దేశీయ కిరాణా విపణిలో వాటా పెంచుకోవడానికి ఇ-కామర్స్ సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వస్తువుల తయారీదారులను, కిరాణా దుకాణాలను అనుసంధానం చేసే బి2బి (బిజినెస్ టు బిజినెస్) సంస్థలు ఇ-కామర్స్ పరిధిలోకి వస్తాయి. ఈ విభాగంలోకి తుది వినియోగదారులు రారు. సంప్రదాయ పద్ధతిలో కిరాణా వ్యాపారులకు అవసరమైన సరకులను తయారీదారుల నుంచి సేకరించి సరఫరా చేయడానికి దళారి వ్యవస్థ ఉంటుంది. ఒక్కో కిరాణా వ్యాపారికి అయిదు నుంచి 15మంది వరకు ఏజెంట్లు సరకులు సరఫరా చేస్తారు. ఈ దళారులు 15శాతం వరకు కమిషన్ తీసుకుంటారు. కొనుగోలుదారుకు నిర్దేశించే ధరలో ఇది సుమారు అయిదు శాతం. 90 శాతం చిల్లర సరకుల వ్యాపారం ఈ పద్ధతిలోనే జరుగుతోంది. మిగిలిన పది శాతం విపణిలో ఇ-కామర్స్ సంస్థలు వ్యాపారం చేస్తున్నాయి.
అవకాశాలు అపారం
కిరాణా యజమానులతో సహా దేశంలోని అసంఖ్యాక చిన్న వ్యాపార సంస్థలకు టోకుగా సరకులు విక్రయించే సరఫరా గొలుసు వ్యవస్థలో ఇ-కామర్స్ సంస్థల ముందు ఇప్పుడు అపారమైన అవకాశాలున్నాయి. జియో మార్ట్స్ పేరిట కిరాణా వ్యాపారంలో 2019 డిసెంబరులో రంగప్రవేశం చేసిన రిలయన్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 200 నగరాల్లో 45,000 బి2బి సరకు నిల్వ కేంద్రాలు (స్టాక్ కీపింగ్ యూనిట్లు-ఎస్‌కేయూలు) నెలకొల్పింది. దళారులతో నిమిత్తం లేకుండా నేరుగా తమ ఎస్‌కేయూల ద్వారా చిన్నచిన్న కిరాణా దుకాణాలు సరకులు సమకూర్చుకోవచ్చని రిలయన్స్ చెబుతోంది. బి2సీ (బిజినెస్ టు కన్సూమర్) చిల్లర వ్యాపారంలోనూ నిమగ్నమై ఉన్న జియోమార్ట్ 6,700 నగరాల్లో 10,000 దుకాణాలు నిర్వహిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థ 2013 జూన్‌లో భారత వ్యాపార విపణిలో పాదం మోపింది. ఆ సంస్థ ఆన్‌లైన్ వ్యాపార వేదిక ద్వారా మూడు లక్షల మందికి పైగా విక్రేతలు దేశంలోని దాదాపు 99.8 శాతం ప్రాంతాలకు తమ వస్తువులను విక్రయించగలుగుతున్నారు.
