సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, వీధిబడిలో అక్షరాలు దిద్ది, విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమ బావుటాగా ఎగసి, రాష్ట్ర రాజకీయాల్లో నవతరం ప్రతినిధిగా మెరిసి, జాతీయ స్థాయిలో రాజనీతిజ్ఞుడిగా ఎదిగిన అసామాన్యుడు.. ముప్పవరపు వెంకయ్యనాయుడు. అయిదేళ్ల క్రితం ఆయన- డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి తరవాత నలభై ఏళ్లకు ఉన్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తెలుగు తేజమయ్యారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్య సభాధ్యక్షులుగా దీక్షాదక్షతలు కనబరచి నేడు అన్ని పక్షాల ప్రశంసలకు పాత్రులవుతున్నారు. ఎగువసభకు వెంకయ్యనాయుడు అందించిన అనుపమాన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం కొత్తగా 'ఛైర్మన్ ఎమెరిటస్' పదవిని సృష్టించాలన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ఇటీవలి అసాధారణ సూచన- పెద్దలసభపై మన మట్టిబిడ్డ వేసిన ప్రగాఢ ముద్రకు అద్దంపడుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లోగడ వ్యాఖ్యానించినట్లు.. వెంకయ్యనాయుడితో దిల్లీలో మన గౌరవం పెరిగింది. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ కాలం నేటితో ముగుస్తుండటంతో- 'ఒక మంచి మనిషి నిష్క్రమిస్తున్నారు' అన్న బాధాతప్త భావన పార్టీలకు అతీతంగా అందరిలో గూడు కట్టుకుంది. వెంకయ్యనాయుడు గౌరవార్థం మొన్న నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రధానితో పాటు పలువురు నేతలు చేసిన ఉద్వేగభరిత ప్రసంగాల్లో అది ప్రతిఫలించింది.
కేంద్ర మంత్రిగా నాడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా నిలిచిన వెంకయ్యనాయుడు- తన విస్తృత పరిచయాల ద్వారా విభజన హామీల అమలుకు ఆ తరవాతా శ్రమించారు. నిండైన అచ్చతెలుగు ఆహార్యంలో కనిపించే మెండైన మాతృభాషాభిమాని వెంకయ్యనాయుడు. అమ్మ భాషా వినియోగాన్ని ఆత్మగౌరవ ప్రతీకగా అభివర్ణించే ఆయన- రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించిన ఇరవై రెండు భాషల్లో సభ్యులు మాట్లాడగలిగేలా రాజ్యసభలో ఏర్పాట్లు చేశారు. స్థాయీసంఘాల పనితీరును సమీక్షించి సరికొత్త సంప్రదాయానికి ఒరవడి దిద్దారు. 'నా టైర్డ్... నా రిటైర్డ్'(అలిసిపోలేదు... ప్రజాసేవలోంచి పదవీ విరమణ చేయలేదు) అన్నది పూర్వ ప్రధాని వాజ్‌పేయీ ప్రసిద్ధ వ్యాఖ్య. అయిదు దశాబ్దాలుగా ఆసేతుహిమాచలం ఆబాలగోపాలంతో మమేకమవుతున్న వెంకయ్యనాయుడుకూ అది అక్షరాలా వర్తిస్తుంది!
మూడు పదుల వయసు నిండకుండానే వెంకయ్యనాయుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికై- శాసనసభలో అడుగుపెట్టారు. సమయం చిక్కినప్పుడల్లా అసెంబ్లీ గ్రంథాలయంలో కూర్చుని.. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, తరిమెల నాగిరెడ్డి వంటివారి ఉపన్యాసాలను అధ్యయనం చేసేవారు. ఎటువంటి విషయం మీదైనా సరే- క్షుణ్నంగా కసరత్తు చేసి మాట్లాడే అలవాటును అలవరచుకున్నారు. అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో సభ్యుడైనా- ఎక్కడైనా ఆయన ఎదుగుదలకు ఆ నిరంతర పరిశ్రమే ఆలంబన అయ్యింది. దాంతోనే ఆంగ్లం, హిందీల్లో పట్టు సాధించిన వెంకయ్యనాయుడు- రాజకీయ నిచ్చెనలోని అన్ని మెట్లను స్వయంకృషితోనే అధిరోహించారు.
వర్ధమాన నేతలను విరివిగా ప్రోత్సహించిన 'పెద్దన్న'గా ఆయనను అస్మదీయులు తలచుకుంటారు. పార్లమెంటరీ సంప్రదాయాలను విధిగా ఔదలదాల్చిన అజాతశత్రువుగా తస్మదీయులు సైతం ఆయనను అభిమానిస్తారు. తల్లి వంటి పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు వెంకయ్యనాయుడి గుండె తల్లడిల్లినా- రాజ్యసభాపతి కాగానే నిష్పాక్షికతకు పెద్దపీట వేశారు. ఎన్నికల్లో ధన ప్రాబల్యాన్ని కట్టడి చేయడం, చట్టసభల్లో క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజోపయోగ అంశాలపై నిశితంగా చర్చించడం తదితరాలపై ఆయన మేలిమి సూచనలు- అవశ్యం ఆచరణీయాలు. అధికార, విపక్షాల నడుమ రాజకీయ స్పర్ధ శత్రుత్వంగా పరిణమిస్తున్న సమకాలీన తరుణంలో- సభాపతిగా బాధ్యతల నిర్వహణ కచ్చితంగా కత్తిమీద సామే. అపార అనుభవం, కీలకాంశాలపై లోతైన అవగాహన, సమర్థత, వాగ్ధాటి, కలుపుగోలుతత్వాలతో ఆ కఠిన పరీక్షలో వెంకయ్యనాయుడు విజయం సాధించారు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడుతూ విలువల దడిని దాటని ఆయన వ్యక్తిత్వం- నాయకులకు స్ఫూర్తిపాఠం. నెల్లూరు నుంచి న్యూదిల్లీ వరకు వెంకయ్యనాయుడి ప్రస్థానం.. తెలుగు వారందరికీ గర్వకారణం!