకోవడం రష్యన్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇది చాలదన్నట్లు జార్జియా, చెచెన్యా వంటి రిపబ్లిక్కులు రష్యా నుంచి వేరుపడదామని చూడసాగాయి. ఈ వేర్పాటువాద శక్తులను పుతిన్ ఉక్కుపాదంతో అణచివేశారు. ఆయన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విదేశాల్లో నిరసనలు వినిపించినా, స్వదేశంలో మాత్రం ఆయన్ను హీరోగా ఆరాధించసాగారు. పుతిన్ రెండు దశాబ్దాలుగా రష్యాను ఏలుతున్నా దేశం ఆర్థికంగా గొప్ప ప్రగతి ఏమీ సాధించలేదు. అపారమైన సహజ వనరులు, పారిశ్రామిక పునాది ఉండి కూడా అభివృద్ధి పథంలో అద్భుతాలు చేయలేకపోవడం పుతిన్ నాయకత్వానికి చంద్రుడిలో మచ్చలా నిలిచింది. కేవలం చమురు అమ్మకాలే దేశానికి ప్రధాన ఆదాయ వనరు. సోవియట్ హయాములో స్థాపించిన పరిశ్రమలేవీ లాభసాటి కావు. రష్యా అటు కమ్యూనిస్ట్ దేశమూ కాదు, ఇటు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ కూడా కాదు. ఒక్క మాటలో ఆర్థిక త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది. ఏతావతా పుతిన్ రష్యాకు అందించిన రాజకీయ సుస్థిరత ఆర్థిక ప్రగతికి దారితీయలేకపోవడం పెద్ద లోటు.
సమయానుకూల నిర్ణయాలు
విదేశాంగ విధానానికి వస్తే పుతిన్ విజయాలు గణనీయమే. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్‌లలో రష్యన్లు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. సోవియట్ పతనానంతరం ఈ రిపబ్లిక్‌లు స్వతంత్ర దేశాలుగా వేరుపడటంతో, అక్కడి రష్యన్ ప్రజలు మైనారిటీలుగా మారారు. వీరి ప్రయోజనాలను కాపాడటానికి పుతిన్ అగ్ర ప్రాధాన్యమిచ్చారు. ఉక్రెయిన్, తదితర పూర్వ రిపబ్లిక్‌లపై ఆయన సైనిక చర్యకు ఇదే ప్రధాన కారణం. పశ్చిమాసియాలో, ఇతర ప్రాంతాల్లో ఒకప్పటి సోవియట్ ప్రాబల్యం క్షీణించి, అమెరికా పలుకుబడి హెచ్చుతోంది. పుతిన్ తమ పూర్వ ప్రాబల్యాన్ని సంరక్షించుకోవడానికి సిరియాలో గట్టిగా నిలబడ్డారు. చమురు తరవాత రష్యా ప్రధాన ఎగుమతులు ఆయుధాలే కాబట్టి, సిరియాను తమ రక్షణ పాటవ ప్రదర్శనకు వేదికగా ఉపయోగించుకున్నారు. అమెరికా నాయకత్వంలో పాశ్చాత్య కూటమి రష్యా పట్ల అమిత్ర వైఖరి అనుసరించడంతో పుతిన్ చైనావైపు మొగ్గు చూపకతప్పడం లేదు. రష్యా ఆర్థికంగా బలహీనమే కావచ్చు, అంతర్జాతీయ రాజకీయాల్లో దాని పాత్ర ఇప్పటికీ చెక్కుచెదరలేదు. పుతిన్ దూకుడుగా అనుసరించిన విదేశాంగ విధానం వల్ల రష్యా తన పలుకుబడిని కాపాడుకోగలిగింది. ఆసియాలో బలాబలాల సమతూకాన్ని కాపాడాలంటే రష్యా అండ భారతదేశానికి ఎంతో అవసరం. రష్యా ఆయుధ ఎగుమతుల్లో 60 శాతం భారత్ కే అందుతున్నాయి. పుతిన్ విధానాలు నిరంకుశమని పాశ్చాత్యులు ఆరోపిస్తున్నా, తన దేశ ప్రయోజనాలకు అవి ఆవశ్యకమని ఆయన భావిస్తున్నారు. అధ్యక్ష పదవీ కాల పరిమితులను పుతిన్ ఎత్తివేయించగలిగినా, రేపు రోజులు మారవచ్ఛు రాజకీయాల్లో ఒక్క వారం కాలమే సుదీర్ఘమైనదంటారు. అలాంటిది పుతిన్ ఏకంగా రెండు దశాబ్దాలు అధికారంలో ఉన్నారంటే ఆషామాషీ కాదు.
-సంజయ్ పులిపాక, రచయిత దిల్లీ నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీలో సీనియర్ ఫెలో
ఇదీ చూడండి:2023 మార్చి నుంచి ప్రైవేటు రైలు కూత