లాక్‌డౌన్ కంటే ముందు ఏడు శాతం ఉన్న ఇ-కామర్స్ చిల్లర వర్తకం, లాక్‌డౌన్ అనంతరం 24 శాతానికి ఎగబాకింది. బి2బి కంపెనీలు నేరుగా తుది వినియోగదారులను చేరలేవు. రెండోది, వాటివల్ల కిరాణా వ్యాపారులకు దళారుల వ్యయాలు తగ్గుతాయి. వ్యాపారం మరింత లాభపాటి అవుతుంది. కాబట్టే సంప్రదాయ కిరాణా దుకాణాలు బి2బి విస్తరణపై అంతగా ఆందోళన చెందడంలేదు. జియోమార్ట్, అమెజాన్లతో డిజిటల్ అనుసంధానమే చాలామంది కిరాణా దుకాణదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పెద్ద సంస్థలతో భాగస్వామ్యం నమ్మకం ప్రాతిపదికగా తాము సంపాదించుకున్న స్థానిక ఖాతాదారులను మింగేస్తుందేమో అన్నదే వారి భయం. కాలం గడిచేకొద్దీ తమ ఖాతాదారులు, పెద్ద సంస్థలు పరస్పరం నేరుగా అనుసంధానమయ్యే అవకాశం లేకపోలేదని, అప్పుడు మధ్యలో ఉండే తమ అవసరం తీరిపోతుందని కిరాణా విక్రేతలు సందేహిస్తున్నారు. ఇవే భయాలను, అభ్యంతరాలను వారు అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) వద్ద వ్యక్తం చేశారు. మహమ్మారి విజృంభణతో ఆన్‌లైన్ వ్యాపారం ఒక్కపెట్టున పెరిగిన దృష్ట్యా- ఈ సమాఖ్య 2020 ఏప్రిల్‌లో తమ సభ్యుల మనోభావాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు వెల్లడించింది. సీఏఐటీ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న వాణిజ్య మంత్రిత్వ శాఖ వెన్వెంటనే స్పందించింది. ఆ మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు అంతర్గత వర్తక ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సీఏఐటీతో కలిసి ‘భారత్ ఇ-మార్కెట్’ పేరిట జాతీయ ఇ-కామర్స్ గవాక్షం రూపకల్పన బాధ్యత చేపట్టింది. అఖిల భారత వర్తక సంక్షేమ సంఘం ఈ పోర్టల్‌కు అవసరమైన వస్తు సేవల నిర్వహణకు సంబంధించి మద్దతు అందిస్తోంది.
దేశీయ సంస్థలకు భరోసా
అనుసంధానత, సరఫరా గొలుసులకు సంబంధించిన సమస్యల్ని ఎదుర్కొంటున్న రెండో, మూడో శ్రేణి నగరాల స్థానిక కిరాణా దుకాణాలకు ప్రత్యేకించి భారత ఇ-మార్కెట్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అంచనా. చిల్లర విక్రేతలను నమోదు చేసుకునేందుకు సీఏఐటీ త్వరలోనే మొబైల్ యాప్ ప్రారంభిస్తుంది. భారత ఇ-మార్కెట్లో చైనా వస్తువులు విక్రయించబోమని సీఏఐటీ వాగ్దానం చేసింది. మరో ముఖ్యాంశం ఏమిటంటే, విక్రేతల నుంచి కమిషన్లూ వసూలు చేయదు. ఎలాంటి రుసుమూ లేకుండానే వస్తువులను ఇంటికి సరఫరా చేస్తుంది. ప్రభుత్వం నిరంతరం చిన్నస్థాయి చిల్లర వర్తకుల ప్రయోజనాలను సంరక్షిస్తుందని 2020 అక్టోబరు 30న భారత ఇ-మార్కెట్ లోగో విడుదల సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ హామీ ఇవ్వడం- ఈ విషయంలో కేంద్రం అభిమతాన్ని స్పష్టం చేస్తోంది. భారతీయ ఇ-కామర్స్ కంపెనీలు తమ విదేశీ ప్రత్యర్థుల కంటే అధిక ప్రయోజనం పొందేందుకు వీలుగా విదేశీ కంపెనీల మీద ప్రభుత్వం సమానీకరణ సుంకం (ఈక్వలైజేషన్ లెవీ) విధిస్తోంది. అది అమెజాన్ కావచ్చు, లేదా నెట్‌ఫ్లిక్స్ కావచ్చు. విదేశాల నుంచి నడిచే అన్ని విదేశీ వ్యాపార సంస్థలకూ తప్పించుకునే వీల్లేకుండా ఈ రెండుశాతం లెవీ వర్తిస్తుంది.
- రాజీవ్ రాజన్