సాధారణ ప్రజలకన్నా నిత్యం సిగరెట్లు, బీడీలు కాల్చే వారిలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రాణాలు హరించి వేస్తోందన్నది- వైద్యులు వెల్లడిస్తున్న చేదు వాస్తవం. పొగతాగేవారి ఊపిరితిత్తులు, గుండె ఇతర అవయవాలు బలహీనంగా ఉంటాయి. కరోనా వైరస్ దాడి ఊపిరితిత్తులపైనే ఎక్కువగా ఉంటున్నందువల్ల పొగతాగే వారికి ఇది సోకితే ప్రాణాల మీదకు వస్తోంది. కరోనా సంక్షోభానికి ముందే, పొగతాగడం వల్ల ఏటా 82 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. 'పక్కనున్నవారు సిగరెట్ తాగితే నాకేం అవుతుందిలే...' అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. పొగ తాగే వారితో పాటు, పరోక్షంగా పీల్చేవారు సైతం రోగాల బారిన పడి కన్నుమూస్తున్నారు. ఈ వ్యసనం వల్ల ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యుల్లో- నేరుగా సిగరెట్లు, బీడీలు కాల్చడం ద్వారా పొగ పీల్చేవారు 70 లక్షల మంది; మరో 12 లక్షల మంది పరోక్షంగా పొగ పీల్చేవారు కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా విపత్తులోనైనా పొగపీల్చడం మానేయకపోతే చేతులారా మృత్యువును ఆహ్వానించడమే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది నిత్యం పొగతాగుతున్నారు. వీరిలో 80 శాతం- స్వల్ప, మధ్య తరహా ఆదాయం ఉండే దేశాల్లోనే నివసిస్తున్నారు. పొగతాగే ప్రతి ఇద్దరిలో ఒకరు రోగాలపాలై ప్రాణం కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.
బలమైన పునాదులు
పొగాకు, దాని ఉత్పత్తులు ఏ రూపంలో తీసుకున్నా భయంకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతారు. అయినా పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిషేధించి తొలగించడం ప్రపంచానికి సాధ్యంకానంతగా దాని ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులపై గడచిన ఏడాది జరిగిన వ్యాపారం 94,982 కోట్ల డాలర్లు. 2028కల్లా ఇది లక్షా ఏడు వేల కోట్ల డాలర్లను దాటిపోనుందని తాజా అంచనా. భారతదేశంలో ఈ వ్యాపారం విలువ రూ.35 వేల కోట్లకు పైమాటే. ఇంత బలమైన ఆర్థిక పునాదులు ఉన్నందు వల్ల ఏ దేశమూ పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిషేధించలేకపోతోంది. సిగరెట్ తాగడం అనేక దేశాల్లో యువతకు వ్యసనంగా మారుతోంది. డ్రగ్స్ తీసుకోవడానికి కూడా సిగరెట్లనే అధికంగా వినియోగిస్తున్నారు. మొత్తం 55 దేశాల్లోని మరణాలకు కారణాలను పరిశీలిస్తే ప్రతి అయిదుగురు పురుషుల మరణాల్లో ఒకటి పొగతాగడం వల్లే సంభవిస్తున్నట్లు తేలింది. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలుగా పేరొందిన ఐరోపాలోని 33, పశ్చిమ దేశాల్లో మరో 11 ఇందులో ఉన్నాయి. పొగాకు ఉత్పత్తులపై వ్యాపారం చేసే కంపెనీలు లాభాలు గడిస్తుంటే ఈ పంట పండించే చిన్న కమతాల రైతులకు నికరంగా నష్టాలే మిగులుతున్నాయి. ధర తగ్గినా, పెరిగినా ఎంతో కొంతకు కొంటారనే కచ్చితమైన మార్కెట్ భరోసా ఉండటం, రుణ లభ్యత బాగా ఉండటం వంటి కారణాలతో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. 15వ శతాబ్దంలో కొలంబస్ పొగాకు సాగును ఐరోపాకు తెచ్చాక- కొన్నేళ్లకే ప్రపంచమంతా విస్తరించింది. ప్రపంచ వాణిజ్య పంటల్లో పొగాకుది మూడో స్థానం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 కోట్ల కిలోల పొగాకును రైతులు పండిస్తుంటే అందులో అయిదో వంతు అంటే 20.20 కోట్ల కిలోల పొగాకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రైతులదే.
ఆరోగ్యాన్నిచ్చే పంటలే మేలు
పొగాకు సాగును వదిలేసి- ఆరోగ్యాన్ని, ఆదాయాన్నిచ్చే తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి పంటలు పండించడానికి రైతులకు ఎన్నో అవకాశాలున్నాయి. ఏటా వంటనూనెలను దిగుమతి చేసుకోవడానికి విదేశాలకు రూ.70 వేల కోట్లను మనదేశం చెల్లిస్తోంది. అందులో 10 శాతం సొమ్ము కూడా పొగాకు ఎగుమతులపై రావడం లేదు. పొగాకును అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. 2019-20లో పొగాకు ఎగుమతుల ద్వారా రూ.5,969.59 కోట్ల ఆదాయం వచ్చింది. కొవిడ్‌తో ప్రస్తుతం ఏపీలో పొగాకు పంట కొనుగోలు ఆపేశారు. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పొగాకు కొనుగోలుకు కంపెనీలు వేలం ప్రారంభిస్తాయి. వేలం పాట మొదలైనప్పుడు ధరలు బాగా తగ్గించి చివరిలో జూన్ నాటికి ధర పెంచే వ్యూహాలతో కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఈ పంటకు ఎంత మద్దతు ధర ఇవ్వాలనేది ముందుగా కేంద్రం ప్రకటించడం లేదు. పెట్టుబడి ఖర్చులను లెక్కించి మద్దతు ధరను కేంద్రం ప్రకటిస్తే కంపెనీలు ధర తగ్గించి రైతులను మోసగించే అవకాశం ఉండదు. కిలో పొగాకు ధర ప్రస్తుతం రూ.110 నుంచి రూ.170 వరకు ఉంది. గతేడాది రూ.180కి వెళ్లింది. ఎకరానికి ఎనిమిది నుంచి 1,200 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రైతులు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టాల్సి వస్తోంది. పొగాకు సాగులోని పలు సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రైవేటు కంపెనీలు పొగాకు పంటకు ధరలు నిర్ణయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 65 వేల మంది శిశువులు పొగ పీల్చి, పలు వ్యాధులతో చనిపోతున్నారని అంచనా. గర్భిణులు పొగ పీలిస్తే వారి కడుపులో ఉండే శిశువు ఎదుగుదలపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. పొగాకును పూర్తిగా నియంత్రించాలని డబ్ల్యూహెచ్‌ఓ చేసిన తీర్మానాన్ని 182 దేశాల్లో అమలు చేస్తున్నారు. 2030 నాటికి ప్రపంచం సాధించాల్సిన 'సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల'లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలో ఏ మూల నివసించే ప్రజలైనా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలని, భవిష్యత్ తరాలను రక్షించాలని కోరుకుంటారు. ఈ ఉద్దేశాలు నెరవేరాలంటే- ప్రపంచం నుంచి పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలించడం ఒక్కటే మార్గం.
- మంగమూరి శ్రీనివాస్
ఇదీ చూడండి: బాలలపై కేంద్రానికి ఎంత దయో!