మాతృభాషాభిమానం అన్నది చెట్లకు కాయదు. అంగట్లో డబ్బుపెట్టి కొనుక్కుంటే దొరికే వస్తువూ కాదు. అది నరనరానా రక్తమై ప్రవహించాల్సిన అభిమానం. ప్రతికణంలోంచి ఉప్పొంగి రావాల్సిన అనురాగం. అమ్మతత్త్వంలోని అమృతత్వం అమ్మభాషద్వారానే అర్థమవుతుంది. ఆ అమ్మభాషను దూరం చేసుకోవడం అంటే తల్లి ఆవు పొదుగునుంచి లేగదూడను వేరు చేస్తున్నట్లే. అటువంటి అమ్మభాషను దూరం చేసుకోవడం కన్నా దౌర్భాగ్యం లేదు. అమ్మభాషలో కమ్మగా మాట్లాడుతూ కలోగంజో తాగేవాడే అసలైన శ్రీమంతుడు.
అమ్మభాషతోనే వికాసం
తెలియని విషయాన్ని తెలిసినభాషలో నేర్చుకోవడం శాస్త్రీయం. అది సొంత ఇంట్లో ఉన్నంత సుఖాన్ని ఇస్తుంది. అదే పరభాషలో జరిగితే అంతకుమించిన కష్టం వేరే ఉండదు. జాతి మొత్తం విద్యారంగంలో వెనకబాటుతనానికి గురవుతుంది. ఇంటిభాష, బడిభాష వేరుగా ఉంటే- దానివల్ల సామాజిక అంతరాలు పెరిగే ప్రమాదం ఉంది. ప్రతివ్యక్తికీ బతికే హక్కు ఎలా ఉందో, అమ్మభాషలో చదివే హక్కూ అలాగే ఉంది. విద్యావిధానంలో మాతృ భాష అమలులో ఉంటేనే స్వీయసంస్కృతి పరిరక్షణ, వికాసం సాధ్యమవుతాయి. అది లేనప్పుడు భాష నిరాదరణకు గురవుతుంది.
భారతదేశం బహుభాషల సంక్లిష్టదేశం. అందుకే భాషా సమస్యలకు ఇది కేంద్రమయింది. నిజానికి ఈ సమస్యలకు పరిష్కారాలూ ఉన్నాయి. వాటిని సూచించే మేధావివర్గమూ ఉంది. ఆయా సూచనలు లేదా సిఫార్సులను ప్రభుత్వాలు స్వీకరించి, అమలు చేయాల్సి ఉంది. తెలుగు భాషాభివృద్ధికోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. భాషను రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా చూడాలి. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రవంటి రాష్ట్రాల్లోని నాయకులు మనకు ఆదర్శం కావాలి. ఇటీవల కేంద్రప్రభుత్వం విద్యావిధానాన్ని ప్రకటించిన తరవాత తమిళనాడులో నిరసనలు భగ్గుమన్నాయి. అధికార ప్రతిపక్షనేతలు ముక్తకంఠంతో కొత్త విద్యావిధానాన్ని వ్యతిరేకించడాన్ని మనం గమనించాలి. అందులో త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించడంవల్ల తమిళం అస్తిత్వానికి గండిపడే ప్రమాదం ఉందని వారు ఆందోళన చేస్తున్నారు. దీనికి ప్రజల మద్దతు పూర్తిగా ఉంది. మాతృభాషాభిమానం అంటే అది.
