ETV Bharat / opinion

ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణే ఔషధమా? - బడ్జెట్‌ 2021-22

రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా 1.75 లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని బడ్జెట్లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఐడీబీఐ బ్యాంకు, బీపీసీఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, ఎయిరిండియా వంటి సీపీఎస్‌ఈల విక్రయ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరించడానికి మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల సంఘం అనుమతి ఇచ్చిందన్న అధికారిక ట్వీట్‌ ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున నిరసనలకు దారితీస్తోంది.

privatisation of government companies rolling out  in 2021-22 economic year
ఉపసంహరణే ఔషధమా?- చికిత్సపై విచికిత్స
author img

By

Published : Feb 12, 2021, 7:41 AM IST

కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన అనే సూత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వసిస్తారు. ప్రభుత్వం పరిపాలన మీదే దృష్టి పెట్టాలి తప్ప వ్యాపారాలు, పరిశ్రమలు నడపకూడదని ఆ సూత్రం సారం. తదనుగుణంగా ఈ ఏడాది బడ్జెట్‌- ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణను పెద్దయెత్తున ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా 1.75 లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఐడీబీఐ బ్యాంకు, బీపీసీఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, ఎయిరిండియా వంటి సీపీఎస్‌ఈల విక్రయ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్‌ బీమా సంస్థ (జీఐసీ)లను ఏడాదిలోగా ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఐపీఓను విడుదల చేయడం ద్వారా ఆ సంస్థ ప్రైవేటీకరణకు తొలి అడుగు వేయాలనీ నిశ్చయించింది. ఇంకా ఏయే సంస్థల నుంచి ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించవచ్చనే జాబితాను నీతి ఆయోగ్‌ తయారు చేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరించడానికి మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల సంఘం అనుమతి ఇచ్చిందన్న అధికారిక ట్వీట్‌ ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున నిరసనలకు దారితీస్తోంది.

దూకుడు మంత్రం

కేంద్ర ప్రభుత్వం వివిధ సీపీఎస్‌ఈలలో తన వాటాల విక్రయానికి ఇంత దూకుడుగా వెళ్ళడం మంచిదేనా అనే చర్చ మొదలైంది. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తరవాత ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లేదా ప్రభుత్వ వాటాల విక్రయం ఊపందుకొంది. పీవీ ప్రభుత్వం దివాలా అంచుకు చేరిన భారత సర్కారును బయట పడేయటానికి ఈ ప్రక్రియను ప్రారంభించినా- అదంతా ద్రవ్య లోటును తగ్గించి, అదనపు మూలధనాన్ని సమీకరించడానికేనని చెప్పుకొచ్చింది. కొన్ని సీపీఎస్‌ఈలలో పరిమిత సంఖ్యలో వాటాలు విక్రయించి 10,000 కోట్ల రూపాయలను సేకరించగలిగింది. భారీయెత్తున ప్రభుత్వ వాటాలను విక్రయించడమనేది వాజ్‌పేయీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాము (1999-2004) లోనే జరిగింది. దీని కోసమే వాజ్‌పేయీ సర్కారు ప్రత్యేక మంత్రిత్వ శాఖను, మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ తొలి విడత సర్కారు (2014-19) ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించి రూ.2.79 లక్షల కోట్లు సమీకరించింది. అదే యూపీయే సర్కారు తన పదేళ్ల పాలనా కాలంలో (2004-14) సమీకరించిన మొత్తం రూ.1.07 లక్షల కోట్లు మాత్రమే. 1991 నాటి ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి పీఎస్‌ఈ ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా సేకరించిన మొత్తంలో 65 శాతం మోదీ తొలివిడత పాలన (2014-19)లోనే వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను భారీయెత్తున విక్రయించడానికి భాజపా నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనం. తదనుగుణంగా 2020-21లో ఏకంగా రూ.2.1 లక్షల కోట్లను సేకరించాలని లక్షించినా, కొవిడ్‌ వల్ల కేవలం రూ.19,000 కోట్లు మాత్రమే సేకరించగలిగారు. ఏతావతా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఈ పద్ధతిలో సేకరించిన మొత్తాలకు రెట్టింపుగా ఎన్డీయే ప్రభుత్వాలు 2018 నవంబరు నాటికే సమీకరించగలిగాయి.

