దేశ అభివృద్ధిని నిర్ణయించే ప్రధాన కొలమానం ప్రజల ఆరోగ్యమే. కొవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న సంక్షోభంలో ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని చివురుటాకుల్లా వణుకుతున్న తరుణంలో- ప్రజారోగ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వైరస్ రెండోదశలో భారత్ విలవిలలాడుతున్న వేళ... ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉండటం ఎంత అవసరమో స్పష్టమవుతోంది. చక్కటి ఆరోగ్య వ్యవస్థలు ఉన్న దేశాలు మూడు విధాలైన సార్వత్రిక ప్రజారోగ్య విధానాలను అమలు చేస్తున్నాయి. యూకే, ఆస్ట్రేలియావంటి దేశాల్లో ఈ సంరక్షణ భారమంతటినీ ప్రభుత్వాలే భుజాన వేసుకున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాలు ప్రైవేటు బీమా సంస్థల మీద ఆధారపడుతున్నాయి. ఇక యూఎస్ వంటి దేశాలు మిశ్రమ ధోరణిని అవలంబిస్తున్నాయి.
కొరవడిన ముందుచూపు
స్వాతంత్య్రానంతర కాలంలో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మూడు జాతీయ విధాన పత్రాలు వెలుగు చూశాయి. 1983, 2002, 2017లో వీటిని ప్రకటించారు. ఈ విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగంలో ఎన్నో వైద్య విద్యాసంస్థలు ప్రాణం పోసుకున్నాయి. దేశంలోనే అత్యున్నత సంస్థలుగా పరిగణిస్తున్న ఎయిమ్స్, పీజీఐఎంఈఆర్, నిమ్‌హాన్స్ అలా ఉనికిలోకి వచ్చినవే. వైద్య సంస్థల నిర్మాతలుగా ఉంటూవచ్చిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 1980 అనంతర కాలంలో ఈ క్రియాశీల ప్రాథమిక బాధ్యతకు తిలోదకాలు ఇచ్చాయి. లాభార్జన ధ్యేయంగా నడిచే ప్రైవేటు సంస్థలకు ఆ బాధ్యతను ధారాదత్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని మార్కెట్ శక్తుల చేతిలో పెట్టాయి. భారతదేశం 2025 నాటికి అయిదో, 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రిసెర్చ్ (సీఈబీఆర్) అంచనా వేసింది. అయినా ఆరోగ్య విధానాలకు సంబంధించి ప్రభుత్వాల మాటలకు చేతలకు పొంతన కరవైంది. అందరికీ ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, వైద్యంలో నాణ్యతకు పెద్దపీట వేయడం 2017 జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యాలు. జీడీపీలో 1.15శాతంగా ఉన్న ఆరోగ్య వ్యయాన్ని క్రమంగా 2025 నాటికి 2.5శాతానికి పెంచి ఈ లక్ష్యాలు సాధించాలని కేంద్రం దిశానిర్దేశం చేసింది. గతంలో యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం (నేషనల్ హెల్త్ మిషన్) అమలు కోసం ఆరేళ్ల కాలం (2005-11)లో నిధుల కేటాయింపును జీడీపీలో మూడు శాతానికి పెంచుతామని ప్రకటించింది. అయితే ఈ వాగ్దానం నిలబెట్టుకోలేకపోయింది. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్(2014)లో ఆరోగ్య సంరక్షణ వ్యయంలో అమాంతం 20శాతం కోత విధించింది. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఎలా విఫలమైందీ ఈ నేపథ్యం తేటతెల్లం చేస్తోంది. పేద రోగుల పట్ల తమ చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడంలో అధునాతన ప్రైవేటు ఆసుపత్రులు సంవత్సరాలుగా విఫలమవుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
సదుపాయాల లేమి
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు జనాభాలో ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్థాయీసంఘం నివేదిక (2018) ప్రకారం, భారత్‌లో ఈ నిష్పత్తి 1:1655 గా ఉంది. సంఖ్యపరంగా చూస్తే, ఈ శాఖ లెక్కల ప్రకారం దేశంలో 9.26 లక్షల మంది అల్లోపతి వైద్యులు, 7.88 లక్షల మంది సంప్రదాయ వైద్యులు (ఆయుర్వేద, యునానీ, హోమియోపతి) సేవలు అందిస్తున్నారు. మహమ్మారి ప్రబలిన తరుణంలో వైద్య వృత్తి నిపుణుల అవసరం మరింతగా పెరిగింది. వైద్య కళాశాలలు నెలకొల్పదలచిన ప్రైవేటు సంస్థలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను అప్పగించాలని 2020 జనవరిలో నీతి ఆయోగ్ ఒక ప్రణాళికను ప్రకటించింది. ఈ తరహా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద ఇలా అప్పగించే ఆసుపత్రుల్లో 50 శాతం 'మార్కెట్ బెడ్స్'గా రూపాంతరం చెందుతాయి.