అధికార భాషాసంఘాలు, సాంస్కృతిక శాఖలు ఎప్పుడూ అధికార లాంఛనాలు కాకూడదు. రాజకీయ నిరుద్యోగులకు పదవీభద్రతను కల్పించే ఆవాసకేంద్రాలు అంతకన్నా కాకూడదు. నాయకులు మాతృభాషాభిమానం చూపిస్తే ప్రజలూ చూపిస్తారు. కేంద్రప్రభుత్వం నియమించిన కొఠారీ కమిషన్ సిఫార్సుల మేరకు త్రిభాషా సూత్రం వచ్చింది. దీని ప్రకారం: హిందీయేతర రాష్ట్రాల్లో మాతృభాష లేదా ప్రాంతీయ భాష, జాతీయ అధికార భాష అయిన హిందీ, అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లం నేర్చుకోవాలి. హిందీ మాతృభాషగా గల రాష్ట్రాల్లో- మాతృభాష లేదా ప్రాంతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఆంగ్లం, ఒక భారతీయ భాష (దక్షిణ భారత భాషకు ప్రాధాన్యం) నేర్చుకోవాలి. 1964 లో కొఠారీ కమిషన్ ప్రతి విద్యార్థీ ప్రాంతీయ భాషతోపాటు విధిగా హిందీ, ఆంగ్ల భాషలను అభ్యసించాలని ప్రతిపాదించింది. 1978లో ఎన్సీఈఆర్‌టీ రూపొందించిన 10+2+3 విద్యాప్రణాళిక, 1986 జాతీయ విద్యావిధానం సైతం త్రిభాషా సూత్రాన్ని బలపరచాయి. ఉన్నత విద్య సైతం ప్రాంతీయ భాషల్లోనే జరగాలని 1948లో డాక్టర్ రాధాకృష్ణన్ కమిషన్ అభిప్రాయపడింది. దీనికి మద్దతుగా కశ్మీర్, నాగాలాండ్‌లలో ఆంగ్లభాషా మాధ్యమం విఫలమైందని విద్యావేత్త ఎం.వి.రాజగోపాల్ పేర్కొన్నారు. చాలా కాలంగా తెలుగునాట అమ్మభాషకు అంధకారమే. బోధనలోగానీ పాలనలోగానీ ఆశించినంతగా తెలుగు వ్యవహారంలో లేదు.
కార్యాచరణ అవసరం
మాతృభాషా నైపుణ్యం ఉంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం విద్యార్థికి భారం కాదు. అన్ని దశలలోనూ మాతృభాషే మాధ్యమంగా ఉండాలి. మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఒకటే అయితే ఆ భాషే ప్రాథమికవిద్య పూర్తి అయ్యేవరకు మాధ్యమంగా ఉండాలి. ఆంగ్లం బాగా రావడం, ఉద్యోగభద్రత అనేవి వేరే సమస్యలు. వాటికి, మాధ్యమానికి సంబంధం లేదు. పాలకులు చేయాల్సింది- మాధ్యమం గురించి చర్చించడం అందుకోసం పోరాడటం కాదు. మన విలువైన సమయం పోరాటాలకే సరిపోతే వికాసానికి, అభివృద్ధికి కృషి చేసేదెప్పుడు? దేశం లోపలా బయటా ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రాంతీయభాషలకు ప్రాచుర్యం కల్పించాలి. తగిన భాషావిధానాన్ని రూపొందించుకోవాలి. పొరుగుదేశాలైన చైనా, రష్యా, జపాన్, ప్రాన్స్ ఆ బాటలో దూసుకుపోతున్నాయి. అవి ఆంగ్లానికి ఆమడ దూరంలో ఉంటూనే అంతులేని అభివృద్ధిని సాధిస్తున్నాయి! మాతృభాషపై అభిమానం సదస్సులు, సమావేశాలవల్ల సాధ్యం కాదు. సమష్టిశక్తిగా తెలుగు వారంతా సంఘటితం కావాలి. కవులు, కళాకారులు నడుం బిగించాలి. ప్రజల్లో మాతృభాషాభిమానం వెల్లివిరిసేలా చెయ్యాలి. అప్పుడు ఇంటికి దీపం తెలుగే అవుతుంది!
రచయిత- డాక్టర్ అద్దంకి శ్రీనివాస్
ఇదీ చూడండి: అభాండాలకు బాధితులు న్యాయమూర్తులు