సర్కారీ వాటాలను విక్రయించడం వెనక కారణాలేమిటి? బడ్జెట్‌ లోటును, కొండలా పెరిగిపోయిన నష్టాలను అధిగమించడానికి సర్కారీ వాటాల విక్రయం ద్వారా నిధులు సేకరించడం ఒక ముఖ్యమైన కారణం. రాజకీయ అనివార్యతలు, పీఎస్‌ఈల సామర్థ్యం పెంపు, వాటికి ఆర్థిక స్వయం నిర్ణయాధికారం, పారదర్శకత వంటివి ఇతర కారణాలుగా చెబుతారు. మరి, ఆర్థిక సంస్కరణల వల్ల ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌ఈ) పనితీరు ఏమైనా మెరుగుపడిందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. కేవలం ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారానే పీఎస్‌ఈల పనితీరు మెరుగుపడదని పలు అధ్యయనాలు నిరూపించాయి. సంస్థ ఏర్పాటై ఎంతకాలమైంది, దాని పరిమాణం ఎంత, లాభదాయకత ఎంత? దేశ ఆర్థిక వ్యవస్థలో ఇతర సంస్కరణలు- వంటి అనేక అంశాలు సంస్థల పనితీరును ప్రభావితం చేస్తాయి. 1999-2004 మధ్య వాజ్‌పేయీ హయాములో 11 సీపీఎస్‌ఈలలో ప్రభుత్వ వాటాలు విక్రయించారు. ఆ విక్రయానికి ముందు, తరవాత సీపీఎస్‌ఈల పనితీరులో తేడాలను మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోంది. ప్రైవేటీకరణ తరవాత ఒక సీపీఎస్‌ఈ తన రంగంలోని సాటి సంస్థలకన్నా మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరిస్తోంది.

తొందరపాటు వద్దు!

రైల్వేలు, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు కర్మాగారాల ప్రైవేటీకరణ ప్రతిపాదనపై ప్రస్తుతం దేశంలో లోతుగా చర్చ జరుగుతోంది. విశాఖ ఉక్కుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాల నివృత్తికి ప్రభుత్వం వెంటనే ఉపక్రమించాలి. సీపీఎస్‌ఈలను వర్గీకరించాకనే ప్రైవేటీకరణపై ముందుకెళ్లాలి. నష్టాల నుంచి ఎన్నటికీ బయటపడలేని ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. రాజకీయ దృఢ సంకల్పం, సమర్థ నిర్వహణ ద్వారా రెండో తరగతిలో ఉన్న రైల్వేలు, విశాఖ ఉక్కు వంటి సంస్థలను లాభదాయకంగా నడపవచ్చు. ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయానికి తొందరపడకూడదు. మూడో తరగతిలోకి వచ్చే బ్యాంకింగ్‌, బీమా సంస్థలు దేశానికి ఆర్థికంగా మూలస్తంభాల వంటివి. ఎల్‌ఐసీ, జీఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులను విక్రయించే ఆలోచన మానుకుని, ఎంత ఖర్చయినా సరే వాటిని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై పకడ్బందీ కార్యాచరణతో సాగాలి. సామర్థ్యం, పోటీ, నవీకరణ, ఖర్చుకు మించిన లాభం, మంచి ధర రాబట్టడం వంటి పద్ధతుల్లో పీఎస్‌ఈలను మేటి వ్యాపార సంస్థలుగా తీర్చిదిద్దాలి. కేవలం ద్రవ్యలోటును అధిగమించడానికే ప్రభుత్వ వాటాలు విక్రయించే ధోరణిని విడనాడాలి. ప్రజలు, మేధావులు, సంబంధిత వర్గాలతో లోతుగా చర్చలు జరిపి సర్వామోదనీయ పరిష్కారాల్ని గుర్తించాలి.

అభివృద్ధికి వెచ్చించాలి

ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడం ద్వారా లభించే సొమ్మును మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారు. సెస్సుల ద్వారా ఆర్జించిన సొమ్మునూ ఇలాగే వెచ్చిస్తామని చెప్పిన కేంద్రం తన మాటను నిలబెట్టుకోలేదని ‘కాగ్‌’ నివేదిక తెలిపింది. సెస్సు వసూళ్లలో 40 శాతాన్ని నిర్దేశిత నిధులకు బదిలీ చేయలేదు. 2018-19లో 35 సెస్సులు, లెవీల ద్వారా వసూలు చేసిన రూ.2.74 లక్షల కోట్లలో లక్ష కోట్ల రూపాయలు ఇప్పటికీ భారత సంఘటిత నిధిలో మూలుగుతున్నాయి. వీటిని విద్య, రహదారులు, పర్యావరణ రక్షణ వంటివాటికి వెచ్చిస్తే ఎంతో ప్రయోజనకరం.

--- డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌.జ్యోతి కుమార్‌

(మిజోరం కేంద్ర విశ్వవిద్యాలయంలో వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.