భారత్‌లో 555 వైద్య కళాశాలల ద్వారా ఏటా 83,000 మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు. సగం కళాశాలలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. ప్రపంచంలోని 100 అగ్రశ్రేణి వైద్యకళాశాలల్లో వీటిలో ఒక్కటి కూడా స్థానం సంపాదించలేకపోయింది. ఒకప్పటి నియంత్రణ సంస్థ భారత వైద్య మండలి (ఎంసీఐ) ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఈ సంస్థ అవినీతి కూపంగా మారిందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్వయంగా ప్రకటించారు. దీని స్థానంలో ఏర్పడిన జాతీయ వైద్య కమిషన్‌పై వైద్యవిద్యా వ్యవస్థను చక్కదిద్దే బాధ్యత పెట్టారు. నిష్పాక్షికతతో అందరికీ అందుబాటులో జవాబుదారీతనంతో పనిచేసే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నెలకొనాలంటే... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య, బలమైన ఉమ్మడి రాజకీయ సంకల్పం ఉండితీరాలి. తద్వారా దేశంలోని మధ్య, దిగువ తరగతి వర్గాల ప్రజలను వ్యాధులనుంచి, పేదరికం నుంచి కాపాడటం సాధ్యమవుతుంది.
వైద్యసేవల్లో వెనకబడిన ఇండియా
భారత్‌లో ఆరోగ్య సంరక్షణ మీద ప్రభుత్వ వ్యయం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో కేవలం 1.3శాతమే. గ్రామాల్లో 14.1శాతం, పట్టణాల్లో 19.1శాతం ప్రజలకు మాత్రమే ఏదో ఒక ఆరోగ్య బీమా సదుపాయం ఉందని జాతీయ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తేల్చింది. 2018 లెక్కల ప్రకారం ప్రజలు తమ వైద్యం ఖర్చులో 62.67 శాతాన్ని సొంతంగానే భరిస్తున్నారు. ఓఓపీఈ(అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెండిచర్)గా పేర్కొనే ఈ వ్యయం జపాన్‌లో 12.75శాతం, న్యూజిలాండ్‌లో 12.91శాతం, ఆస్ట్రేలియాలో 17.72శాతం. అమెరికాలో ఇది ఇంకా తక్కువగా 10.81శాతం! చైనాలో ఇది 35.75 శాతమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో భారత్ పొరుగు దేశాలూ మెరుగ్గానే ఉండటం విశేషం. భూటాన్‌లో ఓఓపీఈ 13.16 శాతం; నేపాల్‌లో 50.80, పాకిస్థాన్‌లో 56.24, శ్రీలంకలో 50.65శాతం చొప్పున ఉంది. రోగంవస్తే చేతి చమురు అత్యధికంగా వదుల్చుకుంటున్నది భారతీయులే. భారత్‌లో వైద్యసంరక్షణ ఎంతో దారుణంగా ఉందని ఎన్నో సర్వేలు, అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. బ్లూమ్‌బర్గ్ (లండన్) రూపొందించిన ప్రపంచ ఆరోగ్య సూచీ-2019 ప్రకారం... కొన్ని ఆగ్నేయాసియా దేశాలూ మనకంటే మెరుగ్గా ఉన్నాయి. 169 దేశాల్లో భారత్ 120వ స్థానంలో ఉండగా, శ్రీలంక 66, బంగ్లాదేశ్ 91, నేపాల్ 110 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాధుల భారం (గ్లోబల్ డిసీజ్ బర్డెన్) అధ్యయనం పేర్కొన్న అంశాలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో నవజాత శిశువులు బతికి బట్ట కట్టే అవకాశాలు అఫ్గానిస్థాన్, సోమాలియావంటి దేశాల కంటే తక్కువ. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్రాల నడుమ తీవ్ర అసమానతలు నెలకొన్నాయి. కేరళ, తమిళనాడు, పంజాబ్ దేశీయ ఆరోగ్య సూచీలో అగ్రస్థానం సంపాదించగా- యూపీ, రాజస్థాన్, బిహార్ అట్టడుగున కునారిల్లుతున్నాయి.
- డాక్టర్ ఎన్.వి.ఆర్. జ్యోతి కుమార్ (మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాఖాధిపతి)
ఇదీ చూడండి: కరోనా ఆంక్షలు.. ఏ రాష్ట్రాల్లో ఎలా?